సవాళ్లను ఎదుర్కొనేవాళ్లకే భవిష్యత్తు | Johnson Choragudi Guest Column | Sakshi
Sakshi News home page

సవాళ్లను ఎదుర్కొనేవాళ్లకే భవిష్యత్తు

Published Sun, Jul 30 2023 9:39 AM | Last Updated on Sun, Jul 30 2023 9:42 AM

Johnson Choragudi Guest Column - Sakshi

అమెరికాతో ఆయుధ కొనుగోళ్ల ఒప్పందం ముగిసిన నెల రోజుల్లోనే మళ్ళీ అదే పని మీద మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ వెళ్లారు. జూలై 14న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యు యేల్‌ మెక్రాన్‌తో 26 రఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్, మూడు స్కార్పియన్‌ డీజిల్‌ –ఎలక్ట్రిక్‌ సబ్‌ మెరైన్స్‌ కొనుగోలుకు ఒప్పందం జరిగింది. భారత ప్రభుత్వం వీటిని మన నౌకాదళం (నేవీ) అవసరాల కోసం సమకూర్చుకో బోతున్నది. యుద్ధ సమయంలో వినియోగించే డాక్‌ షిప్స్‌ ‘ల్యాండింగ్‌ ఫ్లాట్‌ ఫారమ్స్‌’ నిర్మాణానికి, ఫ్రాన్స్‌ తరఫున – ‘ఎల్‌ అండ్‌ టీ’, ఇక్కడ మన విశాఖపట్టణం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌’ రెండూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది.

ఈ రెండు దేశాల పర్యటనల్లో కొన్ని ఇతర అంశాలు ఉన్నప్పటికీ, ఈ దేశాలతో ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు ఇక్కడ ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. గత నెల 20–24 తేదీల్లో జరిగిన మన ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో అమెరికాకు చెందిన ‘జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ’, మన ‘హెచ్‌ఏఎల్‌’తో కలిసి– ఫైటర్‌ జెట్స్‌ తయారీకీ, మన సముద్ర తీరంలో వినియోగానికీ 3 బిలియన్‌ డాలర్ల వ్యయంతో 31 ‘సీ– గార్డియన్‌ డ్రోన్స్‌’ కొనడా నికీ ఒప్పందం కుదిరింది. ‘ఇండో–పసిఫిక్‌’ రీజియన్‌ (ఇది మన దేశం చుట్టూ ఉంది) సముద్ర జలాల్లో అమెరికా యుద్ధనౌకలు ఉన్నప్పుడు– వాటి సర్వీస్, మరమ్మత్తులు మనదేశంలోని ‘కట్టు పల్లి’ షిప్‌ యార్డ్‌ (చెన్నై), ‘మెజగాంవ్‌’ డాక్‌ (ముంబై), ‘గోవా’ షిప్‌ యార్డ్‌లలో చేయడానికి అమెరికాతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు సముద్ర జలాలతో ముడిపడినవి కావడంతో, మున్ముందు ఇందుకు సంబంధించిన పర్యవసానాలు, ఇండి యాలో రెండవ పెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రంగా ఏపీని అవి నేరుగా తాకే అంశం. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే సముద్రం మీద నుంచి ఉగ్రదాడి జరిగితే ఎలా స్పందించాలనే మాక్‌ డ్రిల్‌ తూర్పు నౌకాదళం, మెరైన్‌ పోలీసులూ కలిసి ఏపీ తీరంలో నిర్వహించారనే వార్త రావడం ఇక్కడ గమనార్హం.

అంతర్జాతీయ సంబంధాలలోకి ‘జియో–పాలిటిక్స్‌’ వచ్చాక, మారిన కొత్త దృశ్యం ఇప్పుడు అన్ని ఆసియా దేశాల్లో కనిపి స్తున్నది. పదేళ్ల వెనక్కి వెళితే అప్పటి పరిస్థితి ఏమిటి? 2013 జనవరి 1న అమెరికా న్యూస్‌ ఏజెన్సీ– ‘రాయిటర్‌’ కాలమిస్ట్‌ ‘జిమ్‌ ఉల్ఫ్‌’ ఆసక్తికరమైన వ్యాసం రాశారు. అందులో అమెరికా ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా– ‘ఇండో–పసిఫిక్‌’ విషయంలో తీసు కున్న వైఖరితో– ‘మన పరిశ్రమలకు మంచి రోజులు రాబోతు న్నాయి; చైనా రక్షణ వ్యయం కారణంగా అమెరికా ఆయుధాల వ్యాపారం ఆగ్నేయ – ఆసియాలో పెరగనుంది’ అని అమెరికా ‘ఏరో స్పేస్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌’  వైస్‌–ప్రెసిడెంట్‌ ‘ప్రైడ్‌ డౌనీ’ అన్నట్టుగా ఆ కాలమిస్ట్‌ రాశారు.

సరే 21వ శతాబ్ది నాటికి ‘జియో పాలిటిక్స్‌’ కీలకమైంది. మనం ఒకందుకు వాళ్లొకందుకు అన్నట్టుగా సాగిన ఈ వ్యవహా రంలో, ఎప్పుడెతే అమెరికాతోపాటు యూరప్‌లోని అగ్రదేశాల విదేశాంగ విధానం– ‘ఇండో–పసిఫిక్‌’ కేంద్రితం అయిందో; అప్పట్లోనే అంటే యూపీఏ –2 నాటికే ‘రీ మ్యాపింగ్‌ ఇండియా’ అవసరం మనకు అనివార్యం అయింది.

గడచిన రెండు దశాబ్దాల పరిణామాలు చూశాక, జూన్‌ రెండవ వారంలో సీనియర్‌ బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ హోం శాఖ సహాయమంత్రి సీహెచ్‌ విద్యాసాగరరావు–‘డా‘‘ అంబేడ్కర్‌ చెప్పినట్టుగా హైదరాబాద్‌ను ఇండియాకు రెండవ రాజధాని చేయాలి’ అని కోరడాన్ని మన దేశం– ‘రీ మ్యాపింగ్‌’ అవస రాలకు అదనపు కొనసాగింపుగా చూడాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం ఆగ్నేయ–ఆసియా అవసరాలు దృష్ట్యా ఢిల్లీ పర్యవేక్షణ దక్షిణ కేంద్రితంగా ఉండాల్సిన అవసరం కనుక ఏర్పడితే, దేశీయంగా కూడా ‘జియో–పాలిటిక్స్‌’ వైఖరి ప్రయోజనకరం కావొచ్చు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్‌ భవన సముదాయం అందుకు ధీటైన తోడ్పాటు అవుతుంది. జనరల్‌ ఎన్నికలకు సమీపాన ఇప్పుడు మనం చూస్తున్నవి విజయాలు అనిపిస్తే, ఇదేదో ప్రధాని నరేంద్ర మోదీ, తీరాంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభావం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఒకానొక కాలం నాటికి ఎలా పరిణమించాయి అనేది ఇక్కడ ప్రధానం.

అప్పటికి అక్కడ వాటిని ఎదుర్కోవలసిన ప్రభుత్వాలు ఏ మేరకు మారినా – ‘జియో–పొలిటికల్‌’ వేడిని తట్టుకోవడానికి తగినంత సంసిద్ధత ఏ మేరకు ఉంది? అనేదే ఇక్కడ ప్రధానం. ఎందుకంటే... ప్రజలు, ప్రాంతం, సార్వభౌమత్వం అనే ‘రాజ్యం’ ఉపాంగాల భద్రత కోసం కాలానుగుణంగా ‘ప్రభుత్వం’ తనను తాను ‘రీ–మ్యాపింగ్‌’ చేసుకోవలసి ఉంటుంది. ఇటువంటి అవసరం పడిన తర్వాత, మన వద్ద మొదట 2014లో రాష్ట్ర విభజన రూపంలో జరిగితే, సూక్ష్మస్థాయిలో మరోసారి అది 2022లో కొత్త జిల్లాల ఏర్పాటుగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ సీఎమ్‌ఓ ప్రధాన సలహాదారు అజయ్‌ కల్లం తరచూ అంటూఉండే – ‘కోర్స్‌ కరెక్షన్‌’ ప్రక్రియను మన మారబోయే అవసరా లకు íసిద్ధంగా ఉండటంగా చూడాల్సి ఉంటుంది. పదేళ్ల విభజన తర్వాత, జరగనున్న జనరల్‌ ఎన్నికల్లో ప్రజల ఎంపిక ఎలా ఉండాలి? అన్నప్పుడు మన రాష్ట్రం సరిహద్దుల్లో వేగంగా మారుతున్న ‘గ్లోబల్‌’ పరిణామాలను ఎదుర్కోవడానికి పటిష్ఠమైన ‘గవర్నెన్స్‌’తో సిద్ధమవుతున్నది ఎవరు? అనేదే కొలమానం.


-జాన్‌సన్‌ చోరగుడి , వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement