child safety
-
బాలల భద్రత తక్షణ కర్తవ్యం
ఎన్ని చట్టాలు వచ్చినా పిల్లలపై ఘోరాలు కొనసాగుతూ ఉండడం బాధాకరం. జూన్ నెలలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్‌మిల్ దగ్గర ఆరేళ్ల బాలిక, మియాపూర్ నడిగడ్డ తండా వద్ద 12 ఏళ్ల బాలిక లైంగిక హింస, హత్యలకు గురవ్వడం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. వలస వెళ్ళిన నిరు పేద కుటుంబాలకు చెందిన ఈ బాలికలు సామజిక మాధ్యమాల మద్దతుకు కూడా నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకూ ఒక బాలల పరిరరక్షక విధానం లేదు. సమగ్ర విధానం రూపొందించి, రాష్ట్రంలోని అన్ని సంస్థలలో అమలు పరిచేట్లు చూడటం బాలలపై లైంగిక నేరాలనుంచి రక్షణ (పోక్సో) చట్టం – 2012, నిబంధన 3 (5) ప్రకారం తప్పనిసరి. పోక్సో చట్టం ప్రకారం బాల స్నేహ పూర్వక ప్రత్యేక న్యాయస్థానాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం ఏదైనా సంస్థ పరిధిలో బాలలపై నేరం జరిగినా, జరిగే అవకాశం ఉన్నా ఆ సంస్థ అధిపతి లేక యజమాని వెంటనే పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. ఈ బాధ్యత నిర్వహణలో విఫలమైతే ఏడాది జైలుశిక్ష విధించ వచ్చు. పోక్సో చట్టం నిబంధన 3 (4) ప్రకారం బాలలు సందర్శించే అన్ని సంస్థలు, పాఠశాలలు, క్రెష్‌లలో సిబ్బంది, ఉపాధ్యాయులకు ఏమైనా నేర చరిత్ర ఉన్నదా అని పోలీసు శాఖచే వారి నేపథ్య తనిఖీ క్రమబద్ధంగా చేయడం తప్పనిసరి. చట్ట పరమైన రక్షణ, పోక్సో చట్టం కింద పడేశిక్షల తీవ్రత గురించి అవగాహన పెంచితే నేరాలు తగ్గవచ్చు. 18 ఏళ్ళ లోపు బాలలపై లైంగిక హింస చేస్తే 20 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ నేరం బంధువులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల సిబ్బంది, వసతి గృహ సిబ్బంది చేస్తే మరణ శిక్షకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే తమిళనాడు, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర రాష్ట్రాలలో పోక్సో చట్టం ప్రకారం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానాలు త్వరితంగా విచారణ పూర్తి చేసి బాలలపై లైంగిక దాడి చేసిన నేరస్థులకు మరణ శిక్షలు విధించాయి.ఆంధ్రప్రదేశ్ 2019లో ‘దిశ’ హత్యకు ప్రతిస్పందనగా ‘దిశ చట్టం’ (ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం–2019), మహారాష్ట్ర ‘శక్తి క్రిమినల్ చట్టాల (మహారాష్ట్ర సవరణ) చట్టం 2020’ అమలు చేసే ప్రయత్నం చేశాయి. ఈ చట్టాల ప్రకారం బాలలు, మహిళలపై జరిగిన నేరాల పరిశోధన, న్యాయ విచారణ త్వరితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రపతి అనుమతి రానందున ఈ రెండు చట్టాలు అమలు లోకి రాలేదు. నారాయణపేట జిల్లాలో జూన్ 13న సంజీవ్ అనే వ్యక్తిపై ప్రాణాంతక దాడి జరుగుతున్న సమయంలో 100 నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని తెలిసింది. తెలంగాణలో ‘112 ఇండియా’, ‘దిశ’ వంటి ఎమర్జెన్సీ యాప్‌లను వెంటనే అందుబాటులోకి తీసుకు రావాలి. ఆంధ్రప్రదేశ్ దిశ యాప్ 1.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ మధ్య ప్రవేశపెట్టిన టీ–సేఫ్ యాప్ ప్రయాణాల్లో అత్యవసర సాయం కోసం, హెల్ప్ లైన్ 100 డయల్ చేసేందుకు పని చేస్తుంది. కానీ 112 ఇండియా, దిశ వంటి యాప్‌లలో పోలీసులతో పాటు ఇతరులకు కూడా తక్షణ సమాచారం చేరవేసే అవకాశం ఉంది. ఫోన్ గట్టిగా ఊపడం ద్వారా కూడా తక్షణ సందేశం పంపవచ్చు. మొబైలు ఫోన్ హ్యాండ్ సెట్ ప్యానిక్ బటన్, జీపీఎస్ నిబంధనలు– 2016 ప్రకారం... ఫీచర్ ఫోన్లో 5 లేక 9 నంబర్‌ను స్మార్ట్ ఫోన్లో అయితే ఆన్–ఆఫ్ మీట 3 సార్లు నొక్కితే పోలీసు అత్యవసర హెల్ప్ లైన్‌కు సందేశం వెళ్ళాలి. ఈ విషయంపై ప్రజలలో అవగాహన అవసరం. ఏ దేశానికైనా అత్యంత విలువైన ఆస్తిపాస్తులు బాలలు. వారిని కాపాడటం కోసం అన్ని మార్గాలూ వెదకాలి. శ్రీనివాస్ మాధవ్ వ్యాసకర్త ఆర్టీఐ కార్యకర్త ‘ 9247 159 343 -
ఏది గుడ్.. ఏది బ్యాడ్?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధుల కళ్లు పడుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసిన వారే దుశ్చర్యకు ఒడిగడుతున్నారు. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే, మన పిల్లలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్.. అన్నది చెప్పాలి. తాకకూడని చోట ఎవరైనా తడిమితే, భయపడకుండా ‘డోంట్ టచ్ మీ’ అని గట్టిగా అరవాలి.. అక్కడి నుంచి పరుగెత్తాలి.. ఎవరికైనా జరిగిన విషయాన్ని చెప్పాలి.. దీనిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. చదవండి: రేటు ఎంతైనా.. రుచి చూడాల్సిందే! బాలికలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. లైంగిక వేధింపులు, బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగేలా జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ, మహిళాభివృద్ధి శిశు, సంక్షేమం, ఫోరమ్ ఫర్ చైల్డ్ లైన్, పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రత్యేక నినాదాలతో అవగాహన ♦తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ‘అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి’ (షౌట్.. రన్.. టెల్) నినాదాలతో ఆపదలో ఉన్న పిల్లలకు తెలిసే విధంగా ప్రచార పోస్టర్లను తయారు చేశారు. ♦వీటిని జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, ఎంపీడీఓ, తహసీల్దార్, గ్రామ, వార్డు సచివాలయాలు, వసతి గృహాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, ప్రముఖ కూడళ్ల వద్ద శాశ్వతంగా ఉండేలా ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ♦ఆయా పోస్టర్లపై చైల్డ్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ హైల్ప్ లైన్ 100 నంబర్లను ఉంచారు. ♦పాఠశాలలో నిర్వహించే అసెంబ్లీలో లైంగిక వేధింపులు, బాలల హక్కులపై చర్చించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ♦గుడ్, బ్యాడ్ టచ్ మధ్య వ్యత్యాసంపై ఎనిమిది నిమిషాల నిడివితో వీడియో క్లిప్ రూపొందించారు. ♦దీనిలో ఎవరైనా శరీర రహస్య భాగాలను తాకినా వెంటనే నిలువరించేందుకు వీలుగా బిగ్గరగా ‘అరవటం’.. వారి నుంచి సాధ్యమైనంత దూరంగా ‘పరుగెత్తడం’.. ♦తల్లిదండ్రులకు/పెద్దవారికి తెలిసేలా ‘చెప్పండి’ వంటి వాటితో అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన సదస్సులు.. జిల్లాలోని లా అండ్ ఆర్డర్ పోలీసులు, దిశ అధికారులు, చైల్డ్ లైన్ సహకారంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నివారించేందుకు వీలుగా ప్రజలకు అవగాహన కల్పించి, నేరాలను అరికట్టాలనే భావనతో ముందుకు వెళ్తున్నారు. పిల్లలకు గుడ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అన్న విషయాలను ఏ విధంగా చెప్పాలి. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాలు చేసిన వారిపై ఎటువంటి శిక్షలు ఉంటాయనే దానిపైన సదస్సుల్లో వివరిస్తున్నారు. బాలికలకు అవగాహన కల్పిస్తున్నాం.. లైంగిక వేధింపులు, బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆపదలో ఉన్న పిల్లలకు తెలిసే విధంగా ప్రత్యేక పోస్టర్లను తయారు చేసి, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నాం. బ్యాడ్, గుడ్ టచ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసంపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హెల్ప్‌లైన్ నంబర్లపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. – ఎస్. ఢిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా బాలలపై నేరాలను అరికట్టే విధంగా చర్యలు జిల్లాలో బాలలపై జరుగుతున్న నేరాలను అరికట్టే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఆపదలో ఉన్న వారు హెల్ప్ లైన్ నంబర్లు వినియోగించుకొనేలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. – టి.కె. రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
షీ టీమ్స్ పనితీరు భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్ పనితీరుపై 96 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 4 శాతం మంది తాము చేసిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను తెలపకపోవడం, ఫిర్యాదు చేసేందుకు వెళితే సరిగ్గా స్పందించలేదని చెప్పారు. ఈ గణాంకాలను పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో షీ టీమ్స్ సంబంధిత నేరాలపై స్పందించిన అధికారులతో ఒక్క రోజు ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని షీ టీమ్స్ అధికారులు, షీ టీమ్స్‌కు పట్టుబడ్డ దాదాపు 120 మంది నిందితులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని స్వాతిలక్రా పేర్కొన్నారు. షీ టీమ్స్ పనితీరుపై ప్రముఖ సంస్థ ‘సెస్’ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే చేయించామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపుల కేసులు, ఈవ్ టీజింగ్‌లపై అధికంగా వాట్సాప్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని కేసులుగా నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న డీఐజీ సుమతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో షీ టీమ్స్ పనితీరుపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్‌లో షీటీమ్స్‌కు పట్టుపడ్డ వారిలో అధికంగా విద్యావంతులు, మేజర్లే ఉన్నారన్నారు. తప్పు చేస్తే ఎవరినీ వది లేది లేదని.. సైబరాబాద్ పరిధిలో మహిళలను వేధించిన ఘటనలో 51 ఏళ్ల వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే ఇం దుకు నిదర్శనమన్నారు. కాగా, మనో చేతనకు చెందిన గీతా చల్లా ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. నవంబర్‌లో అధికంగా ఫిర్యాదులు నవంబర్‌లో షీ టీమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 464 ఫిర్యాదులు అందాయి. ఇందులో నేరుగా 151, పరోక్షంగా (వాట్సాప్, ఈ–మెయిల్, ట్విటర్, హాక్–ఐ) 313 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఫోన్ ద్వారా వేధింపులు కాగా, 246 ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు తదితరాలు ఉన్నాయి. వీరిలో 90 మందిని హెచ్చరించి, 82 మందికి కౌన్సెలింగ్ చేసి పంపారు. 56 మందిపై కేసులు నమోదు కాగా, 52 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
వీధిబాలల గుర్తింపులో వినూత్న మలుపు
ప్రభుత్వం దృష్టికి వస్తున్న సమస్యకు వెనువెంటనే పరిష్కారం వెతకడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్న కొత్తధోరణి. ఎప్పటి మాదిరి గానే ఈ ఏడాది ఇది జరిగినా ఈసారి అది ఒక సరికొత్త సంస్కరణకు దారితీసింది. అక్టోబర్ 21 పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో నాలుగు రోజులపాటు నిర్వహించిన ‘మిస్సింగ్’ పిల్లల గాలింపు చర్యల్లో 16,400 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లల్ని ‘వీధి బాలలు’గా గుర్తించి రక్షణ కల్పించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఈ పిల్లల్లో పెద్ద సంఖ్యలో బాలికలు కూడా ఉన్నారు. వీరంతా మన రాష్ట్రంలో పలు పరిశ్రమలు, రెస్టారెంట్లలోనూ, వ్యవసాయ పనులలోనూ, మరికొందరు బిక్షాటనలోనూ ఎటువంటి భద్రతలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో నిర్వహించిన ఆరవ ‘డ్రైవ్’లో 4,800 మంది పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామనీ, అయితే ఈ ఏడవ ‘డ్రైవ్’లో 16,400 మంది దొరకడం అంటే, ఇది దేశంలోనే పెద్ద సంఖ్య అనీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ అంటున్నారు. ఈ పరిణామం మూలాల కోసం ఇక్కణ్ణించి మనం ఆరేడు నెలలు వెనక్కి వెళ్లి చూసినప్పుడు, అప్పటికి మన దేశం ‘కోవిడ్ కారణంగా ‘లాక్డౌన్’లో వుంది. ఏప్రిల్–మే నాటికి వలస కార్మికుల దుస్థితి, పరిష్కారానికి అలవికాని స్థాయికి చేరింది. ఈ దశలో అందరూ కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూసినప్పటికీ, ‘అస్సలు వాళ్ళంతా ఏ రాష్ట్రాల వారు, వాళ్ళు ఎక్కడికి వలస వెళ్లి ఏమి పనిచేస్తున్నారు వంటి గణాంకాలు ఏవీ తమ వద్ద లేవు’ అని ప్రభుత్వం పార్లమెంట్‌లోనే తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. అయితే పనిస్థలం నుంచి స్వస్థలాలకు తిరుగు ప్రయాణానికి ఇటు దక్షిణ రాష్ట్రాలకు అటు సెంట్రల్ ఇండియాకు భౌగోళికంగా మధ్యన వున్న ఏపీ.. వలస కార్మికులకు ఒక ‘వారధి’గా నిలి చింది. విజయవాడ జంక్షన్ అందుకు సాక్షి కావడమే కాదు, అది అన్నార్తులైన బాటసారులను అక్కున చేర్చుకున్న– ‘అమ్మఒడి’ అయింది. అయితే ఇది జరిగిన ఆరు నెలలలోనే మళ్ళీ అవే రాష్ట్రాలకు చెందిన బాలలు పెద్ద సంఖ్యలో ఇక్కడ బతుకుదెరువు వెతుకులాటలో, అమానవీయ పరిస్థితుల్లో పరిపాలనా యంత్రాంగం నిఘా దృష్టికి రావడం, ఇప్పుడు లోతైన అధ్యయనం అవసరమైన అంశం అవుతున్నది. ఐతే గడచిన 3 దశాబ్దాల్లో ఇక్కడ సామాజిక శాస్త్రాల చదువులు అటకెక్కడం కూడా మనం మర్చిపోకూడదు. కరోనా వైరస్ సమస్య ‘ఎపిడమిక్’ స్థాయికి చేరాక, మొదట ఈ పిల్లల తల్లిదండ్రులు, ఆ తర్వాత పిల్లలకు ఆంధ్రప్రదేశ్ మజిలీ స్థావరం కావడానికి, దీని భౌగోళిక ‘ప్రాధాన్యతా స్థానం’ ఒక్కటే కాకుండా, ఇతర కారణాలూ ఉన్నాయి. 1. తూర్పు కనుమలలో ఈ రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలుగా వర్గీకరించడం 2. ఈ బాలలు పెద్ద ఎత్తున ఖనిజ వనరుల తవ్వకాలు జరుగుతున్న రాష్ట్రాలకు చెందినవారు కావడం 3. ప్రాజెక్టు నిర్వాసితుల్లో ఇంకా కొందరికి ప్రభుత్వ రికార్డుల్లో చోటు లేక సహాయం అందకపోవడం 4. స్థానిక సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఈ కుటుంబాలకు ఉపాధి భద్రత లేకపోవడం 5. ఆంధ్రప్రదేశ్‌లో వేతనాలు ఎలా ఉన్నప్పటికీ ఉపాధి, స్పందించే పౌర సమాజం, జీవన భద్రతకు మెరుగైన పోలీసింగ్ ఇక్కడ ఉండడం వంటివి కొన్ని స్థూలంగా కనిపిస్తున్నాయి. లోతుల్లోకి వెళితే తెలియనివి ఎన్నో ఉండొచ్చు. అయితే, అందుబాటులో ఇంత పెద్ద సంఖ్యలో వీధి బాలలు ఉంటే, రేపు వీరి నిస్సహాయతను ‘క్యాష్’ చేసుకునేవారికి వీరు చౌకైన కూలీలు అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్నప్పుడు, హిందీ భాష మాట్లాడగలిగిన ఈ పిల్లల్ని మున్ముందు ఇక్కడి చీకటి శక్తులు అసాంఘిక చర్యలకు వాడుకోవడం తేలిక. ప్రతిపాదిత పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తర్వాత కోస్తాంధ్రలో రూపుతీసుకునే నేరమయ సామాజిక ముఖచిత్రం పట్ల, మన ముందస్తు అప్రమత్తత అవసరాన్ని ఈ ‘2020 ఆపరేషన్ ముస్కాన్’ వెలుగులోకి తెచ్చింది. ఈ దశలో సీఎం చొరవతో ప్రభుత్వం రాష్ట్రంలో ‘జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) 2015’ చట్టం అమలుకు ఉపక్రమించింది. ఈ చట్టంలోని సెక్షన్ 107 ప్రకారం, ప్రతి పోలీస్ స్టేషన్లో ‘చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్’ పోస్ట్ ఉండాలి. వీరు స్టేషన్లో విధుల్లో ఉన్నప్పుడు గులాబీ రంగు ‘టీ–షర్టు’తో ఉంటారు. ఇందులో భాగంగా ముందుగా కృష్ణాజిల్లాలో ఐదు ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ పోలీస్ స్టేష న్లను ప్రత్యేకంగా రూపొందించారు. సమస్య మూలాల్లోకి చూసినప్పుడు, భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘ఆర్ – ఆర్ – 2013 ప్యాకేజీ’ హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలోనే తయారైంది. అది రూపొందించిన ‘సామాజిక ప్రభావిత అంచనా’ ప్రమాణాలు దక్షిణ ఆసియాలోనే అత్యంత సమగ్రమైనవిగా ప్రపంచ బ్యాంక్ గుర్తించింది. అటువంటప్పుడు, దానిపట్ల ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ స్పృహ ఉంటుందనీ, ఉండాలనీ మనం ఆశిస్తాం. పోలవరం ఆదివాసీ నిర్వాసితుల పునరావాసం విషయంలో ఈ చట్టం స్ఫూర్తిని నిజాయితీతో మనం అమలు చేయాలి. అటువంటిదే, నల్లమల అటవీ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కూడా. అటువంటి సున్నిత స్పృహ కనుక లేకపోతే జరిగేది ఏమిటో, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల అసంపూర్ణ పునరావాస చర్యలు నుంచి తెలుసుకోవడం అవసరం. పాతికేళ్ళ క్రితం నల్లగొండ జిల్లా దేవరకొండ మండల గ్రామాల్లోని సుగాలీ తండాల్లో తల్లులు జీవిక కోసం తమ ఆడశిశువుల్ని అమ్ముకొంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కలెక్టర్ శ్రీమతి నీలం సాహ్నీ (1996–99) చొరవతో, సమస్య మూలాల్లోకి వెళితే, డొంక కదిలి చివరికి వెలుగులోకి వచ్చిన విషయం– వాళ్ళంతా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు అని! అయితే, ‘కోవిడ్–19’ తీవ్రతతో ఆంధ్రప్రదేశ్ మీదుగా తమ స్వస్థలాలకు వెళుతున్న వలసకార్మికుల విషయంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అనుసరించిన మానవీయ ధోరణితోపాటు, పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శ్రీమతి నీలం సాహ్నీ ఉండడం కేవలం యాదృచ్ఛికమే! వ్యాసకర్త: జాన్సన్ చోరగుడి, అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత ఈ–మెయిల్ : johnson.choragudi@gmail.com -
మిరాకిల్.. ఈ బుడ్డోడు చాలా గట్టోడు
చాలా మంది చిన్న పిల్లలతో కలిసి కారులో ప్రయాణించే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. కారు డోర్లు లాక్ వేయకపోవడం.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లాంటి నిర్లక్ష్యపు పనులు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో... నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయతో తెలియజేసే వీడియోను ట్విట్ చేశాడు పంకజ్ నైన్ అనే ఐపీఎస్ అధికారి. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. కారు డోర్ లాక్ చేయకపోవడంతో టర్నింగ్ పాయింట్ వద్ద డోర్ లాక్ తెరచుకొని ఓ చిన్న బాలుడు కిందపడ్డాడు. హైవే రోడ్డు.. నలుదిక్కుల వాహనాలు ప్రయాణిస్తున్నా .. అదృష్టంకొద్ది ఈ బుడ్డోడు బతికిబయటపడ్డాడు. కారులోనుంచి కిందపడే సమయానికి ఎదురుగా ఓ బస్సు, బైక్.. పక్కనుంచి ఓ ఆటో వస్తుంది. బాలుడు కిందపడగానే అందరూ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదమేమి కాలేదు. వెంటనే బాలుడి తండ్రి వచ్చి.. బుడ్డొడిని కారులో తీసుకొని వెళ్లాడు. అయితే తండ్రి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు డోర్ లాక్ వేయకుండా.. ఉండడం వల్లే బాలుడు కిందపడ్డాడు ‘ పిల్లలతో కలిసి ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కారు డోర్లు లాక్ చేశామా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకోండి. పిల్లలు సీటులో సరిగా కూర్చున్నారా లేదా చెక్ చేసుకొని ప్రయాణించండి. అందరూ ఈ బాలుడిలాగా అదృష్టవంతులు ఉండరు కదా’ అని పంకజ్ ట్వీట్ చేశారు. -
మిరాకిల్.. ఈ బుడ్డోడు చాలా గట్టోడు
-
ఆ పాప వేసిన కన్నీటిబొమ్మ
పిల్లల భద్రత కోసం మంచి ఇంట్లో ఉండాలనుకుంటాం. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉన్న అపార్ట్మెంట్లోనే ఉండాలనుకుంటాం. పిల్లల బ్రేక్‌ఫాస్ట్ కోసం లంచ్, డిన్నర్ల కోసం వారికి ఇష్టమైనదే వండాలనుకుంటాం. పిల్లల స్నాక్స్ అయిపోక ముందే తెచ్చి పెట్టేస్తాం. కాని పిల్లలకు కావలసింది ఏమిటి?అమ్మానాన్నలు వారికి ఇవ్వాల్సిందే ఇస్తున్నారా? తాము ఏమిస్తున్నారోగమనిస్తున్నారా? రోజూ క్లాస్‌లో లాస్ట్ పిరియడ్ డ్రాయింగ్ ఉంటుంది.థర్డ్ క్లాస్ సి సెక్షన్ అది. మొత్తం 30 మంది పిల్లలు ఉంటారు. రోజంతా వాళ్లు క్లాసుల్లో ఎలా పార్టిసిపేట్ చేసినా ఈ పిరియడ్‌లో మాత్రం ఉత్సాహంగా డ్రాయింగ్ బుక్ పట్టుకుంటారు. కొందరు పెన్సిల్‌తో వేస్తారు. కొందరు పేస్టల్స్‌తో వేస్తారు. కొందరు వాటర్ కలర్స్ కలపడానికి కావలసిన వాటర్ కోసం బ్యాగుల్లోని వాటర్ బాటిల్స్ తీస్తారు. బల్లలన్నీ రంగుల మయం అవుతాయి. కొత్త ఊహలకు రెక్కలు వస్తాయి.క్లాస్ టీచర్‌కు రోజూ కుతూహలంగా ఉంటుంది – ఇవాళ పిల్లలు ఏం బొమ్మలు వేస్తారా అని.వాటిలో కొన్ని చాలా గొప్ప ఆర్టిస్ట్‌లు వేసినంత బాగా ఉండి ఆకట్టుకుంటాయి. కొన్ని బొత్తిగా వొంకర టింకరగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. అవైనా ఇవైనా పిల్లలు వేసినవే కదా. అందుకే వాటిని చూడటం బాగుంటుంది.పిరియడ్ అయిపోయింది. ఒక్కొక్కరే వచ్చి వేసిన బొమ్మలను చూపించడం మొదలుపెట్టారు. టీచర్ ఒక బొమ్మ చూసి షాక్ అయ్యింది. వేసిన పాప వైపు చూసింది. హిమజ. వేసిన బొమ్మను చాలా మామూలుగా చూపుతూ ఉంది.ఆ బొమ్మ చనిపోయిన పావురం. పక్కన ఏడుస్తున్న పావురం. పెద్ద పావురం చనిపోతే చిన్న పావురం ఏడుస్తూ ఉంది.‘హిమజ.. ఈ పావురానికి ఏమైందమ్మా.. ఫీవర్ వచ్చిందా.. ఎవరైనా షూట్ చేశారా?’ పాప మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసింది.పాప ఏమీ చెప్పలేదు.లాంగ్ బెల్ వినిపించింది. అందరూ వెళ్లిపోయారు. టీచర్ ఆ రాత్రి కొంచెం సేపు హిమజ గురించి ఆలోచించింది. హిమజ క్లాస్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. చాలా బాగా చదువుతుంది. వీలు దొరికితే అల్లరి చేస్తుంది. ముగ్గురు కూచునే బెంచిలో మిగిలిన ఇద్దరిని ఎలాగైనా మాటల్లో పెడుతుంది. ఆ పిల్లను మాట్లాడనీయకుండా చేయడానికి టీచర్ బెంచీలన్నీ మారుస్తుంటుంది. ఏ బెంచీలో కూచోబెట్టినా కాసేపట్లోనే మిగిలిన ఇద్దరినీ ఫ్రెండ్స్‌గా చేసుకుంటుంది. అంత ఉరకలు వేసే స్టూడెంట్.కాని వారం రోజులుగా డల్‌గా ఉంటోంది. ఇప్పుడు బొమ్మల్లో మార్పు కనిపిస్తోంది. ఇంతకు ముందు తూనీగలు, గాలిపటాలు వేసేది. కార్టూన్ క్యారెక్టర్స్ వేసేది. కాని ఇప్పుడు తిక్క తిక్కగా వేస్తోంది. మూడు రోజుల క్రితం నల్లటి డోర్ వేసింది. దాని మీద డేంజర్ డోర్ అని రాసింది. ఇవాళ ఈ బొమ్మ.రేపటి నుంచి ఒక ఐదు నిమిషాలు ముందు వెళ్లి హిమజ స్కూల్‌కు వచ్చే మూడ్‌ను గమనించాలి అని అనుకుంది. ఆ రోజు హిమజ తల్లితో పాటు వచ్చింది. తల్లి స్కూటీ మీద తెచ్చి ఎంట్రన్స్ దగ్గర దించింది. దించుతూ హిమజకు చాలా ముద్దులు పెట్టింది. హుషారుగా టాటా చెప్పి వెళ్లిపోయింది. ఆ రోజంతా క్లాస్‌లో హిమజ మామూలుగా ఉంది. పూర్వం హుషారు లేదు. ఆ సాయంత్రం డ్రాయింగ్ క్లాస్‌లో పెద్ద ఈగను వేసింది. కాఫీ మీద వాలిన ఈగ. కప్పు కింద పగిలి ఉండగా దాని నుంచి కాఫీ ఒలికి ఉంటే ఆ కాఫీ మీద ఈగ వాలి ఉంది. మరుసటి రోజు ఉదయం హిమజను తండ్రి తన బైక్ మీద వదిలాడు. అతడు ట్రాక్ ప్యాంట్స్ టీ షర్ట్ మీద ఉన్నాడు. దించుతూ హిమజకు చాలా ముద్దులు పెట్టాడు. ఏవో కబుర్లు కూడా చెప్పాడు. హుషారుగా టాటా చెప్పి వెళ్లిపోయాడు. ఆ రోజు కూడా హిమజ క్లాసులో యథావిథిగా ఉంది. డ్రాయింగ్ క్లాసులో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను వేసింది. కాని ఆ స్విగ్గీ బాయ్ ముఖం వికృతంగా ఉంది. పెద్ద పెద్ద కళ్లు, పార పళ్లు... క్లాసులో పిల్లల మూడ్స్ మారడం మామూలే. ఆ టీచర్ టీచింగ్ ఫీల్డ్‌లో పదేళ్లుగా ఉంది. కాని పిల్లల మనసులో ఏదో గూడుకట్టుకుని పోతే వారు మారిపోయే పద్ధతి ఆమె గమనించి ఉంది. ఈ స్థితిలో ఇలాగే ఉంటే లోపల ఉన్నదేదో ముదిరిపోతుంది. ఇప్పుడు బాగానే ఉండొచ్చు కాని భవిష్యత్తులో ఇవన్నీ మానసిక సమస్యలుగా జాడ్యాలుగా మారుతాయి. సరైన వికాసం ఉండదు. సంతోషం ఉండదు. కొందరు టీచర్లు ఎవరెటు పోతే ఏమిటి అని పాఠాలు చెప్పుకొని వెళ్లిపోతారు. కాని ఈ టీచర్ అలా కాదు. ‘డాక్టర్ కల్యాణి గారిని రిక్వెస్ట్ చేస్తాను’ అని అనుకుంది గట్టిగా. డాక్టర్ కల్యాణి సైకాలజిస్ట్. ఆ స్కూల్లోని పెద్ద క్లాస్ పిల్లలకు జనరల్ కౌన్సెలింగ్ ఇవ్వడానికి నెలకోసారి వస్తూ ఉంటుంది. ఆ రోజు ఆమె వచ్చేరోజు. ప్రిన్సిపాల్‌కు ముందే రిక్వెస్ట్ చేసి జనరల్ కౌన్సెలింగ్ సమయాన్ని హిమజ కోసం తీసుకుంది.‘డాక్టర్. నాతో పాప ఏమీ చెప్పడం లేదు. మీరు మాట్లాడి చూడండి’ అని హిమజను ఆమె దగ్గరకు పంపింది. దాదాపు గంట సేపు హిమజ డాక్టర్ కల్యాణి సమక్షంలో గడిపి బయటకు వచ్చి క్లాస్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత టీచర్ వెళ్లి కలిసింది డాక్టర్ని.‘మాట్లాడాను టీచర్. హిమజ రోజూ ఇంట్లో డొమెస్టిక్ వయొలెన్స్ చూస్తూ ఉంది. వాళ్ల అమ్మా నాన్నలు సఖ్యంగా లేరు. భర్త భార్యను టార్చర్ పెడుతున్నాడు. అదీ పాప కళ్ల ముందే జరుగుతూ ఉంది. పాప అదంతా చూడలేకపోతోంది. నాకు అర్థమైనంత మేరకు వాళ్లిద్దరికీ పాపంటే ఇష్టమే. కాని తమకే ఒకరికొకరు ఇష్టం లేదు. హిమజ వేసిన బొమ్మలు కూడా చూశాను. అతడు ఆమెను పెడుతున్న హింసకు రెస్పాన్సెస్ అవి. పావురాల బొమ్మను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అందులో పెద్ద పావురం చచ్చిపోతే పిల్లపావురం ఏడుస్తూ ఉంది. పిల్ల పావురం హిమజేనన్నమాట. ఒకరోజు అతను ఆమెను గదిలో పెట్టి తలుపు వేసేశాడు. ఆమె బాదుతూ ఉండిపోయింది. ఆ బొమ్మ వేసింది. కాఫీ ముఖాన కొట్టి కప్పు పగుల కొట్టాడు ఆ బొమ్మ వేసింది. ఇంట్లో వంట జరగడం లేదు. స్విగ్గీ నుంచి తెప్పిస్తున్నారు. హిమజకు తల్లి చేసిన వంట ఇష్టం. అందుకే స్విగ్గీ బాయ్‌ను వికృతంగా వేసింది. హిమజ లోలోపల చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంది. మనం ఆ తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పాలి’ అంది డాక్టర్ కల్యాణి.కాని టీచర్ ఈ విషయం చెప్పడానికి సందేహించి ప్రిన్సిపాల్ సాయం తీసుకుంది. ప్రిన్సిపాల్ స్కూల్లో జరిగిందంతా డాక్టర్ కల్యాణి రెఫరెన్స్‌తో పాటు హిమజ తల్లికి, తండ్రికి మెయిల్ పెట్టింది.‘మీరు విడిపోతే విడిపోండి. కాని హిమజ కళ్ల ముందు హింస జరుపుతూ ఆ చిన్నారి మనసును వికలం చేయకండి’ అని మనవి చేసింది. రెండు మూడు వారాలు గడిచాయి. హిమజ తల్లిదండ్రులు డాక్టర్ కల్యాణి దగ్గర కౌన్సెలింగ్‌కు వెళ్లారు. కౌన్సెలింగ్ తీసుకున్నారు. వారిద్దరిదీ చాలా చిన్న సమస్య. ఆమె సంతోషించే విషయాలకు అతడు ‘నో’ చెప్తాడు. అతడు ఇరిటేట్ అయ్యే విషయాలకు ఆమె ‘ఎస్’ చెబుతుంది. డాక్టర్ వారిద్దరికీ ‘ఎస్’, ‘నో’లు ఎలా వాడాలో నేర్పించింది. ఎస్‌ను మింగి నో చెప్పడం నోను మింగి ఎస్ చెప్పడం ఎదుటివారి సంతోషానికి ఎంత అవసరమో చెప్పింది. క్లాస్‌లో హిమజ వేస్తున్న బొమ్మల్లో మెల్లగా మార్పు మొదలైంది.నిన్న వేసిన బొమ్మ రెక్కలొచ్చిన ఒక పసిపాప సంతోషంగా ఎగురుతూ ఉన్న బొమ్మ.– కథనం: సాక్షి ఫ్యామిలీ -
చిన్నారుల భద్రతకు ‘నిశ్చింత్’
మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు ఎంతో ఆందోళన ఉందని, నిశ్చింత్ సంస్థ రూపొందించిన మొబైల్ యాప్‌తో ఇకపై వారంతా నిశ్చింతగా ఉండొచ్చని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. డిజిటల్ తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం హోటల్ తాజ్‌కృష్ణలో ‘నిశ్చింత్’ మొబైల్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సైబర్ ట్రైనింగ్ అకాడమీని త్వరలో నెలకొల్పుతామని మంత్రి చెప్పారు. దీని కోసం సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సెన్సైస్తో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుందని చెప్పారు. ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ నిశ్చింత్ యాప్ తరహా ఉత్పత్తులు మరిన్ని రావాలన్నారు. నిశ్చింత్ సంస్థ వైస్‌చైర్మన్ కేఎస్ పరాగ్, సంస్థ సీఈవో రాఘవ్ మాట్లాడుతూ.. చిన్నారుల మొబైల్స్‌లోని ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వీడియోలు, చిత్రాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా నిశ్చింత్ యాప్‌ను రూపొందించామన్నారు. -
ఆ రాయే ప్రాణం నిలిపింది
పరిగి/కుల్కచర్ల(రంగారెడ్డి జిల్లా): బోరుబావిలో పడిన చిన్నారి క్షేమం గా బయటపడింది. ఆ రాయే ఆమె ప్రాణాలు నిలిపింది. 10 ఫీట్ల లోతులో ఉన్న రా యి చిన్నారిని మరింత కిందకు జారకుం డా ఆపింది. సహాయక చర్యలు వేగంగా చేపట్టి జిల్లా యంత్రాంగం నందిని అలియాస్ అంజలిని(6) ప్రాణాలతో కాపాడగలిగింది. మంగళవారం సాయంత్రం జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన చివరకు సుఖాంతమైంది.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్, బుజ్జిబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆ నలుగురిలో నందిని(6) వారికి చివరి సంతానం. బతుకుదెరువు కోసం లక్ష్మణ్ దుబాయికి బుజ్జిబాయి పూణె వలస వెళా ్లరు. అయితే కుమారులు పెద్దవాళ్లు కావడంతో ముదిరెడ్డిపల్లి తండాలోనే ఉంటూ చదువుకుంటున్నారు. ఇక ఇద్దరు కుమార్తెలు చిన్నవారు కావడంతో వారిని గోవిం దుపల్లిలోని తన తల్లిగారింట వదిలి బుజ్జిబాయి వలస వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం అమ్మమ్మ సీతాబాయి, తాత భోజ్యానాయక్‌లు తండా సమీపంలోని పొలంలో పనికి వెళ్లగా నందిని(6) కూడా వారితోపాటే వెళ్లింది. అప్పటివరకు అక్కడ ఆడుకున్న బాలిక బోరుబావి లోడింది. చిన్నారి జాడ లేకపోవడంతో చుట్టుపక్కల వెతకగా.. బోరుబావులో ఏ డ్పు వినిపించింది. దీంతో అందులో పడిపోయిందని స్పష్టమైంది. రెండున్నర గంటల సహాయక చర్యలు ఇక బోరుబావిలో పది ఫీట్ల కింద ఉన్న రాయి చిన్నారి మరింత లోతుకు జారకుండా అడ్డుకుంది. ఇక చిన్నారి బోరుబావిలో పడిందన్న విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ రాములు హుటాహుటినా పోలీసులకు, 108కు సమాచారం అందించారు. ఇక రాత్రి 7 గంటల వరకు జేసీబీ, పోలీసులు, 108 వాహనం ఘటనా స్థలానికి చేరకున్నాయి. 108 సిబ్బంది బోరుబావిలో చిన్నారికి ఆక్సిజన్ అందించగా జేసీబీ బోరుబావికి సమాంతరంగా తవ్వకం ప్రారంభించింది. రాత్రి 9.30 గం టల ప్రాంతంలో బోరుబావి నుంచి చిన్నారిని విజయవంతంగా బయటకు తీశారు. అయితే చిన్నారి ప్రాణాలకు ఎలాంటి అపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే చిన్నారిని 108లో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, రంగారెడ్డి జిల్లా మంచాలలో జరిగిన ఘటనను మర వకముందే అలాంటి ఘటనే చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది.