అచ్చం ఇందిరమ్మలాగే..!
అక్షర తూణీరం
మొత్తానికి అంతా గందరగోళంగా ఉంది. రోజుకో నిబంధన రెండు సడలింపులతో కథ నడుస్తోంది. నోట్లరద్దుతో బ్యాంకుల మీద విశ్వాసం పోయింది.
ఈ మధ్య వార్తలు వేడివేడిగా వుంటున్నాయ్. ఆకాశం నించి గరుడ పక్షి మీద ఆకాశం మంచి నేలకి దిగుతున్నట్టు, ఈ పుణ్యభూమిలో లింగోద్భవం అవుతున్నట్టు ఏదో హడావుడిగా ఉంది. ప్రధాని మోదీ ఒక చేత్తో శంఖం పూరిస్తూ, ఇంకో చేత డమరుకం వాయిస్తూ ఊగిపోతున్నారు. సగటు మనిషికి ఏమీ అర్థం కావడం లేదు. గొప్పవాళ్లకి అర్థం కావడానికి ఏమీలేదు. అప్పుడు ఇందిరమ్మ కూడా ఇలాగే శివాలెత్తించింది. రాజాభరణాల రద్దు చేస్తున్నా, మొత్తం ఆ సొమ్ములు పేద ప్రజలకే అన్నది. బ్యాంకుల్ని జాతీయం చేశా. బడుగు బలహీన వర్గాలు కావాల్సినంత డబ్బు వాడుకోవచ్చు. అంటూ భరోసా ఇచ్చింది. తర్వాత ఏం జరిగిందో, ఏం జరగ లేదో అందరికీ తెలుసు. అప్పుడు కూడా అవినీతిపై అచ్చం ఇలాంటి వార్తలే వచ్చేవి.
వెనకటికి ఓ రాజుగారు ఇలాగే పన్ను కట్టని వారి తాట తీస్తానని చాటింపు వేయిం చాడు. రాజ్యం ఉలిక్కి పడుతుందనీ, మూట లకొద్దీ బంగా రు నాణాలు ఖజానాకి జమ పడతాయని ఆశపడ్డాడు. ఒక్క నాణెం కూడా అదనంగా రాలేదు. ‘‘ఏమిది అమాత్యా! మాకు ఆశ్చర్యముగానున్నదే’’ అంటూ రాజు దుఃఖపడ్డాడు. రాజా! తమ ఏలుబడిలో పన్ను ఎగవేతదారులా! కల్ల కల్ల! అంటూ మంత్రి గారనే సరికి రాజుగారి బుగ్గలు ఎరుపెక్కాయి. జరిగిందేమంటే నల్లధనం మూటలన్నీ గుట్టుచప్పిడిగా పరిచారకుల ద్వారా రాణిగారి మందిరానికి చేరాయి.
రాజ మందిరాల్లో బోలెడన్ని పనికిరాని గదులు వృ«థాగా పడుం టాయి. ఇప్పటికీ రాజభవన్‌లో రాష్ట్రపతి భవన్‌లో మనం చూస్తుంటాం. అవి దర్పానికేగాని వాడకానికి కాదు. నల్లడబ్బు మూటలతో అంతఃపురంలోని గదులు నిండిపోయాయి. దండ నాయకులు, దళపరులు గుర్రాల మీద వెళ్లి అనుమానితుల ఇళ్లపై దాడి చేశారు కూడా. సొమ్ము మూటలు తీసుకురావడానికి ఒంటెల్ని కూడా తీసుకు వెళ్లారు. ఎక్కడా నల్లధనం కనిపించలేదు. రాజాధికారులు అంతఃపురం మినహా అంతా కుళ్ల పొడిచారు. అయితే, నే విన్నదేమంటే తర్వాత తెలివైన రాజు పనికి రాని గదులకు తాళాలు వేశాడనీ, మొత్తం దొంగ సొత్తుని సొంత గూటికి రప్పించుకున్నాడని కథనం.
మొత్తానికి అంతా గందరగోళంగా ఉంది. రోజుకో నిబంధన రెండు సడలింపులతో కథ నడుస్తోంది. కరెన్సీ నోటంటే మూడు సింహాల సాక్షిగా ప్రభుత్వం వారి ప్రామిశరీ నోటు. అది చెల్లదనడానికి వీల్లేదు. సామాన్యులు, పేదవారు చాలా నలిగి పోతున్నారు. భవిష్యత్తులో వారికేమి తవ్వి తలకెత్తుతారో అనుమానమే. విచిత్రంగా ఈ నేపథ్యంలో బ్యాంకుల మీద విశ్వాసం పోయింది. ప్రజలకి సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. మోడీ గొప్ప సాహసం చేశారనీ ప్రచారం సాగుతోంది. ఆయనని తెలియకుండానే ఒక డిక్టేటర్‌ని చేసి పడేశారు. అంతే, ఇదో రకం ఎమర్జన్సీ.
పాతనోట్ల గడువు దగ్గర పడింది. ఒక వదాన్యుడు చెప్పాడు, ఇంకో రెండు రోజులు దార్లు వెదుకుతా. దారి దొరక్కపోతే తెలుగులో కవి గాయక నట విశారదులను పాతనోట్లతో సత్కరించుకుంటానని ఉదారంగా సెలవిచ్చాడు. గొప్పవిషయం!
(వ్యాసకర్త : శ్రీరమణ ప్రముఖ కథకుడు)