పుష్కరాల కలెక్షన్లు భేష్!
అక్షర తూణీరం
వీవీఐపీలు అందరూ ‘‘ఏర్పాట్లు మహాద్భుతం’’ అన్నారు. వాళ్ల ఏర్పాట్ల కోసమే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేస్తుందని వారికీ తెలుసు.
‘‘...మరి ఈ ఒక్క సింధుయే కాదు, మన నవ్యాంధ్ర నుంచి ఇంటికో సింధు రావాలని కోరు కుంటున్నా. క్రీడా రంగంలో మన రాష్ట్రం ప్రపంచం లోనే నంబర్‌వన్‌గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే, వచ్చే ఒలింపిక్స్ మన నవ్యాం ధ్రప్రదేశ్‌లో జరిపించేందుకు గట్టిగా ప్రయత్నిస్తాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్టేడియంని నిర్మిస్తాం. అవసరమైతే దానికోసం లక్ష ఎకరాలను మన రైతుల నుంచి సేకరిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం...’’ అంటూ మంచం దిగి చీకట్లో వెళ్లిపోతుంటే ఇంట్లోవాళ్లు ఆపారు. ఏమిటో! ఈమధ్య నాకివే కలవరింతలు! పూర్తిగా మేల్కొన్నాను.
పది రోజులుగా పుష్కర విశేషాలు వినీ వినీ – అవే కలలు. అవే కలవరింతలు. ఏవిటో కలల్లో పుష్కర స్నానా నికి రానివారు వచ్చినట్టు, వచ్చినవారు రానట్టు కని పిస్తున్నారు. ప్రత్యేకంగా వెళ్లి సగౌరవంగా ఆహ్వానించినా మోదీ రానేలేదు. తీరా ఆయన వచ్చాక పుష్కర ఘాట్‌లో నిలబెట్టి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా సంక ల్పం చేయించి, నిండా మునకలు వేయిస్తారని భయం కావచ్చునని కొందరు వేరే ఘాట్‌లో అనుకుంటుంటే వినిపించింది. శాస్త్రోక్తమైన పవిత్ర పుష్కర సందర్భాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చని మొదటిసారి అర్థమైందని – ఓ తలపండిన నేత నివ్వెరపోయాడు. దేన్నైనా ఒక వేలంవెర్రి కింద మార్చేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. పుష్కర వేళ కోట్లాది రూపా యలతో నడిపిస్తున్న సాంస్కతిక కార్యక్రమాలు నీరుకారుతున్నాయని ఓ విలేకరి వ్యాఖ్యానించాడు.
పుష్కరాలు పవిత్రమైనవే కావచ్చు. నమ్మకాలున్నవారు గతించిన తమ పెద్దలకు తర్పణలు వదిలే ఒకానొక సందర్భం. అందుకు తగిన అదనపు ఏర్పాట్లు చేయడం పాలకుల బాధ్యత. అంతకుమించి ఏం చేసినా అది ఎక్స్‌ట్రా. ప్రతిరోజూ భక్తుల కలెక్షన్లు చెప్పడం, అంతేగాక రేపు ఎల్లుండిలో పికప్ అయ్యే అవకాశం ఉందని మంత్రులు బాకాలూదటం సినిమా విడుద లని తలపిస్తున్నాయ్. ముందునుంచే ఇన్ని కోట్లమంది వస్తారు, అన్ని కోట్లమంది వస్తారని అవసరమైన ఊహాగానాలను వదలడం చాలా అవసరం. విజయవాడలో పుష్కరాల సందర్భంగా ఎట్నించి ఎటు వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అందులో ఎక్కుతున్నవారు పెద్దగా లేరు. ఒక సామాన్యుడేమన్నాడంటే – ఇదంతా వేస్టు. రేపు నష్టాలొచ్చాయంటూ టిక్కెట్లు పెంచడానికి ఇదంతా’’. ఏర్పాట్లకి జనం సంతప్తిపడాలిగానీ చిరాకు పడకూడదు. వీవీఐపీలు అందరూ ‘‘ఏర్పాట్లు మహాద్భుతం’’ అన్నారు. వాళ్ల ఏర్పాట్ల కోసమే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేస్తుందని వారికీ తెలుసు. అయినా అదొక మర్యాద. అదొక సంప్రదాయం. కష్ణా డెల్టాలో నాట్లు పడలేదు. సాగర్ కింకా చిరునవ్వైనా రాలేదు. ముఖ్యమంత్రి పుష్కర తీర్థంలో తలదాచుకుంటున్నారు. ఇవికాగానే వినాయక చవితి, దాని తర్వాత నిమజ్జనోత్సవం వస్తాయి. ఈలోగా కొత్త కాపిటల్‌లో మంత్రుల చాంబర్స్‌ని తిరిగి కట్టడం పూర్తవుతుంది. అప్పుడు మళ్లీ మొదట్నుంచీ పరిపాలన ప్రారంభం అవుతుంది.
- శ్రీరమణ
వ్యాసకర్త ప్రముఖ కథకుడు శ్రీరమణ