వీధిబాలల గుర్తింపులో వినూత్న మలుపు | Johnson Choragudi Article On Operation Muskan In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వీధిబాలల గుర్తింపులో వినూత్న మలుపు

Published Fri, Nov 27 2020 12:52 AM | Last Updated on Fri, Nov 27 2020 12:52 AM

Johnson Choragudi Article On Operation Muskan In Andhra Pradesh - Sakshi

ప్రభుత్వం దృష్టికి వస్తున్న సమస్యకు వెనువెంటనే పరిష్కారం వెతకడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్న కొత్తధోరణి. ఎప్పటి మాదిరి గానే ఈ ఏడాది ఇది జరిగినా ఈసారి అది ఒక సరికొత్త సంస్కరణకు దారితీసింది. అక్టోబర్‌ 21 పోలీస్‌ సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీస్‌ శాఖ ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ పేరుతో నాలుగు రోజులపాటు నిర్వహించిన ‘మిస్సింగ్‌’ పిల్లల గాలింపు చర్యల్లో 16,400 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లల్ని ‘వీధి బాలలు’గా గుర్తించి రక్షణ కల్పించింది. 

ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఈ పిల్లల్లో పెద్ద సంఖ్యలో బాలికలు కూడా ఉన్నారు. వీరంతా మన రాష్ట్రంలో పలు పరిశ్రమలు, రెస్టారెంట్లలోనూ, వ్యవసాయ పనులలోనూ, మరికొందరు బిక్షాటనలోనూ ఎటువంటి భద్రతలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో నిర్వహించిన ఆరవ ‘డ్రైవ్‌’లో 4,800 మంది పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామనీ, అయితే ఈ ఏడవ ‘డ్రైవ్‌’లో 16,400 మంది దొరకడం అంటే, ఇది దేశంలోనే పెద్ద సంఖ్య అనీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ గౌతం సవాంగ్‌ అంటున్నారు.

ఈ పరిణామం మూలాల కోసం ఇక్కణ్ణించి మనం ఆరేడు నెలలు వెనక్కి వెళ్లి చూసినప్పుడు, అప్పటికి మన దేశం ‘కోవిడ్‌ కారణంగా ‘లాక్‌డౌన్‌’లో వుంది. ఏప్రిల్‌–మే నాటికి వలస కార్మికుల దుస్థితి, పరిష్కారానికి అలవికాని స్థాయికి చేరింది. ఈ దశలో అందరూ కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూసినప్పటికీ, ‘అస్సలు వాళ్ళంతా ఏ రాష్ట్రాల వారు, వాళ్ళు ఎక్కడికి వలస వెళ్లి ఏమి పనిచేస్తున్నారు వంటి గణాంకాలు ఏవీ తమ వద్ద లేవు’ అని ప్రభుత్వం పార్లమెంట్‌లోనే తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. అయితే పనిస్థలం నుంచి స్వస్థలాలకు తిరుగు ప్రయాణానికి ఇటు దక్షిణ రాష్ట్రాలకు అటు సెంట్రల్‌ ఇండియాకు భౌగోళికంగా మధ్యన వున్న ఏపీ.. వలస కార్మికులకు ఒక ‘వారధి’గా నిలి చింది. 

విజయవాడ జంక్షన్‌ అందుకు సాక్షి కావడమే కాదు, అది అన్నార్తులైన బాటసారులను అక్కున చేర్చుకున్న– ‘అమ్మఒడి’ అయింది. అయితే ఇది జరిగిన ఆరు నెలలలోనే మళ్ళీ అవే రాష్ట్రాలకు చెందిన బాలలు పెద్ద సంఖ్యలో ఇక్కడ బతుకుదెరువు వెతుకులాటలో, అమానవీయ పరిస్థితుల్లో పరిపాలనా యంత్రాంగం నిఘా దృష్టికి రావడం, ఇప్పుడు లోతైన అధ్యయనం అవసరమైన అంశం అవుతున్నది. ఐతే గడచిన 3 దశాబ్దాల్లో ఇక్కడ సామాజిక శాస్త్రాల చదువులు అటకెక్కడం కూడా మనం మర్చిపోకూడదు. 

కరోనా వైరస్‌ సమస్య ‘ఎపిడమిక్‌’ స్థాయికి చేరాక, మొదట ఈ పిల్లల తల్లిదండ్రులు, ఆ తర్వాత పిల్లలకు ఆంధ్రప్రదేశ్‌ మజిలీ స్థావరం కావడానికి, దీని భౌగోళిక ‘ప్రాధాన్యతా స్థానం’ ఒక్కటే కాకుండా, ఇతర కారణాలూ ఉన్నాయి. 1. తూర్పు కనుమలలో ఈ రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలుగా వర్గీకరించడం 2. ఈ బాలలు పెద్ద  ఎత్తున ఖనిజ వనరుల తవ్వకాలు జరుగుతున్న రాష్ట్రాలకు చెందినవారు కావడం 3. ప్రాజెక్టు నిర్వాసితుల్లో ఇంకా కొందరికి ప్రభుత్వ రికార్డుల్లో చోటు లేక సహాయం అందకపోవడం 4. స్థానిక సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఈ కుటుంబాలకు ఉపాధి భద్రత లేకపోవడం 5. ఆంధ్రప్రదేశ్‌లో వేతనాలు ఎలా ఉన్నప్పటికీ ఉపాధి, స్పందించే పౌర సమాజం, జీవన భద్రతకు మెరుగైన పోలీసింగ్‌ ఇక్కడ ఉండడం వంటివి కొన్ని స్థూలంగా కనిపిస్తున్నాయి. లోతుల్లోకి వెళితే తెలియనివి ఎన్నో ఉండొచ్చు.

అయితే, అందుబాటులో ఇంత పెద్ద సంఖ్యలో వీధి బాలలు ఉంటే, రేపు వీరి నిస్సహాయతను ‘క్యాష్‌’ చేసుకునేవారికి వీరు చౌకైన కూలీలు అవుతారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్నప్పుడు, హిందీ భాష మాట్లాడగలిగిన ఈ పిల్లల్ని మున్ముందు ఇక్కడి చీకటి శక్తులు అసాంఘిక చర్యలకు వాడుకోవడం తేలిక. ప్రతిపాదిత పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం తర్వాత కోస్తాంధ్రలో రూపుతీసుకునే నేరమయ సామాజిక ముఖచిత్రం పట్ల, మన ముందస్తు అప్రమత్తత అవసరాన్ని ఈ ‘2020 ఆపరేషన్‌ ముస్కాన్‌’ వెలుగులోకి తెచ్చింది. ఈ దశలో సీఎం చొరవతో ప్రభుత్వం రాష్ట్రంలో ‘జువెనైల్‌ జస్టిస్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌) 2015’ చట్టం అమలుకు ఉపక్రమించింది. 

ఈ చట్టంలోని సెక్షన్‌ 107 ప్రకారం, ప్రతి పోలీస్‌ స్టేషన్లో ‘చైల్డ్‌ వెల్ఫేర్‌ పోలీస్‌ ఆఫీసర్‌’ పోస్ట్‌ ఉండాలి. వీరు స్టేషన్లో విధుల్లో ఉన్నప్పుడు గులాబీ రంగు ‘టీ–షర్టు’తో ఉంటారు. ఇందులో భాగంగా ముందుగా కృష్ణాజిల్లాలో ఐదు ‘చైల్డ్‌ ఫ్రెండ్లీ’ పోలీస్‌ స్టేష న్లను ప్రత్యేకంగా రూపొందించారు. సమస్య మూలాల్లోకి చూసినప్పుడు, భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘ఆర్‌ – ఆర్‌ – 2013 ప్యాకేజీ’ హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీలోనే తయారైంది. అది రూపొందించిన ‘సామాజిక ప్రభావిత అంచనా’ ప్రమాణాలు దక్షిణ ఆసియాలోనే అత్యంత సమగ్రమైనవిగా ప్రపంచ బ్యాంక్‌ గుర్తించింది. 

అటువంటప్పుడు, దానిపట్ల ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ స్పృహ ఉంటుందనీ, ఉండాలనీ మనం ఆశిస్తాం. పోలవరం ఆదివాసీ నిర్వాసితుల పునరావాసం విషయంలో ఈ చట్టం స్ఫూర్తిని నిజాయితీతో మనం అమలు చేయాలి. అటువంటిదే, నల్లమల అటవీ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కూడా. అటువంటి సున్నిత స్పృహ కనుక లేకపోతే జరిగేది ఏమిటో, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితుల అసంపూర్ణ పునరావాస చర్యలు నుంచి తెలుసుకోవడం అవసరం. 

పాతికేళ్ళ క్రితం నల్లగొండ జిల్లా దేవరకొండ మండల గ్రామాల్లోని సుగాలీ తండాల్లో తల్లులు జీవిక కోసం తమ ఆడశిశువుల్ని అమ్ముకొంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కలెక్టర్‌ శ్రీమతి నీలం సాహ్నీ (1996–99)  చొరవతో, సమస్య మూలాల్లోకి వెళితే, డొంక కదిలి చివరికి వెలుగులోకి వచ్చిన విషయం– వాళ్ళంతా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులు అని! అయితే, ‘కోవిడ్‌–19’ తీవ్రతతో ఆంధ్రప్రదేశ్‌ మీదుగా తమ స్వస్థలాలకు వెళుతున్న వలసకార్మికుల విషయంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అనుసరించిన మానవీయ ధోరణితోపాటు, పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీగా శ్రీమతి నీలం సాహ్నీ ఉండడం కేవలం యాదృచ్ఛికమే! 
వ్యాసకర్త: జాన్‌సన్‌ చోరగుడి, అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత 

ఈ–మెయిల్‌ : johnson.choragudi@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement