ప్రభుత్వ పాలనా వ్యవస్థ ఒక ‘పిరమిడ్’ వలె పైన ముఖ్యమంత్రి ఉంటే, దిగువన మంత్రిమండలి, దాని కింద శాసన సభ్యులు, ఆ తర్వాత జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటారు. దీనికి సమాంతరంగా ‘ఎగ్జిక్యూటివ్’ అనబడే అధికారులు, ఉద్యోగుల వ్యవస్థ ఉంటుంది.అయితే మునుపటికి భిన్నంగా, దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఏపీలో పిరమిడ్ స్థానాన్ని ‘చతురస్రం’ నమూనా పాలనతో భర్తీ చేయడం మొదలయింది. ఇది కొత్త ప్రయోగం కావడంతో దీన్ని ‘గ్రీన్ ఫీల్డ్ పాలిటిక్స్’ ప్రభుత్వం అనొచ్చు.
ఇది ఎలా పనిచేస్తున్నది అంటే, తన ‘పబ్లిక్ పాలసీ’లో భాగంగా కొన్ని ప్రాధాన్యతా రంగాలను ఎంచుకుని, క్షేత్రస్థాయిలో దాని అమ లుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చు కుంటుంది. పైనుండి ఆదేశాలు దిగువకు వెళు తుంటే, దిగువ నుంచి సాధించిన లక్ష్యాల ‘డేటా’ పైకి పంపే ‘టూ–వే’ సమాచార వ్యవస్థ ఉంటుంది. జాప్యం లేకుండా సమాచారం అందేలా ‘నెట్ వర్క్’ కోసం ‘టెక్నాలజీ’, ఆఫీసులు, సిబ్బంది ముందే ఏర్పాటు అవుతాయి. ఇవన్నీ సరే, మరి ప్రాధాన్యతా రంగం ఎంచుకోవడం ఎలా?
యూఎన్‌ఓ ఉపాంగం అయిన– ’యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’
తన 177 సభ్య దేశాలు 2030 నాటికి చేరుకోవాలని నిర్దేశించిన 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ నుంచి స్థానిక అవసరాల ప్రాతిపదికగా వీటిని ఎంచు కుంటారు. ఏపీలో తొలి ప్రాధాన్యతగా విద్య, వైద్యం, వ్యవసాయ అనుబంధ రంగాలను ఈ ప్రభుత్వం ఎంచుకుంది. ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాలు సాధించిన లక్ష్యాల ప్రాతి పదికగా ర్యాంకులు వెల్లడిస్తున్నది. వీటి అమలుకు ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ అనుసరిస్తారు. సరిగ్గా ఇక్కడే – ‘మాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మాకు ఓటు వేసారా లేదా? కూడా చూడకుండా అర్హులైన అందరికీ...’ అంటూ సీఎం జగన్ చెప్పే జనరంజకమైన వాగ్దానం ‘కనెక్ట్’ అవుతుంది. ఇంతకుముందు ఇలా ఎందుకు జరగలేదు అంటే, అది ఎన్నికయిన ప్రభుత్వ నేతకు ఉండే విచక్షణ. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఇలా పని చేస్తున్నాయి అన్నప్పుడు, బయట రాష్ట్రాల అధికారుల బృందాలు తరచూ ఇక్కడికి క్షేత్రపర్యటనలకు రావడమే అందుకు జవాబు.
ఇలా ఈ ప్రభుత్వంలో పిరమిడ్ స్థానంలోకి కొత్తగా చతురస్రం నమూనా పాలన వచ్చాక, పై నుంచి కిందివరకు ఏకరీతిగా ఒక ‘సాలిడ్ సిస్టం’ ఏర్పడి పని చేస్తున్నది. అర్హతలు పరిశీలించి ఒకసారి లబ్ధి దారుడి పేరు ఖరారు అయ్యాక, ‘డి.బి.టి.’ ద్వారా ప్రభుత్వం అందించే ప్రయోజనం నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతున్నది. గతంలో మాదిరిగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుడితో– ‘మీ ఎమ్మెల్యే గారు సిఫార్సు చేసిన లిస్టులో నీ పేరు లేదు’ అనడానికి ఆస్కారం లేదు. ఊళ్ళో రాజకీయాలతో ఒకవేళ తొలుత ఆపినా, ఆప డానికి కారణాలు ఏమిటో అదే ఊళ్ళో వున్న సచివాలయం సిబ్బంది ఫిర్యాదుదారుకు చెప్పాల్సి వస్తున్నది. గ్రీన్‌ఫీల్డ్ పాలిటిక్స్ అమల్లోకి తెచ్చిన ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ‘ప్రివిలేజ్’ సాగక, తొలి ఉక్కపోతలు నెల్లూరు నుంచి రికార్డు అయ్యాయి.
నెల్లూరు జిల్లా గూడూరు శాసన సభ్యుడు వెలగపల్లి వరప్రసాదరావు ‘పార్టీ ఎమ్మెల్యేగా కంటే, ఒక పౌరుడిగా జగన్‌ను ఇష్ట పడుతున్నాను’ అన్నారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో వీరి పరిశీలనను ప్రత్యేకంగా చూడాలి. ఈ ఎస్సీ ఎమ్మెల్యే ఒక పౌరుడిగా తన పరిశీలనను దాచుకోలేక, ఉన్నది ఉన్నట్టుగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పైకి అనేశారు. ఒక ఎమ్మెల్యేకు తమ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడి పట్ల ఉండేది విశ్వాసం, కానీ ఒక పౌరుడికి కాలక్రమంలో కలిగేది – ప్రేమ. దాన్ని ఐదేళ్లకు పరిమితం చేయలేము!
-వ్యాసకర్త జాన్‌సన్ చోరగుడి, అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment