విజయవాడలో సెప్టెంబర్ 21–22న జరిగిన ‘ఏ.పి. వాణిజ్య ఉత్సవ్ –2021’ చూశాక, ఇది మునుపటి ‘పెట్టుబడుల సదస్సు’ వంటిది కాదని స్పష్టం అయింది. దీని లక్ష్యం అంతకంటే విస్తృతమైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత– భారత ప్రభుత్వం చేసిన ఉమ్మడి రాష్ట్రవిభజన, రాజకీయంగానే కాదు, ‘ఏరియా స్పెసిఫిక్’ దృష్టితో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు సరిగ్గా కుదిరింది. ప్రతిపక్ష నాయకుడిగా తొలి ఐదేళ్ళ మధ్యలో ‘అసెంబ్లీ’ నుంచి బయటకు వచ్చి, చేసిన పాదయాత్ర వల్ల ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడానికి అది అన్నివిధాల అమిరింది. అందుకే, 2019 ఎన్నికల్లో కేవలం 4 పేజీల ‘మేనిఫెస్టో’తో ప్రజల్లోకి రావడం సాధ్యమయింది. అలా ఆయన తన ‘టీమ్’తో చేసిన ‘హోమ్ వర్క్’ ఎటువంటిదో, ఇప్పుడు అర్థమవుతున్నది.
ఇప్పటివరకు విధాన నిర్ణేతలు లేదా అత్యున్నత స్థాయి పరిపాలన వర్గాల్లో పరిమిత స్థాయిలో అమలైన కలుపుకు పోయే (‘కన్వర్ జెన్స్’) విధానాన్ని, విస్తృత స్థాయిలో అమలు చేయడానికి జగన్ సిద్ధమయ్యారు. ఇక్కడ రెండు కీలకమైన అంశాలు వున్నాయి. మొదటిది – ఇది ఇంకా కుదురుకుంటున్న దశలోనే ఉన్న విభజిత ఏపీకి తొలి దశాబ్ది. రెండు– ప్రభుత్వాధినేతగా వైఎస్ జగన్‌ది తొలి అనుభవం. అయినా ‘లీడర్’గా జగన్ తొలి దశాబ్దిలోనే ‘హైబ్రిడ్ గ్రోత్ మోడల్’ చేయడానికి తీసుకున్నది సాహసోపేతమైన ‘లైన్.’ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వ విధానాల్ని ‘బ్యురోక్రసీ’ అమలు చేయడం తెలిసిందే.
అయితే, అందులో ఏదైనా, ‘తొలి ప్రయోగం’ ఉన్నప్పుడు, అధికారులు కూడా ‘కెరియర్’పరంగా తమని తాము నిరూపించుకోవడానికి, దాన్ని సవాలుగా స్వీకరిస్తారు. అయినా గడచిన పాతికేళ్ళుగా ‘మార్కెట్ ఎకానమీ’లో ‘ఇ–గవర్నెస్’ ఆఫీస్ విధానంలో పనిచేస్తున్న అధికారులకు ‘కన్వర్‌జెన్స్’ గురించి సాకల్యంగా తెలుసు. అందుకే, వారు విజయవాడ ‘వాణిజ్య ఉత్సవ్’ వేదికపైన వున్న ‘పరిశ్రమల’ పక్కన ‘వ్యవసాయాన్ని’ అవలీలగా కూర్చోబెట్టి, రెండింటినీ ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖతో ఒకటిగా చేయగలిగారు!
నిజానికి ఈ ‘కన్వర్‌జెన్స్’ అభివృద్ధి విధానం మరీ కొత్తదేమీ కాదు. రాష్ట్ర విభజనకు పదేళ్ళ ముందు ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు లావూస్ శ్వాబ్ 2004 ఫిబ్రవరి 10న హైదరాబాద్ వచ్చినప్పుడు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుత ఆర్థికస్థితి నుంచి తదుపరి దశకు కాకుండా, రెండుమూడు దశలు అవతలకు దూకే– ‘లీఫ్ ఫ్రాగ్’ అభివృద్ధి విధానాన్ని సూచించాడు. కానీ, అప్పటికి ‘విజన్–2020’ అంటూ ‘షో కేసింగ్’ తో కాలక్షేపంచేసే నాయకత్వాల్లో ఇవేవీ కార్యాచరణ వైపుగా కదలలేదు. మళ్ళీ ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ డైరెక్టర్ ఎరోల్ ఒబెక్, ప్రొఫెసర్ విలియం ఏ. కార్టర్ 2020 ఏప్రిల్ 10న రాసిన పరిశోధనా వ్యాసం– ‘ది నీడ్ ఫర్ లీఫ్ ఫ్రాగ్ స్ట్రాటజీ’లో ‘ఈ ప్రక్రియ ఆదాయాల పరంగా అంతరాన్ని తగ్గిస్తుందని, పౌరులకు కొత్త సంపదను అందిస్తుందం’టున్నారు.
‘లీఫ్ ఫ్రాగ్’ అభివృద్ధి నమూనాకు పరిపాలనా వ్యవస్థలో వేర్వేరు శాఖల మధ్య ‘కన్వర్‌జెన్స్’ తొలిమెట్టు. ఈ నేపధ్యంలో విజయవాడ ‘వాణిజ్య ఉత్సవ్’ను చూసినప్పుడు, మనవంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో– ఆహార పంటలు, వాణిజ్య పంటలు, పాడి, మత్స్యసంపద, మాంసం, గుడ్లు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ‘పరిశ్రమలు–వాణిజ్యం’ రంగంతో అనుసంధానం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం.
అందుకోసం కొత్తగా ఆగస్టులో ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ఏర్పాటుచేసింది. ఈ శాఖ తొలి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ‘వాణిజ్య ఉత్సవ్’ వేదికపై ఉంటే, చీఫ్ సెక్రటరీ ఆహ్వానంతో సదస్సు ప్రారంభం, సీఎం పక్కన మంత్రులు, కార్యదర్శులు ఉండగా, వాణిజ్య వర్గాల ప్రతినిధులు వేదికముందు వరుసలో కనిపించడం, ఈ మొత్తం ‘దృశ్యం’ ఈ ప్రభుత్వం మునుపటిలా ‘ప్రైవేట్ ప్లేయర్స్’ కోసం కాదనే సందేశం ఇచ్చినట్లయింది. గతవారం నెల్లూరులో పర్యటించిన కేంద్ర మత్స్య శాఖ స్టేట్ మంత్రి డా. ఎల్. మురుగన్ కేంద్రం కొత్తగా మత్స్యశాఖను పెట్టినట్టు చెప్పారు.
మనవద్ద కొత్తదైన ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖ వ్యవసాయ అనుబంధ రంగాలకు ‘స్పోక్స్ అండ్ హబ్’ తరహాలో ఇకముందు ‘వాణిజ్య’ వసతి కల్పించనుంది. అయితే, దీని ముందస్తు సంసిద్ధత కోసం గత ఏడాది జూన్ 6న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో సీఎం జగన్ జరిపిన సమావేశం కీలకమైనది. చేపలు, రొయ్యల్లో ‘యాంటి బయాటిక్స్’ ‘హెవీ మెటల్స్’ లేకుండా తనిఖీ చేయడానికి ఈ ఏడాది జూలైలో 14 ‘ఆక్వా ల్యాబ్స్’ ఏర్పాటు ఈ దిశలో మరో ముందడుగు. ఈ ‘నెట్‌వర్క్’ అమలు కోసం పెట్టినవే –‘ఆర్‌బీకే’లు. సముద్ర ఎగుమతుల్లో 2020–21లో 16 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో వున్న ఏపీ దాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే, అందుకోసం ‘లీఫ్ ఫ్రాగ్’ మోడల్‌తో వైఎస్ జగన్ ప్రభుత్వం ‘హైబ్రిడ్ స్టేట్’ దిశగా వేస్తున్న అడుగులు ఇండియాకు కొత్తవి.
జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment