ద్వి శతమానం భవతి! | sri ramana write article on man life expectancy | Sakshi
Sakshi News home page

ద్వి శతమానం భవతి!

Published Sat, Jan 27 2018 12:55 AM | Last Updated on Sat, Jan 27 2018 12:55 AM

sri ramana write article on man life expectancy - Sakshi

అక్షర తూణీరం
మనిషి తాబేలులాగా పెంకులు కట్టిన మూపులతో వందల ఏళ్లు బతకచ్చు. కానీ మనిషి మనిషిలా హృదయవాదిగా జీవిస్తేనే సార్థకత.

మనిషి ఆయుర్దాయం 140 సంవత్సరాలకి పెంచగల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిండు సభలో హామీ ఇచ్చారు. తథాస్తు! మనిషికి ఎన్నేళ్లు బతి కినా తనివి తీరదు. ఐశ్వర్యవంతులే కాదు దరిద్రులు కూడా సెంచరీ కొట్టాలని కోరుకుంటారు. ఇప్పటివరకూ ‘శతమానం భవతి’ అన్నది సర్వామోదం పొందిన దీవె నగా నిలబడింది. ఇకపై ఇలా అంటే ‘ఆయుష్మాన్‌ భవ’ అనే అర్థం స్ఫురిస్తుంది. ఇప్పుడన్ని జీవిత కొలమానాల్ని సరితూచి మళ్లీ నిర్ధారించాల్సి ఉంది. ఈమధ్య కాలంలో యనభై దాటడం అవ లీలగా మారిన సందర్భంలోనే బోలెడు తేడాలు, సమస్యలు తలెత్తుతున్నాయ్‌. ఒకప్పుడు అరవై, నిండగానే, హమ్మయ్య ఒక చక్రం తిరిగిందని దేవుడికి కృత జ్ఞతలు చెప్పుకునేవారు. యాభై దాటిందగ్గర్నించి ‘పెద్దాయన’గా అరవై దాటాక ‘ముసలాయన’ అనీ సంబోధించేవారు. ఇప్పడవి అమర్యాదలయినాయ్‌. ఇప్పుడు ఈ కొత్త భరోసా నేపథ్యంలో మన రాజ్యాంగాన్ని తిరగరాసుకోవలసి ఉంటుంది. భారతీయ శిక్షాస్మృతిని సవరించాలి.

యావజ్జీవమంటేనే కనీసం యాభై ఏళ్లుగా నిర్ణయించాలి. జీవిత బీమా పరిమితిని నూటయాభైకి పెంచుకోవాలి. ఇప్పుడే ఉద్యోగ పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వాలు గింగిరాలు తిరుగుతున్నాయ్‌. ముప్ఫై మూడేళ్లు ఉద్యోగం చేసి ముప్ఫై నాలుగేళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న ఆయు రారోగ్యవంతులున్నా రు. అందుకే ఒక దశలో ‘గోల్డెన్‌ హాండ్‌ షేక్‌’ ఆశపెట్టింది ప్రభుత్వం. కానీ ఈ గడుసు పిండాలు బంగారు కరచాల నానికి ససేమిరా అన్నారు. ఇప్పుడైతే రిటైర్మెంట్‌ వయసు వందకి పెంచేసి, ఇహ దణ్ణం పెట్టెయ్యడం మంచిది. రాజకీయాల్లో కటాఫ్‌ రెండు ఆవృతాలకు అంటే నూట ఇరవైకి పెట్టుకో వచ్చు. 

ఎముకలు కలిగిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడేమనేవారో తెలియదు. ఇదే సత్యమై నిత్యమై కార్యరూపం ధరిస్తే మొట్ట మొదట బాగుపడేది కార్పొరేట్‌ ఆస్పత్రులు. ఎందరో వయస్సు మళ్లిన జాంబవం తులు, భీష్మాచార్యులు దొరుకుతారు. ఎన్నో కొత్త రోగాలు పుట్టుకొస్తాయ్‌. అందరూ వైద్యబీమాకి అలవాటుపడతారు. ఇక దున్నుకోవడమే పని. ఈ జీవితం క్షణికం, బుద్బుదప్రాయం, మూన్నాళ్ల ముచ్చటే చిలకా లాంటి తత్వాలకు కాలం చెల్లినట్టే. మనిషికి ఇంకా ఆశ పెరుగుతుంది. దోచుకోవడం, దాచుకోవడం తప్పనిసరి అవుతుంది. ఇకపై 140 ఏళ్ల సంసారికి ఆరో తరం వార సుణ్ణి చూసే అవకాశం వస్తుంది.

పొందు కుదురులోనే నాలుగొందల పిలకలు లేచే అవకాశం ఉంది. ఎందు కొచ్చిందోగానీ ‘పాపి చిరాయువు’ అని నానుడి ఉంది. అధిక కాలం బతికితే అనర్థాలేనని అనుభవజ్ఞులు అంటారు. నిజమే, జీవితంలో ఏది శాపమో, ఏది వరమో తెలిసీ తెలియని అయోమయంలో బతికేస్తూ ఉంటాం. శాస్త్ర విజ్ఞానం పెరిగింది. దేనివల్ల మనిషి ఆయుర్దాయం పెరుగుతుందో తెలుసుకుంటే చాలు. ఎన్ని వందల ఏళ్లయినా బతికించగలరు. మనిషి తాబేలులాగా పెంకులు కట్టిన మూపులతో వందల ఏళ్లు బతకచ్చు. కానీ మనిషి మనిషిలా హృదయవాదిగా జీవిస్తేనే సార్థకత.

- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement