ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థలో జరిగిన ఆర్థిక అవకతవ కలు జాతీయ స్థాయి వార్తల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ సంస్థ పనిలో లొసుగుల విషయం అటుంచితే, దీని స్థాపనకు ముందు మూడు దశాబ్దాల కాలం పాటు కుంటుకుంటూ సాగి... గిడసబారిన బడుగు బలహీన నిమ్న వర్గాల యువత ఉపాధి దీన చరిత్రను చూడాల్సి ఉంది.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో 1985లో ఇండియాలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఏర్పడింది. ఇది జరిగాక, విద్యను ఉపాధి కేంద్రిత దృష్టితో చూడడం మొదలయింది. అంతకు ముందు అది– ‘జ్ఞానం’ కేంద్రంగా ఉండేది. ఈ శాఖ ఏర్పడిన తర్వాత మానవీయ శాస్త్రాల నుండి వాణిజ్య, శాస్త్ర– సాంకేతిక విద్య వరకు అన్నింటినీ ఒక గొడుగు కింది చేర్చి చూడడం మొదలయింది.
అలా తొలి మానవ వనరుల శాఖ మంత్రి పీవీ నర సింహారావు ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాక, 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలలో మన– ‘మానవ వనరుల’ దృష్టికి ద్రవరూపం ఏర్పడి, అది అన్ని అభివృద్ధి – సంక్షేమ పార్శ్వాల్లోకి ప్రవహించడం మొదలయింది. చివరిగా అప్పటి ప్రధాని మన్మోహన్ ‘సీఐఐ’ వంటి వేదికల మీద ఉపాధి అవ కాశాల కల్పన పెంచమని పారిశ్రామిక వేత్తలను కోరడం ఈ మొత్తం పరిణామాలకు ముగింపుగా చూడాల్సి ఉంటుంది.
ఈ కాలంలోనే పట్టణాభివృద్ధి, విద్యుత్తు, కమ్యూని కేషన్స్, పారిశ్రామిక, ఇరిగేషన్ రంగాల్లో ‘ఇంజనీరింగ్’ విద్య అవసరం బాగా పెరిగింది. దాంతో మానవ వనరుల అవసరాన్ని ‘డిమాండ్ – సప్లయ్’ దృష్టితో చూడడం మొదలయింది. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, వనరుల సహకారంతో ప్రయివేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొదలై అవి లాభసాటి వ్యాపారంగా మారడంతో మన (ఉమ్మడి) రాష్ట్రంలో ఆ కోర్సుల్లోకి ప్రవేశం ఖరీదు అయ్యింది.
దాంతో 2000 నాటికి ఇంజనీరింగ్ కాలేజీల ‘గ్రేడింగ్’ను బట్టి ఎంపిక చేసుకున్న వాటిలో తల్లితండ్రులు తమ పిల్లల్ని చేర్చడం మొదలయింది. ఆ దశలో స్థోమతు లేని పిల్లలకు 2004 తర్వాత వైఎస్సార్ ప్రభుత్వంలో– ‘ఫీజ్ రీయింబర్స్‌మెంట్’ పథకం అందు బాటులోకి వచ్చాక; పెద్ద ఎత్తున అన్ని ఆర్థిక స్థాయుల్లోని పిల్లలు వీటిలో చదివి దేశ విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందారు.
ఎప్పుడైతే సాంకేతిక విద్య ‘మార్కెట్’ ప్రతిపాదికగా మారిందో, అప్పుడు వీరి ఉపాధి అవకాశాలు ‘ఫస్ట్–కమ్ –ఫస్ట్’ వడ్డనగా తయారైంది. అప్పటికే ఇంజనీరింగ్ డిగ్రీ మాత్రమే చాలదు ఎంబీఏ ఉండాలనీ, ఎమ్‌టెక్ తప్పనిసరి అనీ, కాదు అమెరికాలో ఎమ్‌ఎస్ ఉండాలి అనే భిన్న ధోర ణులు సాంకేతిక విద్య మార్కెట్లో వ్యాపించాయి. చివరికి ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నప్పటికీ పలు స్థాయుల్లో జరిగే ‘ఎలిజిబి లిటీ టెస్ట్’ పాసైతేనే ఉద్యోగం అనే పరిస్థితి దాపురించింది.
ఫలితంగా ఆలస్యంగా ఇందులోకి వచ్చిన అంతంత మాత్రపు చదువులున్న తల్లిదండ్రులకు వారి పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. అప్పటికే ‘హ్యుమానిటీస్’ డిగ్రీలకు ఉద్యోగ మార్గాలు మూసుకు పోయాయి. ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం చదువు పునాది లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ కరవు కావడం, గ్రామీణ నేపథ్యం,వంటివి వీరి ఉపాధికి అవరోధాలు అయ్యాయి. 2007లో శేఖర్ కమ్ముల తీసిన ‘హేపీ డేస్’ సినిమాలో ‘కేంపస్ సెల క్షన్స్’లో ఉత్తరాంధ్ర గ్రామీణ విద్యార్థి పడిన పాట్లు ఈ పరిస్థితికి అద్దం పట్టాయి.
డిగ్రీ ‘సర్టిఫికెట్’ ఉండికూడా కేవలం ‘స్కిల్స్’ లేక కుటుంబ పోషణార్థం‘మార్కెటింగ్ ఎగిక్యూటివ్’, ’రియల్ ఎస్టేట్ ప్రమోటర్’ వంటి దుఃస్థితిలో వీరు ఉండిపోయారు. ఇటువంటి ఉపాధి దుఃస్థితి నేపథ్యంలో 2014లో రాష్ట్ర విభ జన జరిగాక, టీడీపీ ఏపీలో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి చర్యను సంక్షేమం అనుకుందో లేదా అభి వృద్ధి అనుకుందో తెలియదు గానీ; పైన చెప్పుకున్న దయ నీయ స్థితిలో ఉంటూ ఉపాధి వెతుక్కుంటున్న యువత కోసం ‘ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఏర్పాటు చేసింది. చివరికి 2014–19 మధ్య ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే కాలం ఎవరి కోసం ఆగదు కనుక ‘ఫస్ట్–కమ్–ఫస్ట్’ అనేది అన్ని కాలాల్లోనూ ఉంటుంది.
ఈ జూలై రెండో వారంలో జరిగిన యూనివర్సిటీ వైస్–ఛాన్సలర్ల సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ – సాంకేతిక విద్యా రంగంలో నూతన పోకడలతో (ఎమర్జింగ్ టెక్నాల జీస్) సిలబస్‌లను రూపొందించాలని కోరారు. ప్రపంచం ఇలా ముందుకు పోతుంటే, కేవలం ‘స్కిల్స్’ లేక మిగిలిపోతున్న పిల్లలు భవిష్యత్తు ఒక జీవిత కాలం లేటు కావడం అనేది, ఇప్పటికైనా ఈ ‘స్కిల్’ కుంభకోణం ఉదంతంలో మనకు కనిపిస్తుందా?
జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment