విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి దశాబ్ది మరో రెండున్నర ఏళ్ల కాలవ్యవధిలో 2024 జూన్ నాటికి పూర్తి కానుంది. ఈ తొలి దశాబ్ది రెండవ అర్ధభాగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కొత్త రాష్ట్రం నిర్మాణానికి పూర్తిచేసిన, ఆరంభించిన పథకాలను వేర్వేరుగా చూడాలి. పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినవి ‘నవరత్నాలు’ అనుకుంటే, వాటిలో అమలు పూర్తి చేసుకున్నవి ఎక్కువ. ఇక గడచిన రెండున్నర ఏళ్లుగా వైఎస్ జగన్ చేస్తున్న కసరత్తును గమనించినప్పుడు, అది– ‘అభివృద్ధి’ ‘వృద్ధి’ లక్ష్యంగా అని ఇప్పుడు స్పష్టం అవుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న ‘వర్క్ ఫ్రం హోమ్‌టౌన్స్’ ఆలోచన చూశాక కలుగుతున్న అభిప్రాయమిది.
ఇది ‘సైబరాబాద్’కు భిన్నంగా దానికి రెండవవైపు నిలిచే అంశం! మునుపటి ‘టవర్’ నమూనా మాదిరిగా ఇది ‘ఒకే ఒక్కటి’ కాదు. ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలో ఈ ‘టౌన్స్’ ఉంటాయి. ‘శాటిలైట్’ ద్వారా ఇచ్చే సర్వీస్‌కు మనం ‘వైఫై’ అందిస్తే, దాన్ని ఎవరైనా ఎక్కడ కూర్చుని చేస్తే మాత్రం ఏమిటి అనే దిశలో ఏపీ సీఎం ‘టీమ్’ యోచన సాగుతూ ఉంది. ఇది పూర్తిగా 21వ శతాబ్ది ఆలోచనా ధోరణి. ఇప్పటికే ప్రభుత్వం తాను అందిస్తున్న ఎన్నో సేవలను ‘ఆన్‌లైన్’ ద్వారా ప్రజలకు చేరుస్తున్నది. అయితే, తమ ఉద్యోగుల శ్రమనుంచి ప్రైవేట్ కంపెనీలు ఆర్జిస్తున్న లాభాల్లో వాటా, ఈ ‘వర్క్ ఫ్రం హోమ్ టౌన్స్’ ఏర్పాటుతో ఇకముందు పరోక్షంగా మూలాల్లో ఉన్న గ్రామాలకూ చేరుతుంది. నగరాల్లో మాత్రమే ఇన్నాళ్ళు ‘వెర్టికల్’గా పంపిణీ అయిన ‘సాఫ్ట్‌వేర్ మార్కెట్’ డబ్బు ఇకముందు ‘హారిజాంటల్’గా కూడా పంపిణీ అవుతుంది. దీనర్థం – గ్రామీణ మార్కెట్ నుంచి అదనంగా ప్రభుత్వ ఖాతాల్లో జమయ్యే జీఎస్టీ ఒక్కటే కాదు, ‘సర్వీస్’ రంగంలో అదనంగా పెరిగే ఉపాధిని కూడా ఇందులో కలిపి చూడాలి. (చదవండి: సంక్షేమ యజ్ఞాన్ని అడ్డుకునే రాక్షసత్వం)
తొలి దశాబ్ది ఏపీ కోణంలో చూస్తున్నప్పుడు ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది కీలకమైన ‘ఏపీని రీమ్యాప్ చేయడం’. రెండోది ‘కోవిడ్’ సంక్షోభాన్ని సానుకూలంగా మలుచుకోవడం. ఇప్పుడు కొత్తగా ‘రీ మ్యాపింగ్ ఏపీ’ అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇరవై ఏళ్ల క్రితం దేశమంతా వికేంద్రీకరణ జరుగుతుంటే, ఏపీలో మాత్రం కేంద్రీకరణ జరిగింది. పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను, ‘చివరి మైలు’ వరకు చేర్చడానికి వాజ్‌పేయి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘స్వర్ణ చతుర్భుజి’, ‘పీఎం, గ్రామ సడక్ యోజన’ వంటి ‘రోడ్ నెట్ వర్క్’తో తదుపరి దశకు చేర్చడాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి.
మారుతున్న కాలానికి ఎదురెళ్లి, ‘కేంద్రీకృత అభివృద్ధి’కి ‘విజన్’ అంటూ కొత్త పేర్లు పెట్టి ‘షో కేసింగ్’ చేసినప్పుడు, జరిగింది ఏమిటో – రాష్ట్ర విభజనకు ముందూ, ‘అమరావతి’ తర్వాతా కూడా చూస్తున్నాము. దాంతో ఈ ధోరణిని సమూలంగా సంస్కరించవలసిన భారం ఇప్పుటి ప్రభుత్వం మీద పడింది. చిత్తూరు–కడప దారిలో ఎర్రమట్టి కొట్టుకుపోయినట్టు ఉండే ఊళ్ళ కోసం ‘అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ పెట్టడం ఒక్కటే కాదు ఎప్పుడూ పేరు కూడా వినని ‘అతిరాస’ వంటి కులాన్ని గుర్తిస్తూ వారికి ఒక ‘కార్పొరేషన్’ పెట్టడం కూడా ఏపీ రీమ్యాపింగ్ కోవలోకే వస్తుంది.
కొందరు ప్రభుత్వాలు మారినప్పుడు పాత నిర్ణయాల అమలు కొనసాగింపు గురించి కొందరు విమర్శకులు మాట్లాడతారు. వాటిని సరిచేయడం పార్టీల మధ్య స్పర్ధగా, మధ్యతరగతి ఆలోచనాపరులు సైతం కొందరు చూసేట్టుగా కొన్ని మీడియా సంస్థలు చేయగలిగాయి. ఇక్కడే బ్రిటిష్ రచయిత చిరిస్ మార్టిన్ చేసిన వ్యాఖ్య మనకూ వర్తిస్తుంది. అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో రాజకీయ ప్రేరేపిత హింస కూడా ‘వార్ స్టడీస్’ లో భాగమే అవుతుంది అంటాడాయన! నిర్దేశిత పరిధులలో పని చేయవలసిన ప్రభుత్వం, తన పరిధి దాటి బయటకు వెళ్లినప్పుడు, ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం అయినా ఏమిచేస్తుంది? మొదట్లో ప్రస్తావించిన ఇద్దరు ప్రధా నుల నిర్ణయాల కొనసాగింపును ఈ కోణంలోనే చూడాలి.
విభజనానంతరం రాష్ట్ర ‘పునాదులు’ ఏర్పడకముందే మన అడుగులు తడబడ్డాయి. వాటిని నేటి ప్రభుత్వం సరిచేస్తుంటే, తరచూ ప్రజాప్రయోజన వ్యాజ్యాల పేరుతో పరిపాలనను దిగ్బంధం చేయడం చూస్తున్నదే. నామమాత్రంగా ఉన్న కేంద్రం చేయూతకు ‘కోవిడ్’ సమస్య అదనమైనప్పటికీ, మునుపటి పాలన తప్పులు సరిచేసుకుంటూనే, ‘నీతి ఆయోగ్’ వంటి కేంద్ర విధాన నిర్ణయ సంస్థల ర్యాంకుల్లో ఏపీ ముందుంది. కారణం– తన అధికార యంత్రాంగం మీద జగన్ ఉంచిన అపార నమ్మకం కావొచ్చు. అందుకే వైఎస్ జగన్ పాలన మొత్తంగా అభివృద్ధి– వృద్ధి లక్ష్యంగా సాగుతున్న పాలన అని చెప్పవచ్చు.
- జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment