మనది సేద్యం పుట్టిన నేల | Sri Ramana Writer Special Story On Organic Farming | Sakshi
Sakshi News home page

మనది సేద్యం పుట్టిన నేల

Published Sat, Sep 7 2019 2:25 AM | Last Updated on Sat, Sep 7 2019 2:25 AM

Sri Ramana Writer Special Story On Organic Farming - Sakshi

అయిదువేల సంవత్స రాలకు పూర్వమే భారతదేశ నేలమీద వ్యవసా యం ఉందని శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. వ్యవసాయపు జీవధాతు మూలాల్ని వెలికితీశారు. అంటే సుమారు రెండువేల అయిదు వందల తరాలుగా వ్యవసాయాన్ని భారతీయులు చేస్తున్నారని అర్థం. మన వేద భూమి అనాదిగా సేద్యమెరిగిన నేల. అందుకు మనం గర్వపడాలా, విచారించాలా అనేదిప్పుడు అనుమానంలో పడ్డది. అనాదిగా మానవుడు అడవులమీద ఆధారపడి దొరికిన వాటితో పొట్ట నింపుకునే దశ నించి స్వయంగా ఆహార దినుసుల్ని ఉత్పత్తి చేసుకునే వైపు అడుగులు వేశాడు.

తన శక్తికి పదింతలు సాధు జంతువుల్ని మాలిమి చేసుకోవడం ద్వారా సాధించాడు. బరువు పనుల్ని ఉపాయాలతో సులువు చేసుకున్నాడు. అడవుల్ని స్వాధీనం చేసుకుని నేలని పంటభూమి చేశాడు. క్రమేపీ నాగళ్లతో నేలని పదును చేశాడు. అత్యంత ప్రాచీన దశలో మానవుడు పెంచి పోషించిన పంట నువ్వులు. అందుకే నువ్వులు పెద్దలకు తర్పణలు వదలడానికి ఉత్తమమైనదిగా ఇప్పటికీ అమల్లో ఉంది. కాయగూరల్లో గింజ చిక్కుడు అనాదిగా ఉంది. కనుకనే సూర్యుడికి రథాలు కట్టేటప్పుడు మనం చిక్కుడు గింజలతో కడతాం. సూర్య భగవానుడికి చిక్కుడాకుల్లో నైవేద్యాలు సమర్పిస్తాం. 

మొదట్నించీ ఏ క్రతువు వచ్చినా, కార్యం వచ్చినా నవధాన్యాలను తప్పనిసరిగా వినియోగించడం ఆచారంగా మారింది. శక్తికి మూలమైన గోమాతని పూజించడం మన సదాచారం అయింది. నిజానికి భూమితోపాటే సమస్త వృక్ష జాతులు, సస్య సంపదలు నేలమీద ఉన్నాయి. ఎటొచ్చీ వాటిని గుర్తించి, తన సొంత నార్లు పోసు కున్నాడు. నీళ్లని అదుపులో పెట్టుకోవడంలో ఆరితేరాడు. కార్తెల్ని, రుతువుల్ని గుర్తించి వ్యవసాయ పనులకి కొలమానాన్ని తయారు చేసుకున్నాడు. వర్షాలు ఎందుకొస్తాయో, వాగులు, వంకలు ఎగువనించి ఎట్లా వస్తున్నాయో మనిషి అంతు పట్టించుకున్నాడు. తరాలు గడిచినకొద్దీ వృక్ష శాస్త్రాన్నీ, పశు విజ్ఞానాన్నీ స్వానుభవంతో నేర్చాడు. 

రామాయణ కాలం నాటికే నాగలి వ్యవ సాయం ఉంది. ఏరువాక పౌర్ణిమనాడు భూమి పూజ చేసి నాగళ్లు పూని బీడు గడ్డల్ని పదును చేయడం ఉంది. అలాంటి సందర్భంలోనే నాగేటి చాలులో సీతమ్మ ఉద్భవించిందని ఐతిహ్యం. ద్వాపర యుగంలో బలరాముడికి నాగలి ఆయుధంగా నిలిచింది. అంటే వ్యవసాయపు ప్రాధాన్యత తెలుస్తూనే ఉంది. పశు సంపద ప్రాముఖ్యత పెరిగింది. పశుపోషణ వ్యవసాయంతో సమానంగా వృద్ధి చెందింది. ఈ రెండూ ఆదాయ వనరులుగా విస్తరించాయి. అంతకుముందే చెరుకు వింటి వేలుపుగా మన్మథుణ్ణి ప్రస్తావించారు. అంటే చెరుకు గడలు మన నాగరికతలో చేరినట్టే! వ్యవసాయం, దాని తాలూకు ఉపవృత్తుల చుట్టూనే నాటి నాగరికత పెంపొందింది. ఆనాడు ‘చక్రం’ వాడుకలోకి రావడం నాగరికతలో గొప్ప ముందడుగు. మానవుడు స్వయం ఉత్పత్తి సాధించగానే, ఆ సంపదని కాపాడుకోవడం ముఖ్య తాపత్రయమయింది. దాని కోసం అనేక ఉపాయాలు ఆలోచించాల్సి వచ్చింది. 

తరాలు తిరుగుతున్నకొద్దీ మనిషిలో స్వార్థ ప్రవృత్తి పెచ్చు పెరిగింది. ఆశకి అంతులేకుండా పోయింది. నేల తల్లి మంచీ చెడులను గుర్తించే వారు లేరు. దిగుబడులు అత్యధికంగా రావాలి. దానికోసం ఏవంటే అవి నేలలో గుప్పించడం మొదలు పెట్టారు. ఎన్నోరకాల రసాయనాలు వినియోగిస్తున్నారు. నేల తన సహజ నైజాన్ని కోల్పోతోంది. భూగోళపు సహజ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అడవులు బోసిపోయి రుతుధర్మాలు చెదిరిపోయాయి. వాటి బాపతు పర్యవసానాల్ని ఈ తరంవారు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పరిస్థితిని చక్కబెట్టుకోవాలి. లేదంటే ఇంకొన్ని తరాల తర్వాత ‘వర్షం’ కనిపించకపోవచ్చు. భావితరాలకు మనమిచ్చే గొప్ప సంపద మంచి పర్యావరణం. ప్రాచీన విలువల్ని కాపాడదాం. మన వేద భూమిని వ్యవసాయ భూమిగా నిలిపి ఆకుపచ్చని శాలువాతో గౌరవిద్దాం!


వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement