పిల్లల భద్రత కోసం మంచి ఇంట్లో ఉండాలనుకుంటాం. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే ఉండాలనుకుంటాం. పిల్లల బ్రేక్‌ఫాస్ట్ కోసం లంచ్, డిన్నర్‌ల కోసం వారికి ఇష్టమైనదే వండాలనుకుంటాం. పిల్లల స్నాక్స్ అయిపోక ముందే తెచ్చి పెట్టేస్తాం. కాని పిల్లలకు కావలసింది ఏమిటి?అమ్మానాన్నలు వారికి ఇవ్వాల్సిందే ఇస్తున్నారా? తాము ఏమిస్తున్నారోగమనిస్తున్నారా?
రోజూ క్లాస్‌లో లాస్ట్ పిరియడ్ డ్రాయింగ్ ఉంటుంది.థర్డ్ క్లాస్ సి సెక్షన్ అది.
మొత్తం 30 మంది పిల్లలు ఉంటారు. రోజంతా వాళ్లు క్లాసుల్లో ఎలా పార్టిసిపేట్ చేసినా ఈ పిరియడ్‌లో మాత్రం ఉత్సాహంగా డ్రాయింగ్ బుక్ పట్టుకుంటారు. కొందరు పెన్సిల్‌తో వేస్తారు. కొందరు పేస్టల్స్‌తో వేస్తారు. కొందరు వాటర్ కలర్స్ కలపడానికి కావలసిన వాటర్ కోసం బ్యాగుల్లోని వాటర్ బాటిల్స్ తీస్తారు. బల్లలన్నీ రంగుల మయం అవుతాయి. కొత్త ఊహలకు రెక్కలు వస్తాయి.క్లాస్ టీచర్‌కు రోజూ కుతూహలంగా ఉంటుంది – ఇవాళ పిల్లలు ఏం బొమ్మలు వేస్తారా అని.వాటిలో కొన్ని చాలా గొప్ప ఆర్టిస్ట్‌లు వేసినంత బాగా ఉండి ఆకట్టుకుంటాయి. కొన్ని బొత్తిగా వొంకర టింకరగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. అవైనా ఇవైనా పిల్లలు వేసినవే కదా. అందుకే వాటిని చూడటం బాగుంటుంది.పిరియడ్ అయిపోయింది. ఒక్కొక్కరే వచ్చి వేసిన బొమ్మలను చూపించడం మొదలుపెట్టారు. టీచర్ ఒక బొమ్మ చూసి షాక్ అయ్యింది. వేసిన పాప వైపు చూసింది. హిమజ. వేసిన బొమ్మను చాలా మామూలుగా చూపుతూ ఉంది.ఆ బొమ్మ చనిపోయిన పావురం. పక్కన ఏడుస్తున్న పావురం. పెద్ద పావురం చనిపోతే చిన్న పావురం ఏడుస్తూ ఉంది.‘హిమజ.. ఈ పావురానికి ఏమైందమ్మా.. ఫీవర్ వచ్చిందా.. ఎవరైనా షూట్ చేశారా?’ పాప మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసింది.పాప ఏమీ చెప్పలేదు.లాంగ్ బెల్ వినిపించింది. అందరూ వెళ్లిపోయారు.
టీచర్ ఆ రాత్రి కొంచెం సేపు హిమజ గురించి ఆలోచించింది.
హిమజ క్లాస్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. చాలా బాగా చదువుతుంది. వీలు దొరికితే అల్లరి చేస్తుంది. ముగ్గురు కూచునే బెంచిలో మిగిలిన ఇద్దరిని ఎలాగైనా మాటల్లో పెడుతుంది. ఆ పిల్లను మాట్లాడనీయకుండా చేయడానికి టీచర్ బెంచీలన్నీ మారుస్తుంటుంది. ఏ బెంచీలో కూచోబెట్టినా కాసేపట్లోనే మిగిలిన ఇద్దరినీ ఫ్రెండ్స్‌గా చేసుకుంటుంది. అంత ఉరకలు వేసే స్టూడెంట్.కాని వారం రోజులుగా డల్‌గా ఉంటోంది. ఇప్పుడు బొమ్మల్లో మార్పు కనిపిస్తోంది. ఇంతకు ముందు తూనీగలు, గాలిపటాలు వేసేది. కార్టూన్ క్యారెక్టర్స్ వేసేది. కాని ఇప్పుడు తిక్క తిక్కగా వేస్తోంది. మూడు రోజుల క్రితం నల్లటి డోర్ వేసింది. దాని మీద డేంజర్ డోర్ అని రాసింది. ఇవాళ ఈ బొమ్మ.రేపటి నుంచి ఒక ఐదు నిమిషాలు ముందు వెళ్లి హిమజ స్కూల్‌కు వచ్చే మూడ్‌ను గమనించాలి అని అనుకుంది.
ఆ రోజు హిమజ తల్లితో పాటు వచ్చింది. తల్లి స్కూటీ మీద తెచ్చి ఎంట్రన్స్ దగ్గర దించింది. దించుతూ హిమజకు చాలా ముద్దులు పెట్టింది. హుషారుగా టాటా చెప్పి వెళ్లిపోయింది. ఆ రోజంతా క్లాస్‌లో హిమజ మామూలుగా ఉంది. పూర్వం హుషారు లేదు. ఆ సాయంత్రం డ్రాయింగ్ క్లాస్‌లో పెద్ద ఈగను వేసింది. కాఫీ మీద వాలిన ఈగ. కప్పు కింద పగిలి ఉండగా దాని నుంచి కాఫీ ఒలికి ఉంటే ఆ కాఫీ మీద ఈగ వాలి ఉంది.
మరుసటి రోజు ఉదయం హిమజను తండ్రి తన బైక్ మీద వదిలాడు. అతడు ట్రాక్ ప్యాంట్స్ టీ షర్ట్ మీద ఉన్నాడు. దించుతూ హిమజకు చాలా ముద్దులు పెట్టాడు. ఏవో కబుర్లు కూడా చెప్పాడు. హుషారుగా టాటా చెప్పి వెళ్లిపోయాడు. ఆ రోజు కూడా హిమజ క్లాసులో యథావిథిగా ఉంది. డ్రాయింగ్ క్లాసులో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను వేసింది. కాని ఆ స్విగ్గీ బాయ్ ముఖం వికృతంగా ఉంది. పెద్ద పెద్ద కళ్లు, పార పళ్లు...
క్లాసులో పిల్లల మూడ్స్ మారడం మామూలే. ఆ టీచర్ టీచింగ్ ఫీల్డ్‌లో పదేళ్లుగా ఉంది. కాని పిల్లల మనసులో ఏదో గూడుకట్టుకుని పోతే వారు మారిపోయే పద్ధతి ఆమె గమనించి ఉంది. ఈ స్థితిలో ఇలాగే ఉంటే లోపల ఉన్నదేదో ముదిరిపోతుంది. ఇప్పుడు బాగానే ఉండొచ్చు కాని భవిష్యత్తులో ఇవన్నీ మానసిక సమస్యలుగా జాడ్యాలుగా మారుతాయి. సరైన వికాసం ఉండదు. సంతోషం ఉండదు. కొందరు టీచర్లు ఎవరెటు పోతే ఏమిటి అని పాఠాలు చెప్పుకొని వెళ్లిపోతారు. కాని ఈ టీచర్ అలా కాదు. ‘డాక్టర్ కల్యాణి గారిని రిక్వెస్ట్ చేస్తాను’ అని అనుకుంది గట్టిగా.
డాక్టర్ కల్యాణి సైకాలజిస్ట్. ఆ స్కూల్‌లోని పెద్ద క్లాస్ పిల్లలకు జనరల్ కౌన్సెలింగ్ ఇవ్వడానికి నెలకోసారి వస్తూ ఉంటుంది. ఆ రోజు ఆమె వచ్చేరోజు. ప్రిన్సిపాల్‌కు ముందే రిక్వెస్ట్ చేసి జనరల్ కౌన్సెలింగ్ సమయాన్ని హిమజ కోసం తీసుకుంది.‘డాక్టర్. నాతో పాప ఏమీ చెప్పడం లేదు. మీరు మాట్లాడి చూడండి’ అని హిమజను ఆమె దగ్గరకు పంపింది. దాదాపు గంట సేపు హిమజ డాక్టర్ కల్యాణి సమక్షంలో గడిపి బయటకు వచ్చి క్లాస్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత టీచర్ వెళ్లి కలిసింది డాక్టర్‌ని.‘మాట్లాడాను టీచర్. హిమజ రోజూ ఇంట్లో డొమెస్టిక్ వయొలెన్స్ చూస్తూ ఉంది. వాళ్ల అమ్మా నాన్నలు సఖ్యంగా లేరు. భర్త భార్యను టార్చర్ పెడుతున్నాడు. అదీ పాప కళ్ల ముందే జరుగుతూ ఉంది. పాప అదంతా చూడలేకపోతోంది. నాకు అర్థమైనంత మేరకు వాళ్లిద్దరికీ పాపంటే ఇష్టమే. కాని తమకే ఒకరికొకరు ఇష్టం లేదు. హిమజ వేసిన బొమ్మలు కూడా చూశాను. అతడు ఆమెను పెడుతున్న హింసకు రెస్పాన్సెస్ అవి. పావురాల బొమ్మను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అందులో పెద్ద పావురం చచ్చిపోతే పిల్లపావురం ఏడుస్తూ ఉంది. పిల్ల పావురం హిమజేనన్నమాట. ఒకరోజు అతను ఆమెను గదిలో పెట్టి తలుపు వేసేశాడు. ఆమె బాదుతూ ఉండిపోయింది. ఆ బొమ్మ వేసింది. కాఫీ ముఖాన కొట్టి కప్పు పగుల కొట్టాడు ఆ బొమ్మ వేసింది. ఇంట్లో వంట జరగడం లేదు. స్విగ్గీ నుంచి తెప్పిస్తున్నారు. హిమజకు తల్లి చేసిన వంట ఇష్టం. అందుకే స్విగ్గీ బాయ్‌ను వికృతంగా వేసింది. హిమజ లోలోపల చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంది. మనం ఆ తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పాలి’ అంది డాక్టర్ కల్యాణి.కాని టీచర్ ఈ విషయం చెప్పడానికి సందేహించి ప్రిన్సిపాల్ సాయం తీసుకుంది. ప్రిన్సిపాల్ స్కూల్‌లో జరిగిందంతా డాక్టర్ కల్యాణి రెఫరెన్స్‌తో పాటు హిమజ తల్లికి, తండ్రికి మెయిల్ పెట్టింది.‘మీరు విడిపోతే విడిపోండి. కాని హిమజ కళ్ల ముందు హింస జరుపుతూ ఆ చిన్నారి మనసును వికలం చేయకండి’ అని మనవి చేసింది.
రెండు మూడు వారాలు గడిచాయి.
హిమజ తల్లిదండ్రులు డాక్టర్ కల్యాణి దగ్గర కౌన్సెలింగ్‌కు వెళ్లారు. కౌన్సెలింగ్ తీసుకున్నారు. వారిద్దరిదీ చాలా చిన్న సమస్య. ఆమె సంతోషించే విషయాలకు అతడు ‘నో’ చెప్తాడు. అతడు ఇరిటేట్ అయ్యే విషయాలకు ఆమె ‘ఎస్’ చెబుతుంది. డాక్టర్ వారిద్దరికీ ‘ఎస్’, ‘నో’లు ఎలా వాడాలో నేర్పించింది. ఎస్‌ను మింగి నో చెప్పడం నోను మింగి ఎస్ చెప్పడం ఎదుటివారి సంతోషానికి ఎంత అవసరమో చెప్పింది.
క్లాస్‌లో హిమజ వేస్తున్న బొమ్మల్లో మెల్లగా మార్పు మొదలైంది.నిన్న వేసిన బొమ్మ రెక్కలొచ్చిన ఒక పసిపాప సంతోషంగా ఎగురుతూ ఉన్న బొమ్మ.– కథనం: సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment