హైదరాబాద్: శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు శనివారం చిన్నపాటి గందరగోళం నెలకొంది. తొలుత ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత మండలి ప్రత్యేకంగా సమావేశమై సభ్యునిగా ఉంటూ మరణించిన కాంగ్రెస్ నేత పాలడుగు వెంకటరావు మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎజెండాలో పొందుపరచి మండలి కార్యాలయం సభ్యులకు పంపిణీ చేసింది. గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్న నిబంధనను పలువురు సభ్యులు చైర్మన్ చక్రపాణి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా చైర్మన్ చాంబర్‌లో జరిగిన ఇష్టాగోష్టిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా సభ నిర్వహించకూడదన్న అభిప్రాయానికి రావడంతో సంతాప తీర్మానాన్ని సోమవారానికి వాయిదా వేశారు. మళ్లీ సమావేశమై సభ నిర్వహణపై చర్చిద్దామని చైర్మన్ చక్రపాణి వెల్లడించారు.