మానవాభివృద్ధినీ మనం అంగీకరించలేమా? | Johnson Choragudi On Human Development | Sakshi
Sakshi News home page

మానవాభివృద్ధినీ మనం అంగీకరించలేమా?

Published Fri, May 19 2023 3:15 PM | Last Updated on Fri, May 19 2023 3:21 PM

Johnson Choragudi On Human Development  - Sakshi

ఈ నెల ఐదున – ‘కళ్యాణమస్తు’ పథకం ఆరంభిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తన క్లుప్త ప్రసంగంలో– ‘ఈ పథకంలో వధువు విధిగా టెన్త్‌ క్లాస్‌ చదివి ఉండాలి’ అనే షరతు కుటుంబం ఆడపిల్లను చదివించడానికి ప్రోత్సహించడం కోసమే’’ అన్నారు. రాష్ట్రంలో పేదపిల్లల చదు వుల ప్రోత్సాహానికి ఇప్పటికే పలు పథకాలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇవి ’ఓట్‌ బ్యాంకు’ పథకాలు అనీ, రాష్ట్ర ఖజానాను కుదేలు చేసేవనీ, ‘కరోనా’నంతర కాలంలో విమర్శలు చేస్తున్నారు. ఈ రెండు విమర్శల్లోని నిజానిజాలను అటు జగన్‌ వ్యక్తిగత దృష్టి నుంచి, ఇటు మానవాభివృద్ధి నిర్వచనం దృష్టి నుంచి... ఇవి రెండు వేర్వేరు అంశాలుగా చూడాలి. 

మొదటిది– ముఖ్యమంత్రి ఈ విషయంలో చూపుతున్న శ్రద్ధలో రాజకీయం కంటే వందేళ్ల ఆయన కుటుంబం చరిత్ర నేపథ్య ప్రభావం ఉంది. వైఎస్‌ రాజారెడ్డి సోదరి డా‘‘ రత్నమ్మ 1923లో పులివెందుల తాలూకా బలపనూరులో ఐదవ తరగతి చదివిన తర్వాత, సొంత ఊళ్ళో హైస్కూల్‌ లేకపోవడంతో ఆమె తండ్రి జమ్మలమడుగు మిషన్‌ స్కూల్లో ఆమెను చేర్చారు. అలా పై చదువుల్లోకి వెళ్లి మెడిసిన్‌ చదివాక, జమ్మలమడుగు మిషన్‌ హాస్పిటల్లో పనిచేశారు. సర్వీస్‌ మధ్యలో విదేశాల్లో ‘గైనిక్‌’ పీజీ చేసివచ్చాక, పదిమంది తోబుట్టువులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె– ‘ట్యూబెక్టమీ’ ఆపరేషన్‌ చేయించుకున్నారు. కడప జిల్లాలో 1954 నాటికి అది మొదటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌. ఇదంతా ఇప్పటికి వందేళ్ల నాటి చరిత్ర.

ఇక రెండవది– మానవాభివృద్ధి నిర్వచనం దృష్టి నుంచి చూస్తే... ప్రపంచీకరణ తర్వాత ఐరాస ఉపాంగం అయిన యూఎన్‌డీపీ 17 ‘సస్టెయినబుల్‌ డెవలప్మెంట్‌ గోల్స్‌’ (ఎస్‌డీజీ)ను 2030 నాటికి లక్ష్యాలుగా నిర్దేశించి, అంశాల వారీగా వాటిని సమీక్షిస్తున్నది. కనుక, ఇది ఏమాత్రం ఇప్పుడు స్థానిక అంశం కాదు. ఢిల్లీలో మన ‘నీతి ఆయోగ్‌’ స్థాయిలోనే కాకుండా, పలు విదేశీ యూనివర్సిటీల్లో కూడా వీటిపై నిరంతరాయంగా అధ్యయనం జరుగుతున్నది. అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో ‘పాపులేషన్‌–హెల్త్‌–జాగ్రఫీ’ ప్రొఫె సర్‌గా పనిచేస్తున్న ఎస్‌వీ సుబ్రహ్మణ్యన్‌ అదే యూని వర్సిటీలో–‘ఇండియా పాలసీ ఇన్‌సైట్స్‌ ఇనీషియేటివ్‌’ చీఫ్‌ ఇన్వెస్టిగేటర్‌ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన–‘ఇండియా, ఇట్స్‌ ఎస్‌డీజీ ప్లెడ్జి గోల్‌ అండ్‌ ది స్ట్రాటజీ టు అప్లై’ శీర్షికతో వెలువరించిన వ్యాసం చూస్తే... ‘ఇందు కోసమా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్త్రీ కేంద్రిత సంక్షేమంపైఇంత శ్రద్ధ చూపుతున్నది’ అని ఆలోచనలో పడతాం. 

హార్వర్డ్‌ యూనివర్సిటీలో మనదేశంలోని 707 జిల్లాలు ప్రాతిపదికగా జరుగుతున్న పరిశీలనలో 2016–2021 మధ్య– ఐదేళ్లలోపు పిల్లల మరణాలు, మెరుగైన మరుగుదొడ్ల వసతి, కౌమార బాలికల గర్భిణీ శాతం, పేదరికం (మల్టీ డైమెన్షియల్‌ పావర్టీ) స్త్రీల బ్యాంక్‌ అకౌంట్స్‌ సంఖ్య వంటివి ఆ సమీక్షకు తొలి ప్రాధమ్యాలుగా ఉన్నాయి.  ఒకప్పుడు ‘పేదరికం’ ఒక అంశంగా సమీక్షించే దశ నుంచి, మూడు అంశాలను కలిపి ఇప్పుడు దాన్ని– ‘మల్టీ డైమెన్షియల్‌ పావర్టీ’గా చూస్తున్నారు. అవి – 1. ఆరోగ్యం 2. విద్య 3. జీవన ప్రమాణాలు (వంటఇంధనం, శానిటేషన్, తాగునీరు, విద్యుత్తు, గృహవసతి, అసెట్స్‌).మారిన పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు, అభివృద్ధిని వదిలేసి సంక్షేమమా అంటున్నవారి చూపు ఎటువంటిది అనే ప్రశ్న ఉదయించడం సహజం.

అమలులో ఉన్న జీవన ప్రమాణాల సూచీ మేరకు, ‘ప్రజల’ పేదరికం తగ్గించడం ఎన్నికయిన ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన బాధ్యత. ‘యూఎన్‌డీపీ’ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 నాటికి సాధించాలి అనే షరతు మీదే ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు నుంచి మనతో సహా పలు దేశాలకు ఆర్థిక సహకారం అందుతున్నది. విమర్శకులు ఈ విషయాన్నీ గమనంలో ఉంచుకోవాలి.
ఉద్యోగులు, పెన్షనర్లు, మానవాభివృద్ధి పథకాల అమలు పట్ల సానుకూల వైఖరి కనపర్చకపోవడం, అవి తమకు అందే వేతన ప్రోత్సాహకాలకు అడ్డు అని భావించడం కొత్త ధోరణి. ఇక ‘ప్రైవేట్‌ సెక్టార్‌’ ఉద్యోగులకు తాము పనిచేస్తున్న కంపెనీల ఉనికి వెనుక ప్రభుత్వాలు కల్పించిన మౌలిక వసతులు, ‘సబ్సిడీలు’ ఉన్నవనే విషయాన్ని మరుస్తు న్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవిక ప్రశ్నార్థంగా మిగిలిన వర్గాల విషయంలో తమ ‘స్టాండ్‌’ ఏమిటని ఎవరికి వారు జవాబు వెతుక్కోవడమే మిగిలిన పరిష్కారం.  


-జాన్‌సన్‌ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement