అభిప్రాయం
ఎన్ని చట్టాలు వచ్చినా పిల్లలపై ఘోరాలు కొనసాగుతూ ఉండడం బాధాకరం. జూన్ నెలలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్‌మిల్ దగ్గర ఆరేళ్ల బాలిక, మియాపూర్ నడిగడ్డ తండా వద్ద 12 ఏళ్ల బాలిక లైంగిక హింస, హత్యలకు గురవ్వడం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. వలస వెళ్ళిన నిరు పేద కుటుంబాలకు చెందిన ఈ బాలికలు సామజిక మాధ్యమాల మద్దతుకు కూడా నోచుకోలేదు.
తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకూ ఒక బాలల పరిరరక్షక విధానం లేదు. సమగ్ర విధానం రూపొందించి, రాష్ట్రంలోని అన్ని సంస్థలలో అమలు పరిచేట్లు చూడటం బాలలపై లైంగిక నేరాలనుంచి రక్షణ (పోక్సో) చట్టం – 2012, నిబంధన 3 (5) ప్రకారం తప్పనిసరి. పోక్సో చట్టం ప్రకారం బాల స్నేహ పూర్వక ప్రత్యేక న్యాయస్థానాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి.
పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం ఏదైనా సంస్థ పరిధిలో బాలలపై నేరం జరిగినా, జరిగే అవకాశం ఉన్నా ఆ సంస్థ అధిపతి లేక యజమాని వెంటనే పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. ఈ బాధ్యత నిర్వహణలో విఫలమైతే ఏడాది జైలుశిక్ష విధించ వచ్చు. పోక్సో చట్టం నిబంధన 3 (4) ప్రకారం బాలలు సందర్శించే అన్ని సంస్థలు, పాఠశాలలు, క్రెష్‌లలో సిబ్బంది, ఉపాధ్యాయులకు ఏమైనా నేర చరిత్ర ఉన్నదా అని పోలీసు శాఖచే వారి నేపథ్య తనిఖీ క్రమబద్ధంగా చేయడం తప్పనిసరి.
చట్ట పరమైన రక్షణ, పోక్సో చట్టం కింద పడేశిక్షల తీవ్రత గురించి అవగాహన పెంచితే నేరాలు తగ్గవచ్చు. 18 ఏళ్ళ లోపు బాలలపై లైంగిక హింస చేస్తే 20 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ నేరం బంధువులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల సిబ్బంది, వసతి గృహ సిబ్బంది చేస్తే మరణ శిక్షకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే తమిళనాడు, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర రాష్ట్రాలలో పోక్సో చట్టం ప్రకారం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానాలు త్వరితంగా విచారణ పూర్తి చేసి బాలలపై లైంగిక దాడి చేసిన నేరస్థులకు మరణ శిక్షలు విధించాయి.
ఆంధ్రప్రదేశ్ 2019లో ‘దిశ’ హత్యకు ప్రతిస్పందనగా ‘దిశ చట్టం’ (ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం–2019), మహారాష్ట్ర ‘శక్తి క్రిమినల్ చట్టాల (మహారాష్ట్ర సవరణ) చట్టం 2020’ అమలు చేసే ప్రయత్నం చేశాయి. ఈ చట్టాల ప్రకారం బాలలు, మహిళలపై జరిగిన నేరాల పరిశోధన, న్యాయ విచారణ త్వరితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రపతి అనుమతి రానందున ఈ రెండు చట్టాలు అమలు లోకి రాలేదు.
నారాయణపేట జిల్లాలో జూన్ 13న సంజీవ్ అనే వ్యక్తిపై ప్రాణాంతక దాడి జరుగుతున్న సమయంలో 100 నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని తెలిసింది. తెలంగాణలో ‘112 ఇండియా’, ‘దిశ’ వంటి ఎమర్జెన్సీ యాప్‌లను వెంటనే అందుబాటులోకి తీసుకు రావాలి. ఆంధ్రప్రదేశ్ దిశ యాప్ 1.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ మధ్య ప్రవేశపెట్టిన టీ–సేఫ్ యాప్ ప్రయాణాల్లో అత్యవసర సాయం కోసం, హెల్ప్ లైన్ 100 డయల్ చేసేందుకు పని చేస్తుంది.
కానీ 112 ఇండియా, దిశ వంటి యాప్‌లలో పోలీసులతో పాటు ఇతరులకు కూడా తక్షణ సమాచారం చేరవేసే అవకాశం ఉంది. ఫోన్ గట్టిగా ఊపడం ద్వారా కూడా తక్షణ సందేశం పంపవచ్చు. మొబైలు ఫోన్ హ్యాండ్ సెట్ ప్యానిక్ బటన్, జీపీఎస్ నిబంధనలు– 2016 ప్రకారం... ఫీచర్ ఫోన్‌లో 5 లేక 9 నంబర్‌ను స్మార్ట్ ఫోన్‌లో అయితే ఆన్–ఆఫ్ మీట 3 సార్లు నొక్కితే పోలీసు అత్యవసర హెల్ప్ లైన్‌కు సందేశం వెళ్ళాలి. ఈ విషయంపై ప్రజలలో అవగాహన అవసరం. ఏ దేశానికైనా అత్యంత విలువైన ఆస్తిపాస్తులు బాలలు. వారిని కాపాడటం కోసం అన్ని మార్గాలూ వెదకాలి.
శ్రీనివాస్ మాధవ్
వ్యాసకర్త ఆర్టీఐ కార్యకర్త ‘ 9247 159 343
Comments
Please login to add a commentAdd a comment