
మార్చి బడ్జెట్ మార్చ్!
అక్షర తూణీరం
నెలకి ఇరవై వేలు వచ్చే వేతన జీవి ఉంటాడు. ఆ జీవికి నెల నెలా ఇంటద్దె, ఇతర బిల్లులు, పాలు, సరుకులు, పిల్లల ఫీజులు వగైరా అన్నీ పోను వెయ్యో అరవెయ్యో మిగుల్తుంది. నెలవారీ బిల్లులే గాక అనేక బిల్లులుంటాయి. తప్పనిసరి ప్రయాణాలు, పండుగలూ పబ్బాలు, చుట్టాలు పక్కాలు, బైకు రిపేర్లు తగుల్తాయి. వాటిని తట్టుకోవాలి. ఆ ఉద్యోగి అన్నీ పోను మిగిలిన నాలుగు డబ్బులే తనవిగా భావిస్తాడు.
రాష్ట్ర బడ్జెట్ లక్షా ముప్పై అయిదు కోట్లని ఘనంగా మొదలు పెట్టక్కరలేదు. జీతాలు నాతాలు, తరుగులు, ఆమాంబాపతులన్నీ పోను ప్రజోపయోగానికి ఎన్ని రూపాయలు ఖర్చు చేస్తామన్నదే పాయింటు. దాన్ని మూడుముక్కల్లో ఆర్థిక మంత్రి చెబితే చాలు. దానికి అన్ని పేజీల, అన్ని గంటల సుదీర్ఘ సుత్తి చాలా అనవసరం. ఏటేటా రూపాయి బరువు తగ్గి పోతుండటం వల్ల రాశి పెరిగిపోతుంటే, దాన్ని అభివృద్ధిగా సూచించబోవడం మోసం. ప్రతి మార్చిలోనూ బడ్జెట్ మార్చ్ ఒక పెద్ద ఫార్స్. ఈ విన్యాసంలో రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ముఖ్య తంతు. ప్రభుత్వం తలపెట్టిన పథకాలను, ఆశలను, ఆశయాలను, ఆకాంక్షలనూ కుండబద్దలు కొట్టినట్లు నిర్భయంగా గవర్నర్ ప్రసంగపాఠాన్ని వల్లిస్తారు. ఈ వ్యవహారంలోని కర్త కర్మ క్రియలలో ఆయనకు ప్రమేయం ఉండదు. పాపం పుణ్యం శ్లేషార్థాలు ఆయనకు తెలియవు.
ఒక రోజు ముందు ప్రసంగ పూర్తి పాఠాన్ని విడివిడిగా టైపు చేసి గవర్నర్ సారుకి స్వయంగా అధికారపక్షం అంది స్తుంది. పోర్షన్ ముందుగా అనుకున్న ఉత్తమ నటుడిలాగా ఆయన వాకింగ్‌కి ముందూ, సాయంత్రం స్నాక్ తర్వాత దాన్ని చదువుకుంటారు. ప్రాజెక్టుల పేర్లూ, విరామ చిహ్నాలు ఒకటికి రెండు సార్లు చూసుకుంటారు. కాన్ఫిడెన్స్‌ని, కాగితాలను చుట్టపెట్టుకుని సభ పోడి యం ముందుకు వస్తారు. ఉభయ సభ లను అడ్రస్ చేసి, ఆనక భావయుక్తంగా ప్రసంగం చదివే ప్రయత్నం చేస్తారు. కొన్ని వాక్యాలు వచ్చినపుడు అధికార సభ్యులు చప్పట్లతో, బల్ల చరుపులతో హర్షామోదాలు తెల్పుతూ ఉంటారు. అప్పుడప్పుడు అమాత్యుల ప్రతిధ్వనులు క్లోజప్‌లో కనిపిస్తాయి. ముఖ్యమంత్రి గంభీరముద్రతో గర్వాన్ని దిగమింగుతూ ఉంటారు. స్క్రిప్టుని రచించింది, నగిషీలు చెక్కిందీ వారే! అయినా ఏమీ ఎరగనట్టు అప్పుడే విని తెలుసుకుంటున్నట్టు హావభావాలను సభ్యులు ప్రదర్శిస్తారు. మొత్తం మీద ఈ నాటకాన్ని టీమ్ స్పిరిట్‌తో రక్తి కట్టిస్తారు. సభల ద్వారా రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేసిన గవర్నర్ గారికి అధికార లాంఛనాలతో రాజ్‌భవన్‌లో దిష్టి తీస్తారు!
మర్నాడు మరో అంతర్నాటకానికి తెర లేస్తుంది. గవర్నర్‌కి సభ్యులంతా ధన్యవాదాలు చెప్పడం. ఇదొక ప్రహసనం. విపక్షం ససేమిరా అంటుంది. ప్రసంగం ఓపిగ్గా విన్నందుకు మాకే థాంక్స్ చెప్పాలని పట్టుబడతారు. హిజ్ మాస్టర్ వాయిస్‌గా మాట్లాడిన గవర్నర్ ప్రసంగంలో పస లేదంటారు. సరిగ్గా ఇలాంటి చోద్యమే ఢిల్లీ పార్లమెంట్ హాల్లోనూ జరుగుతుంది. పాపం అకారణంగా దేశ ప్రథమపౌరులను ఏటా ఒకసారి న్యూనత పరచడం ఏమాత్రం భావ్యం కాదు. పెద్దలు ఆలోచించాలి. ధన్యవాదాలు వద్దు, దాష్టీకాలు వద్దు.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు, శ్రీరమణ)