పోలవరం, క్యాపిటల్, ప్యాకేజీ యవ్వారం, ఇతరములు అన్నీ వేసిన చోటే ఉన్నాయన్నది నిజం. భేటీలో ఇద్దరికీ శృతి కలవలేదన్నది నిజం. పారదర్శకత లేకపోతే ఇంతే.
‘‘పారదర్శకత’’– అది కదా మన నినాదం. పారదర్శ కత అంటే స్పష్టంగా కనిపించడం, స్పష్టంగా వినిపిం చడం. ఇంకా చెప్పిందే చేస్తూ ఉండటం, చేసిందే చెప్తూ ఉండటం. ఆ మధ్య ఇవాంక భాగ్యనగరానికి వచ్చిన ప్పుడు అంతా క్లియర్‌గా ఉంది. ఆఖరికి మోదీ ఇచ్చిన విందులో వడ్డించిన వెయ్యిన్నొక్క చిత్రాలున్నాయి, భోజ్యాలు, భక్ష్యాలు, చోష్యాలు, లేహ్యాలు చక్కగా జనప్రజకు కళ్లకు కట్టించారు. మొన్న మనక్కావలసిన ఓ విదేశీ ప్రముఖుడు వచ్చినప్పుడు, మోదీ రాచరికం పక్కనపెట్టి రాజమర్యాదలు చేశారు. ఆలింగనంతో ఆహ్వానం పలికి దేశమంతా తిప్పి చూపించారు. కనులారా చూసి మురిసిపోయాం. మొన్న కనుమ పండుగ రోజు సుప్రీం తెలుగు న్యాయ మూర్తి సహపాటిలందరికీ అద్భుతమైన విందు ఇచ్చారు. నేటివిటీని ట్రాన్స్‌పరె న్సీతో రంగరించారు. సొంతూరు నుంచి జున్నుపాలు, నేతి అరిశెలు విమానంలో తెప్పించారు. అందరూ ఇష్టంగా తిన్నారని సమాచారం.
ఇవన్నీ ఇంత పారదర్శకంగా ఉండగా– మొన్నామధ్య మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రిని మన కాపిటల్‌లో భేటీ అయినపుడు ఏ మాత్రం సడీ చప్పుడూ లేదు. ఒక్క సంగతి బయటకు రాలేదు. అసలు ప్రధానితో సమాగమ సమయం దొరకడమే విశేషమన్నట్టు పత్రికల్లో ముందస్తు వార్తలొచ్చాయ్. అత్యంత ఆత్మీయమైన మిత్ర పక్షం నేతతో ప్రధాని అమావాస్యకి పున్నమికి కలుసుకోవచ్చు. హాయిగా మనసు విప్పి ఇష్టా గోష్ఠి, కష్టా గోష్ఠి సాగించవచ్చు. ఎక్కడో కొంచెం సత్సంబం ధాలు బీటవారినట్టు నిత్య సందేహులకు సందే హంగా ఉంది. రాక రాక వచ్చావు రెండ్రోజులు నా నివాసంలో ఉండాల్సిందేనని ప్రధాని బల వంతం చేసినట్టు లేదు. అంతా కలిసి నలభై నిమిషాల్లో ‘భేటీ’ ముగించేశారు.
ఇందులో శాలువా కప్పడం, పూలగుచ్ఛ ప్రదానం, గొంతులు సరిచేసుకోవడం, తొలి పలుకులు అయ్యేసరికి పది నిమిషాలు గోవిందా. ఇక మిగిలిన ముప్ఫై నిమిషాల్లో రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, సాంఘిక, విద్య, జల, పారిశుధ్యాది సమస్యల మీద రెండేళ్లుగా పేరుకుపోయిన సంగతుల్ని చంద్రబాబు టెలిగ్రాం భాషలో చెప్పినా వ్యవధి చాలదు. అసలు విషయాలు బయటకు రాకుండా సుహృద్భావ వాతావరణంలో భేటీ జరిగిందనీ, ప్రధాని సానుకూలంగా స్పందించారనీ తెలుగు తమ్ముళ్లు చెప్పుకున్నారు. అసలు సానుకూల స్పందనకీ, సుహృద్భావ వాతావరణానికీ అధికారిక అర్థాలు, నిర్వచనాలు తేల్చి చెప్పాలని ప్రజల పక్షాన కోరుతున్నా. బయటకు వచ్చాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆచితూచి (దీనిక్కూడా అఫీషియల్ మీనింగ్ కావాలి) మాట్లాడారు. ప్యాకేజీ వ్యవహారంలో అవసరమైతే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
అక్కడ తేలిపోయింది కథ. గుట్టు విప్పకపోయేసరికి రకరకాల కబుర్లు నమ్మకంగా వినవస్తున్నాయి. నేతలిద్దరూ అనేక విషయాలమీద మాటలతో షటిల్ ఆడుకున్నారని కొందరు, ఎన్నికల పొత్తు విషయంలో ఇద్దరూ తలలు పట్టు కుని మౌనంగా చర్చించారని ఇంకొందరు చూసినట్టే చెబుతున్నారు. ఇచ్చిన సొమ్ముకి లెక్కలు సరిచూడమన్నారనీ, అజ్ఞాతవాసిని తనకు వదిలేస్తే తను హ్యాండిల్ చేసు కుంటానన్నారనీ కొన్ని కథనాలు వినవస్తున్నాయ్. పోలవరం, క్యాపిటల్, ప్యాకేజీ యవ్వారం, ఇతరములు అన్నీ వేసిన చోటే ఉన్నాయన్నది నిజం. భేటీలో ఇద్దరికీ శృతి కలవలేదన్నది నిజం. త్రిబుల్ తలాక్ బిల్లుపై, టీడీపీ శీతకన్ను వేయడంతో, మోదీ రామబాణం సంధించారనీ అంటున్నారు. పారదర్శకత లేకపోతే ఇలాగే ఉంటుంది.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment