సైకతస్నానం
అక్షర తూణీరం
ఇప్పటికి నెల రోజుల నుంచి పుష్కరాల కబుర్లు తప్ప వేరేమీ లేవు. అన్ని ఆఫీసులు పుష్కరం ముసుగులే సుకు కూర్చున్నా ఏర్పాట్లేమో అరకొరగానే ఉన్నాయి.
పుష్కరాలు కృష్ణానదికి కాదు! నవ్యాంధ్రప్రదేశ్‌కి. ఆ రాష్ట్ర నాయకులకి. వారి పంట పండింది. ఇట్లాంటి సహజ సందర్భాలకు చంద్రబాబు రెచ్చి పోతారు. మహా శివరాత్రి, తిరుపతి బ్రహ్మోత్సవం, సూర్య గ్రహణం, రథ సప్తమి - ఇలాంటి అవ కాశాలు ఏవి వచ్చినా వదలరు. అవన్నీ తన ప్రమేయంతో వచ్చాయన్న స్పృహ కల్పించి, అశేష ప్రజానీకానికి తనదైన శైలిలో ఒక సందేశం ఇస్తారు. మరి పుష్కరం అంటే మామూలా? ముఖ్యమంత్రి హస్తినకు ప్రత్యేక విమానంలో వెళ్లి, చేటలంత పుష్కర శుభలేఖల్ని స్వయంగా పంచి వచ్చారు. కాని వాటికేమంత గొప్ప ప్రతిస్పందనలు కనిపించడం లేదు. ఇక వెంకయ్య మనవాడు కాబట్టి, అందరి తరఫునా అన్ని కృష్ణా రేవు ల్లోనూ మునిగి తేలుతాడని అనుకుంటున్నారు.
నమ్మకాలున్న వారికి పుష్కరం పెద్ద పర్వమే కావచ్చు. వేదిక ధర్మపరాయ ణులు ఆచరించే పవిత్ర క్రతువే కావచ్చు. కాని, ఇప్పుడు జరుగుతున్న ఆర్భా టాలను ప్రజలు గమనిస్తు న్నారు. అయోమయంలో మునకలు వేస్తున్నారు. ఈ వైదిక సంధ్యలో అత్యాధునిక లేజర్ షోలు ఎంత అసందర్భమో అనుకుంటున్నారు. జన సామాన్యాన్ని దారి మళ్లించే ప్రయత్నంలో ఈ పుష్కరాల పడవని మహా నౌకగా చిత్రించి చుక్కానిని పెడమార్గం పట్టించే పనిలో నేతలు బిజీగా ఉన్నారు.
ఇప్పటికి నెల రోజుల నుంచి పుష్కరాల కబుర్లు తప్ప వేరేమీ లేవు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి దాకా పుష్కరం ముసుగులేసుకు కూర్చున్నాయి. ఇక పోలీసు శాఖ అయితే చెప్పనే అక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా ‘మీరో పని చేయండి. చూస్తున్నారుగా... ఈ హడావుడి అయ్యాక రండి’ అని సెలవిస్తున్నారు. నిజానికి పైవారు ఏ పనిలోనూ మునిగి ఉండరు. ఇంతాచేసి ఏర్పాట్లు అరకొరగానే పూర్తయ్యాయి. చేసిన పనుల న్నింటినీ, ఈ పుష్కర పర్వం పూర్తయ్యాక చూసి, బేరీజు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఒక అనుభవజ్ఞుడి సూచన. అయితే, అప్పటికి సగం దార్లు, వంతెనలు, ఘాట్లు మిగిలి ఉండకపోవచ్చు. ‘అప్ప ఆర్భాటమేగాని నూర్పిట్లో యిత్తు లేదని’ సామెత. కృష్ణమ్మ అంత దయగా ఏమీ ప్రవహించడం లేదు. బెజవాడకి దిగువన మూరెడు ఎత్తు నీరు మాత్రమే ఉంది. కొందరు మేము ఈ పుష్కర వేళ కృష్ణా ఇసుకతో స్నానం చేయవచ్చునా? సైకత స్నానం మీద బ్రహ్మశ్రీ విడమరచి చెప్పాలని భక్తులు కోరుతున్నారు. ‘మన అమరావతిని నిర్మించనున్నది జపాన్, చైనా, సింగపూర్ కంపెనీల వారే కదా. వారు పుష్కర స్నానాలకు వచ్చారా?’ అని ఓ కాపిటలిస్ట్ వాకబు చేశాడు. అక్కడ భూమి పోగొట్టుకున్న వారిని ‘కాపిటలిస్ట్’లనే బిరుదు నామంతో వ్యవహరిస్తున్నారు.
ఇవన్నీ ఎట్లా ఉన్నా, పుష్కరాల పుణ్యమా అని కృష్ణా తీరం మహ నీయులను స్మరించుకునే సదవకాశం వచ్చింది. కొత్త కాపిటల్‌లో, మందుల మాంత్రికుడు యల్లాప్రగడ సుబ్బారావుకి, జాతీయ జెండా శిల్పి పింగళి వెంకయ్యకి సముచిత స్థానం కల్పించాలి.
(వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు)