అజిత్‌సింగ్‌నగర్‌లో పోస్టర్ల సాయంతో అవగాహన కల్పిస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధుల కళ్లు పడుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసిన వారే దుశ్చర్యకు ఒడిగడుతున్నారు. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే, మన పిల్లలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్.. అన్నది చెప్పాలి. తాకకూడని చోట ఎవరైనా తడిమితే, భయపడకుండా ‘డోంట్ టచ్ మీ’ అని గట్టిగా అరవాలి.. అక్కడి నుంచి పరుగెత్తాలి.. ఎవరికైనా జరిగిన విషయాన్ని చెప్పాలి.. దీనిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది.
చదవండి: రేటు ఎంతైనా.. రుచి చూడాల్సిందే!
బాలికలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. లైంగిక వేధింపులు, బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగేలా జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ, మహిళాభివృద్ధి శిశు, సంక్షేమం, ఫోరమ్ ఫర్ చైల్డ్ లైన్, పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ప్రత్యేక నినాదాలతో అవగాహన
♦తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ‘అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి’ (షౌట్.. రన్.. టెల్) నినాదాలతో ఆపదలో ఉన్న పిల్లలకు తెలిసే విధంగా ప్రచార పోస్టర్లను తయారు చేశారు.
♦వీటిని జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, ఎంపీడీఓ, తహసీల్దార్, గ్రామ, వార్డు సచివాలయాలు, వసతి గృహాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, ప్రముఖ కూడళ్ల వద్ద శాశ్వతంగా ఉండేలా ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
♦ఆయా పోస్టర్లపై చైల్డ్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ హైల్ప్ లైన్ 100 నంబర్లను ఉంచారు.
♦పాఠశాలలో నిర్వహించే అసెంబ్లీలో లైంగిక వేధింపులు, బాలల హక్కులపై చర్చించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
♦గుడ్, బ్యాడ్ టచ్ మధ్య వ్యత్యాసంపై ఎనిమిది నిమిషాల నిడివితో వీడియో క్లిప్ రూపొందించారు.
♦దీనిలో ఎవరైనా శరీర రహస్య భాగాలను తాకినా వెంటనే నిలువరించేందుకు వీలుగా బిగ్గరగా ‘అరవటం’.. వారి నుంచి సాధ్యమైనంత దూరంగా ‘పరుగెత్తడం’.. ♦తల్లిదండ్రులకు/పెద్దవారికి తెలిసేలా ‘చెప్పండి’ వంటి వాటితో అవగాహన కల్పిస్తున్నారు.
అవగాహన సదస్సులు..
జిల్లాలోని లా అండ్ ఆర్డర్ పోలీసులు, దిశ అధికారులు, చైల్డ్ లైన్ సహకారంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నివారించేందుకు వీలుగా ప్రజలకు అవగాహన కల్పించి, నేరాలను అరికట్టాలనే భావనతో ముందుకు వెళ్తున్నారు. పిల్లలకు గుడ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అన్న విషయాలను ఏ విధంగా చెప్పాలి. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాలు చేసిన వారిపై ఎటువంటి శిక్షలు ఉంటాయనే దానిపైన సదస్సుల్లో వివరిస్తున్నారు.
బాలికలకు అవగాహన కల్పిస్తున్నాం..
లైంగిక వేధింపులు, బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆపదలో ఉన్న పిల్లలకు తెలిసే విధంగా ప్రత్యేక పోస్టర్లను తయారు చేసి, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నాం. బ్యాడ్, గుడ్ టచ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసంపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హెల్ప్‌లైన్ నంబర్లపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
– ఎస్. ఢిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా
బాలలపై నేరాలను అరికట్టే విధంగా చర్యలు
జిల్లాలో బాలలపై జరుగుతున్న నేరాలను అరికట్టే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఆపదలో ఉన్న వారు హెల్ప్ లైన్ నంబర్లు వినియోగించుకొనేలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం.
– టి.కె. రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment