♦ అక్షర తూణీరం
దేవుడి చేతిలో మనందరం తోలు బొమ్మలమే. కానీ నాయకులు మనల్ని శాసించి, ఆడిస్తారు. అప్పుడప్పుడు తల కాయలు మారుస్తారు కూడా.
సంక్రాంతి అంటే కొత్త ధాన్యం వచ్చే తరుణం. ఆ వడ్లని మసిలే నీళ్లలో నానపోసి, తర్వాత వాటిని ఆరపోస్తారు. మంచి పొయ్యి సెగమీద మంగలంలో వాటిని వేపుతూ, వేడిమీదనే రోకళ్లతో దంచుతారు. అప్పుడు అటుకులుగా సాగుతాయి. అన్ని పనులూ సరైన పదునులో జరిగి, అనుభవం తోడైతే అటు కులు చింతాకుల్లా సాగి ఫలిస్తాయి. అటుకులు పేదవాడి ఫల హారం. ద్వాపరంలో కుచేలుడు వీటికి ఎక్కడలేని ప్రాచుర్యం తీసుకొచ్చాడు. దేవుళ్లకి అటుకులు ఇష్టప్రసాదాలైనాయి. ఈ గ్రామీణ గృహ పరిశ్రమలో రాజకీయం ఉంది. ఉడుకుదుడుకుగా విషయాన్ని నాన పెట్టడం, సెగమీద వేపడం, వేడిమీదే ధనధనా దంచి సాగతియ్యడం– మనం గమని స్తూనే ఉన్నాం.
అరిశెల తయారీ కూడా ప్రజా సేవకులకు దారి చూపిస్తుంది. వాగ్దానాలు వారికి కొట్టినపిండి. కొత్త బెల్లంతో తియ్యటి తీగెపాకం పట్టడం, అందులో కొట్టిన పిండి పోస్తూ తిప్పడం, అవసరమైతే కుమ్మడం ద్వారా అరిశెల పిండి సిద్ధం అవుతుంది. దాన్ని అప్పచ్చులుగా చేసి కాగే నూనెలో వండుతారు. వాటిని పైకి తీసి అరిశె చెక్కలతో తాగిన నూనెని కక్కిస్తారు. పైపైన నువ్వులద్దుతారు. ఇహ వాటి రుచి సంక్రాంతి సంబరాల్ని మెరిపిస్తుంది. ఈ తయారీలో దంచడం, కుమ్మడం, నొక్కడం, కక్కించడం, పైపైన అద్దడం లాంటి ప్రక్రియలున్నాయ్. గమనార్హం. ఇప్పటి వారికి పేరు తెలుసుగానీ ‘తేగలు’ ఎక్కడ ఎలా పండుతాయో, ఏ ఫ్యాక్టరీలో తయారవుతాయో తెలియదు.
తేగ అంటే తాడిచెట్టు మొలక. తాటిపండు లోంచి వచ్చే టెంకలు మొలకెత్తి తేగల వుతాయి. ఇది కూడా మంచి ఆహారం. ‘‘ఇదిగో నే ఢిల్లీ వెళ్తున్నా. ప్రధానమంత్రిని కలు స్తున్నా. రాష్ట్రానికి అందాల్సిన సాయాలన్నింటినీ తేగ లను... తేగలను’’ అంటూ చంద్ర బాబు నొక్కి వక్కాణిస్తున్నారు. తేగల సమర్థుడే!
ఆవుపేడ కిలో రెండొందల యాభైకి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది మోదీ కీర్తిని పెంచే అంశం ఏ మాత్రం కాదు. పేడ విషయంలో కమల నాథులు మనసు పెట్టాలి. ఒక సవాలుగా స్వీకరించాలి. కొడి గట్టిన స్వచ్ఛభారత్ నినాదాన్ని భోగిమంటల్లో తిరిగి వెలిగిం చాలి. ఈ పండుగ సీజన్‌లో ఊరి బయటి చింతలతోపులో బొమ్మ లాళ్లు వచ్చి దిగేవారు. ఏడెని మిది గూడుబళ్లు, వాటి నిండా తోలు బొమ్మలు, చిన్నా పెద్దా, పిల్లా జెల్లా, కోడీ మేకా, సరుకూ సరంజామా సర్వం దిగిపోయి చింతలతోపు తిరునాళ్లను తలపించేది. వాళ్లు బళ్లలోంచి బొమ్మలన్నింటినీ దింపి వాటిని సరిచేసుకోవడం, కొత్త నగిషీలు పూయడం చేసేవారు. కొందరు వూరిమీదపడి తెరలకు వస్త్రాలు, ఆటదీపానికి చమురు పోగేసేవారు. పొడుగాటి తుమ్మముళ్లు ఆట ఆడించడానికి మరికొందరు సేకరిస్తుండే వారు. వూడిపోయిన తలకాయల్ని, వూగే కాళ్లని చేతుల్ని ప్రతి మజిలీలోనూ జాగ్రత్తగా సరిచూసుకోవాలి. బొమ్మలాటలో వినోదం పంచే బంగారక్క, కేతిగాడు అతి ముఖ్యంగా. వాళ్లిద్దరూ నోటికి ఎంత మాటొస్తే అంతమాటంటారు. చెయ్యి విదల్చని వారిని ఆ పాత్రలతో తిట్టించేవారు. జట్టుపోలిగాడు మరో ప్రధాన పాత్ర.
దేవుడి చేతిలో మనందరం తోలు బొమ్మలమే. కానీ నాయకులు మనల్ని శాసించి, ఆడిస్తారు. అప్పుడప్పుడు తల కాయలు మారుస్తారు. బంగారక్క కేతిగాడులా ఒక్కోసారి పాలకుల్ని నోటారా తిట్టాలని పిస్తుంది.
ఫిరంగి గొట్టం
నీటిధారలు చిమ్ముతోంది
పంటచేలు పచ్చపచ్చని
సిరులు సింగారించుకుంటున్నాయి
ఉదయపు సూర్యకాంతిలో
కమలం కళకళలాడుతోంది
పంటసిరుల సంక్రాంతి శుభవేళ
మన భారతావనిని శాంతి సౌభాగ్యాలు
వరించుగాక!
( ప్రధానికి రచయిత సంక్రాంతి శుభాకాంక్షలు )
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment