హిరణ్యాక్షులు
అక్షర తూణీరం
మీ సేద్యపు భూమిని, కాలికింది మట్టిని, మీ బతుకు ఆధరువును మాకివ్వండి. మీరంతా గాలిలో నిలబడండి అన్నదే పాలకుల మాట.
‘‘త్వరపడండి! ఇప్పటికే తయారీ నిలిచిపోయింది. ఆలశించిన ఆశా భంగం!!’’ అంటూ చాలా కాలం క్రితం ఒక అమెరికన్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటనలిచ్చి అందర్నీ ఆకర్షించింది. కొందర్ని ఆలోచింపజేసింది. ఇక ఎవరేం చేసినా భూగోళం విస్తరించదు కదా. భూమిపై మూడొంతులు నీరు, ఒక వంతు నేల. అప్పుడప్పుడు సముద్రం సమయం దొరికితే శత్రు వల్లే నేలను కబళిస్తూ చొచ్చుకు వస్తూ ఉంటుంది. ఉన్న కాస్త నేలలో కొండలు, గుట్టలు, అడవులు, వాగులు, వంకలు కొంత ఆక్రమించాయి. మిగిలిన పీస భాగంలోనే మనమంతా ఉండాలి. ఇందులోనే ఇల్లూవాకిలి, గొడ్లుగోదా, బడీగుడీ నిలబడాలి. నిన్న మొన్నటిదాకా మన భారతీయులం నలభైకోట్లు. ఇప్పుడు మూడు రెట్లకు ఎదిగాం. మన దేశ జనాభా రెండొందల కోట్లు అవడానికి మరీ ఎక్కువ వ్యవధి అవసరం లేదు. ఇప్పటికే ధరధరలు కొండలెక్కగా, జనావాసాలు పైకి ఎదగడం ప్రారంభించాయి. గూడు çఫర్వాలేదు గానీ కూడు నేల లేకుండా ఎలా?
మరీ ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల భూముల్ని ‘ఎర’వేసి కబళించడం ఎక్కువైంది. మహా నగరాల కోసం, మెగా నిర్మాణాల కోసం ఓడరేవులకని, విమానాశ్రయా లకనీ, బుల్లెట్ రైళ్లు నడుపుతామనీ, కాలువలనీ, రోడ్లనీ, వంతెన లనీ, వారధులనీ కారణం ఉండీ లేకా పంట భూముల్ని బీళ్లు చేస్తున్నారు. రైతులు మొదట ఆందోళన చేసినా, తర్వాత రకరకాల ‘ఎర’లకు లొంగిపోతున్నారు. ఒకసారి భూమి చేజారిపోతే, తిరిగి ఎన్నటికీ రాదు.
కృతయుగంలో, గొప్ప భూదానానికి ఒడిగట్టి అధఃపాతా ళానికి వెళ్లిపోయాడు. బలి ద్వారా మనకో సందేశం అందింది. ద్వాపరంలో కురుక్షేత్రంలో భీష్మున్ని దహనం చేయడానికి స్వచ్ఛ మైన నేలే దొరకలేదు. ఎక్కడకు వెళ్లినా ‘‘శతమ్ భీష్మమ్’’ అనే మాట ప్రతిధ్వనించింది. మహాకవి కంకాళాలు లేని స్థలం భూత లమంతా వెదికిన దొరకదన్నాడు. కనుక ఈ నేలకి మనం కొత్త కాదు. మనకే ఈ గడ్డ కొత్త. నేలతల్లి నిత్య బాలింత. ఈ నేల చావు బతుకుల రేవు.
మోదీ సాబ్ హిందీలో సూటిగా ధాటిగా గర్జించినా, చంద్ర బాబు తెలుగులో తిరగేసి బోర్లేసి సుత్తి కొట్టినా, తీయటి తెలంగాణ యాసలో కేసీఆర్ ముచ్చట పెట్టినా వాటి ఆంతర్యం ఒక్కటే: ‘‘మీ సేద్యపు భూమిని, కాలికింది మట్టిని, మీ బతుకు ఆధరువును మాకివ్వండి. మీరంతా గాలిలో నిలబడండి. మీ చేతులకు, కాళ్లకు బంగరు కడియాలు తొడుగుతాం’’ అంతే. భూమికి బదులు భూమిస్తామని పొరబాటున కూడా అనరు. ఈ సర్కారీ భూ ఆక్రమణకు అడ్డుకట్టవేసే ‘‘నేషనల్ పాలసీ’’ రావాలి. లేదంటే ఇంటర్నేషనల్ పాలసీ!
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ