మరో పదమూడు మాసాలకు రాష్ట్ర విభజన జరిగి ఒక దశాబ్దకాలం పూర్తవుతుంది. ఇదే కాలంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం– ‘జీ20’ అధ్యక్ష స్థానానికి ఎదిగింది. సాధారణంగా ప్రభుత్వ అధినేతలు ఇటు వంటి ఎదుగుదలను తమ ఖాతాలో వేసుకుంటారు. అది సహజమే అయినా తాత్కాలికం. చరిత్ర రచన– ‘ఎవరి కాలంలో అని కాకుండా, ఏ కాలంలో ఏమి జరిగింది?’ అనే ప్రతి పాదికగానే సాగుతుంది.
దానికి కారణం, ప్రభుత్వాల నిర్ణయాల ‘వెనుక–ముందు’ అందుకు దోహదం చేసే అంశాల తాకిడి అదృశ్యంగా కొన్ని కొన్నిసార్లు నిలువరించలేనంత బలంగా ఉంటుంది. ఉదాహరణకు ఇందిరాగాంధీ తొలి ‘టర్మ్’ను (1966 –77) ‘వెల్ఫేర్ ఎరా’ అంటున్నంత మాత్రాన, దానికి ముందున్న రెండు దశాబ్దాల పరిణామాల్ని విస్మరించడానికి కుదరదు. అలాగే– మరో రెండు దశాబ్దాల తర్వాత 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్ళీ గతాన్ని గుర్తుచేస్తూ – ‘ఇందిరమ్మ రాజ్యం – ఇంటింటా సౌభాగ్యం’ అంటూ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడంలో ఉన్నది, రెండు వేర్వేరు కాలాల మధ్య ఉన్న ఒక – నిరంత రత్వం!
ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు చేరువ కావడం కనిపిస్తుంది. ఇటువంటి కొన్ని మినహాయింపులు కూడా చరిత్రలో నమోదు అవుతుంటాయి. ఇక్కడ – ‘ప్రభుత్వం’ ప్రజలకు చేరువ కావడం అంటే, అంతిమంగా – ‘రాజ్యం’ (‘స్టేట్’) ప్రజలకు చేరువ కావడం అని అర్థం చేసు కోవాలి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 13 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని గత ఏడాది రిపబ్లిక్ దినోత్సవం నాడు 26 జిల్లాల రాష్ట్రంగా చేసింది. అందువల్ల, మునుపున్న ఒక్కొక్క జిల్లా రెండై – వాటికి ఇప్పుడు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు వచ్చారు. అలా ఈ ‘ప్రభుత్వం’ ప్రజలకు ‘రాజ్యాన్ని’ చేరువ చేసి, ‘బ్యూరోక్రసీ’ (పరిపాలన యంత్రాంగం) ద్వారా తాను కూడా మరింత దగ్గరయింది.
ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకు అవసరం అయింది అంటే.. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన– 57 మంది ఐఏఎస్, 39 మంది ఐపీఎస్ అధికారుల బదిలీల్లో ఏడాది క్రితం కొత్తగా ఏర్పడిన జిల్లాల– కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు ఉన్నారు. పొరుగు రాష్ట్రాలతో మనం సరిహద్దు పంచుకొంటున్న – పార్వతీపురం మన్యం జిల్లా, పాడేరు– అల్లూరి జిల్లా (ఒడిస్సా), అన్నమయ్య జిల్లా (తమిళ నాడు), సత్యసాయి జిల్లా (కర్ణాటక) వంటివి కూడా ఉన్నాయి. ఉంటే ఏమైంది?
దీన్ని– నాలుగేళ్ల క్రితం గ్రామ సచివాలయాలతో మొదలైన పరిపాలన సంస్కరణల ప్రవాహం, రాష్ట్రం ‘మ్యాప్’ అంచు ల్లోని – ‘టెయిల్ ఎండ్’కు చేరి (సింక్) ఇంకు తున్నట్టుగా చూడాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల వల్ల ప్రజలకు నేరుగా పౌర సేవలు అందించే సచివా లయాల పనిని, జిల్లా కలెక్టర్లు మరింత దగ్గరగా ‘మోనిటర్’ చేస్తారు. ఈ ఏర్పాటుతో – రాజధానిలో చీఫ్ సెక్రటరీ నుంచి కింద గ్రామ సచివాలయాల వరకు – ‘నెట్ వర్క్’ అమరిక పూర్తి అయింది.
ఇక్కడొక సందేహం సహజం. స్థిరమైన రాష్ట్ర రాజధాని నగరం అంటూ లేకుండా, ఇంతపెద్ద మానవ వనరుల సమూహాన్ని పరిపాలన యంత్రాంగంలో భాగం చేయడం ఎలా సాధ్యమయింది? ఈ సందేహానికి సమాధానం వెతకడం కోసం లోతైన చర్చ అవసరం. సంప్రదాయ రాజకీయాల దృష్టి నుంచి– ‘ఏపీ హైబ్రిడ్’ పరిపాలనను చూసేవారికి, ఇవి అంత తేలిగ్గా నప్పవు కూడా. ఒకప్పుడు పరిపాలన అంటే, రాజధాని ‘నగరం’లో లంగరు వేసుకుని కూర్చుని చేసే పని అనేది మనకున్న అవగాహన. ప్రపంచీ కరణ నేపథ్యంలో ఈ అవగాహన మేర పాలన సాగిస్తే అభివృద్ధి అంతంత మాత్రమే అవుతుంది.
అయితే, రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఈ సూక్ష్మం గ్రహింపు లేక పోయింది. ఒకప్పుడు మనమే అనుమతించిన– ‘టెక్నాలజీ’ ఈనాడు మనల్ని కూడా ‘అవుట్ డేటెడ్’ చేయడం ఇందులో గుర్తించవలసిన మర్మం. చివరిగా.. ప్రపంచీకరణతో వచ్చిన– ‘జియో పాలిటిక్స్’ వల్ల కేంద్రం ‘ఢిల్లీ’ విడిచి దేశం అంచు (మార్జిన్స్)లకు చేరడం కొత్త పరి ణామం! ఇవి ఇక ఎంతమాత్రమూ ఒకచోట కట్టు కొయ్య పాతుకుని కట్టేసుకుని కూర్చుని పరిపాలన చేసే రోజులు కావు.
కనుకనే, ఈ నెల మొదటి వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మిజోరాం వెళ్లి రూ. 1.76 లక్షల కోట్లతో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ – రోడ్డు, రైలు, విమాన సర్వీసులు 2025 లోపుగా పూర్తి చేస్తామని ప్రకటించారు. అక్కడే రూ. 2,500 కోట్లతో చేపట్టే 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరో వారానికి ప్రధాని మోదీ గౌహతిలో జరిగిన ‘బిహూ’ డ్యాన్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఇక గత ఏడాది చివరి ఆరునెలలు ప్రధాని మోదీతో సహా అరడజను మంది కీలక శాఖల మంత్రులు మన కాకినాడ – విశాఖల మధ్య అధికా రిక పర్యటనలు పెట్టుకున్నారు. ఉన్నట్టుండి వీరంద రికీ దేశం ‘మార్జిన్స్’ ఎందుకు ముఖ్యమయ్యాయి? ఈ ప్రశ్నకు సమాధానం – ‘మార్జినల్ సెక్షన్స్’ సీఎంగా పేరుపడ్డ వైఎస్ జగన్ వద్ద దొరకవచ్చు!
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక అంశాల విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment