ప్రభుత్వం చేయవలసింది, అభివృద్ధి – సంక్షేమం అని ఒక స్థూల నిర్వచనం ఇవ్వడం వల్ల, ఈ రెండింటి మధ్య ఉండే మరికొన్ని అంశాలు ఎప్పటికీ ‘అనిర్వచ నీయం’గా మిగిలి, వెలుగు చూడవు! అయితే, వాటిని కూడా కలుపుకొని చూడ్డం మొదలుపెడితే, ‘అభివృద్ధి’– ‘సంక్షేమం’ మాత్రమే కాకుండా, మరొక కొత్త అంశం ఉందనే స్పృహ మనకు కలుగుతుంది. ఒకప్పుడు– ‘అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను...’ అనే చరిత్ర, ఇప్పుడు ఈ రెండింటిలో ఏ జాబితా కిందకు వస్తుంది అనే ప్రశ్న అటువంటిదే. ‘రాజ్యం’ పట్టించుకునే, ఇటువంటి మానవీయ పార్వ్వాలను ఈమధ్య– ‘ప్రపంచ బ్యాంక్’ భాషలో ‘ఇంక్లూజివ్ గ్రోత్’ అంటున్నారు. అంటే– అందరినీ కలుపుకొని ‘వృద్ధి’ చెందుదాం... అని. ప్రభుత్వాల పాలన తీరును బట్టి సామాన్య జనం ‘దేహభాష’ మారుతుంది. అప్పటివరకు ఉగ్గబట్టుకున్న ఒత్తిడిని వారు ‘వెంటిలేట్’ చేయడం మొదలు పెడతారు. పత్రికల భాషలో దాన్ని– ‘ఆందోళన’ అంటారు. అయితే, విధాన నిర్ణయాల వద్ద వాటి పరిష్కా రాలు, ప్రతిఫలనాలు ఎలా వున్నా, ఒక ఉమ్మడి సమస్య పరి ష్కారం కోసం పదిమంది బయటకు వచ్చి గొంతు ఎత్తడం అనేది, అప్పటికి అక్కడ అది వారి తొలి విజయం అవుతుంది! (చదవండి: ఆర్థికమే కాదు... సామాజికం కూడా!)
ఈ అక్టోబర్ చివరివారంలో గడచిన ఏడున్నరేళ్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి ‘హెల్ప్’, ‘విముక్తి’ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి, ‘ట్రాఫికింగ్ నిరోధం, రక్షణ, పునరావాసం బిల్లు– 2021’ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని, గుంటూరు జిల్లా నరసరావుపేట అధికార పార్టీ ఎం.పి. లావు శ్రీకృష్ణ దేవరాయలకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. బాలికలు, స్త్రీల ఆక్రమణ రవాణా (‘ట్రాఫికింగ్’) తీవ్ర అమానవీయ సామాజిక సమస్యగా పరిణమించి, దేశ వ్యాప్తంగా అసాంఘిక శక్తులకు కొత్త ఆదాయ వనరుగా మారింది. పౌరసమాజం నుంచి వచ్చే ఇటువంటి స్వచ్ఛంద డిమాండు, నిజానికి రాజకీయాలకు అతీతంగా చర్చనీయాంశం కావాలి. కానీ ‘మీడియా’ ప్రభుత్వానికి పౌరసమాజానికి మధ్య నిత్యం దట్టమైన పొగమంచు తెరలు కడుతూ 24 బై 7 వార్తలు అందించడం మొదలయ్యాక, ఇది ప్రముఖంగా వార్త కాలేదు. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం)
నవంబర్ 27న కర్నూలు నగరంలో జరిగింది కూడా ఇటు వంటిదే. రాష్ట్ర అబ్కారీ శాఖ ఉల్లాల్ రోడ్డులో కొత్తగా కట్టిన ఒక బిల్డింగ్ కాంప్లెక్స్‌లో వైన్‌షాపు ప్రారంభించాలని, ముందు రోజు అర్ధరాత్రి మద్యం కేసుల్ని అక్కడకు చేర్చింది. విషయం తెలిసిన పరిసరాల్లోని మహిళలు అక్కడికి పెద్ద ఎత్తున చేరి, ఆ శాఖ అధికారుల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. మూడు పెద్ద పాఠ శాలలు వున్న కూడలిలో ప్రభుత్వం వైన్‌షాపు తెరిస్తే, విద్యా ర్థులతో అక్కడికి వచ్చే తల్లులకు అది ఇబ్బంది అనేది వారి అభ్యంతరం. ఆ షాపును కొద్ది రోజుల్లోనే వేరేచోటికి మారుస్తామని, ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మహిళా అధికారి హామీ ఇచ్చినప్పటికీ, వారు అందుకు అంగీకరించ లేదు. మనం ఎన్నుకొన్నది ప్రజాహితం కోరే ప్రభుత్వం అనే నమ్మకం ‘ఆఖరి మైలు’ జనంలో కూడా కలిగినప్పుడు, ప్రజా స్పందన ఇలా బహిరంగ దృశ్యమవుతుంది. కొత్తగా తమదైన ‘జాగా’ను వారు ఇలా దొరకబుచ్చుకుంటారు. ఆంగ్లంలో దీన్ని ‘అడ్వాంటేజ్’ తీసుకోవడం అంటారు. ‘నీతో కాక, ఇంకెవరితో చెప్పుకుంటాం?’ అని– తమ హృదయాలకు దగ్గరైన నేతల ప్రభుత్వాల్లో జనం తమ ఆక్రోశాన్ని సైతం ఇలా ఆస్వాదిస్తారు. (Nandamuri Balakrishna: ఎప్పటికీ వెంటాడే వెన్నుపోటు!)
ఇటువంటి వాటిని అభివృద్ధి–సంక్షేమం చట్రంలో పెట్టి చూడ్డం కష్టం. ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, అనంతపురం జిల్లాల గ్రామీణ జిల్లా పరిషత్ పాఠ శాలల విద్యార్థుల విషయంలో జరిగింది కూడా అటువంటిదే. గ్రామాల్లో జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివే పిల్లల దేహ ధారుడ్యానికి క్రీడల ప్రోత్సాహానికి మౌలిక సదుపాయాలు లేవన్నది జగమెరిగిన సత్యం. అటువంటిది, ఒక్కొక్క పాఠశాలకు పది లక్షలు మించకుండా ఖర్చు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో మిగిలిన ‘మెటీరియల్’ నిధులను ప్రభుత్వం ఇందుకు ఖర్చు చేస్తున్నది. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ ట్రాక్స్ ఆయా స్కూల్స్‌కు అనుబంధంగా ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ క్రీడల అభివృద్ధి సంస్థ ‘శాప్’ను తగు చర్యలు కోసం కోరింది.
ఎక్కడైనా ‘తేమ’ ఉన్నచోట రాళ్ళ మధ్య కూడా గరిక మొలుస్తుంది. ‘తోకలు కత్తిరిస్తా...’ అంటూ హెచ్చరించేవారికి ఇటువంటి ‘గ్రామర్’ అర్థం కావడం కష్టం. ‘ఆఖరి మైలు’ జనం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ఎటువంటిదో, ‘సోషల్ మీడియా’ వల్ల ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రజలు దగ్గరగా గమనిస్తున్నారు. అదే వారిలో– ‘అకస్మాత్తుగా వచ్చిన ప్రకృతి విపత్తుకు ఆయన మాత్రం ఏమిచేస్తాడు?’ అనే తార్కిక దృష్టి కలిగించింది. విపత్తు తదనంతరం ప్రభుత్వ యంత్రాగం ద్వారా అందిన ఉపశమన చర్యల్లోని నిజాయితీ వారికి కనిపించింది.
- జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త రచయిత, సామాజిక విశ్లేషకుడు
Comments
Please login to add a commentAdd a comment