చంద్రబాబు పాలనలో కాలేజీ స్థాయిలో సామా జిక శాస్త్రాల చదువులు అటక ఎక్కాయి. ఆ తర్వాత ఎవ్వరూ వాటి వైపు తిరిగి చూడలేదు. ఆ చదువుల పట్ల అశ్రద్ధ కారణంగానే ఇప్పటికీ రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది అనేది ఏపీ ప్రజలకు సాకల్యంగా స్పష్టం కాలేదు. తెలంగాణ విషయం అలా కాదు, ఇక్కడి కొరతను అధిగమించి మరీ ఉద్యమానికి ముందు ఒక దశాబ్దం పాటు వారు తమ చరిత్ర–సంస్కృతిని పునర్నిర్మించారు.
అయితే ఇక్కడ అది లేదు. యూపీఏ–2 పాలన చివరిలో (2009–14) ‘విభజన’ లక్ష్యంగా తెలంగాణ అప్రమత్తం అయినప్పుడు, అక్కడ జరి గిన ‘హోం వర్క్’ వంటిదే ఇక్కడ కూడా జరిగి ఉంటే, ప్రతి అంశంలోనూ మన ‘ప్లానింగ్’లో ఆ స్పష్టత మొదటి నుంచి కనిపించేది. అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వ విధానాల్లో మార్పు ఉండేది కాదు. కేంద్రం విభజన నిర్ణయం ఏ కారణంతో తీసుకున్నా విస్తృత ప్రయోజనాల దృష్టితో సూక్ష్మ ప్రణాళికల వైపు మన నడక సాగి ఉండేది. అదే కనుక జరిగిఉంటే, ఇప్పుడు కురచ దృష్టితో కొందరు మాట్లాడుతున్న–‘సంక్షేమం’ వేరు ‘అభివృద్ధి’ వేరు అనే విపరీత పరిస్థితి మనకు వచ్చేది కాదు.
ప్రధానిగా డా‘‘ మన్మోహన్ సింగ్ కాలంలో పెద్ద ఎత్తున చలామణిలో ఉండిన –‘ఇంక్లూజివ్ గ్రోత్’ (సమష్టి వృద్ధి) పదం ఎన్డీఏ తొలినాళ్లలోనే నిశ్శబ్దంగా అదృశ్యం అయింది. ఇటీవల ‘జాతీయ ఉపాధి హామీ పథకం’లో పేదలు వేసవిలో చేసే పని దినాలు–వేతనాలు తరచూ జాతీయ స్థాయిలో చర్చకు గురికావడం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అందుకోసం ప్రభుత్వంపై పోరాటం చేయడం చూస్తున్నదే. అదే ఆంధ్ర ప్రదేశ్ విషయంలో అయితే, కనీసం రెండున్నర ఏళ్ళపాటు మన ప్రాధాన్యతలు మార్చిన ‘కోవిడ్’ సోయి కూడా మరిచి, ‘సంక్షేమం’ అవసరాన్ని ప్రశ్నించడం చూశాము. మనం ఏమిటో మన భాష చెబుతుంది అనడానికి ఇదో ఉదాహరణ.
ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిందని, ‘ప్రాంతం’ – ‘ప్రజల’ స్వభావంలో మార్పు ఎందుకు వస్తుంది? కేవలం ఒక మంత్రికి పరిపాలనలో కొత్త ‘టెక్నాలజీ’ తేవాలని ఉంటే చాలదు కదా. ఆ స్థాయిలో ఇక్కడి పరిస్థితుల(ఎకో సిస్టం)లో కూడా మార్పు తీసుకు రావాలి కదా? కానీ ఆ విషయం దావోస్‌లో మరెవరో మనకు చెప్పాల్సి వచ్చింది. ‘గూగుల్’ కంపెనీ దావోస్‌లో ఏర్పాటు చేసిన– ‘ఏఐ ఫర్
గుడ్ షేపింగ్, ఏ స్మార్టర్ సస్టెయినబుల్ టుమారో’ సెషన్‌లో మన కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ–‘మా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని ఎంపిక చేయడానికి, వైద్య– ఆరోగ్య రంగంలో ఆరోగ్య రక్షణను ప్రజాస్వామ్యయుతం చేయడం కోసంమేము కృత్రిమ మేధ (ఏఐ)ను వాడాలి అనుకుంటున్నాము’ అన్నారు.
ఆ సెషన్ సమన్వయకర్తగా ఉన్న రాజేష్ నంబియార్ ఇండియాలోని ‘డిజిటల్ డివైడ్’ (సాంకేతికత... అందుబాటులో ఉన్నవారికీ– లేనివారికీ మధ్య ఉన్న దూరం) ను దృష్టిలో ఉంచుకుని, అక్కడి ప్రజలకు స్మార్ట్ ఫోన్లు ఉండాలి, అందులో మళ్ళీ ‘ఫైవ్–జి’, ‘సిక్స్–జి’ అందుబాటులో ఉండాలి అన్నారు. ‘అయినా మంత్రి ప్రతిపాదనపై మీరు ఏమంటారు?’ అని ఆయన ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ ప్రతినిధి అర్చనా వ్యాస్‌ను అడిగారు.
దానికి ఆమె– ‘ముందుగా ప్రజలకు ‘మిషన్‌లెర్నింగ్’ తెలియాలి. దాన్ని వాడాలి అనుకుంటున్న రంగాలకు తగిన ‘డిజిటల్ కెపాసిటీ’ ఏమిటి అనేది ముఖ్యం. అయినా అటువంటి సేవలు వినియోగించుకునే వాయిస్ ఆఫ్ కమ్యూ నిటీ (ప్రజల ఉద్దేశం) ఏమిటో తెలుసు కోవడం అవసరం. ఈ నేపథ్యంలో లాస్ట్ మైల్‌లో ఉన్న వారికి ఈ పద్ధతిలో వైద్యం అందుతుందా? అనేది కీలకం. అయినా మన కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్‌కు ఈసాంకేతికత తెలియాలి కదా?’ అన్నారు. ప్రభుత్వాలు ఇటువంటి నేల విడిచి సాము చేసే రీతిలో ఆరోగ్యం వంటి అత్యవసర సేవలు అందిస్తాము అంటే, ప్రజలు తమ వైఖరిని (ప్రజా) ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి తెలపాలి.
అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటివి ‘ప్రభుత్వం’ అని, అవి ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటాయి అనే పాత దృష్టి నుంచి ఇక బయటపడాలి. రాజకీయం అంతా మన చుట్టూనే జరుగుతున్నప్పుడు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఉన్నప్పటికీ, ‘సర్పంచ్ – ఎంపీపీ – జడ్పీటీసీ’ స్థాయిలో అభివృద్ధి పనులు గుర్తించి, అవి శాసన సభ్యుల ద్వారా నేరుగా ‘అసెంబ్లీ’లోకి వెళ్ళినప్పుడు ఈ నేలవిడిచిన సాము తరహా ‘ప్రెజెంటేషన్లు’ ఉండవు. విభజన తర్వాత పునాది నుంచి ప్రతిదీ కొత్తగా కట్టుకుంటున్న దశలోనే ఈ స్పృహ రాష్ట్రంలో మొదలుఅయితే, కాలక్రమంలో అదొక ‘స్టేట్ సైక్’ (రాజ్య మనఃస్థితి)గా స్థిరపడుతుంది.
-జాన్‌సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment