
♦ అక్షర తూణీరం
గ్రామాలకు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని, ప్రతి పంచాయతీకి కంపోస్ట్ ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం తెప్పిస్తానని లోకేశ్ అన్నందుకే రేవంత్ పార్టీ వీడాడా?
ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉంటాడు. కొంచెం పొట్టిగా పొన్నకాయలా ఉంటాడు. సమస్యలొచ్చినా హాయిగా మీసాలతో నవ్వే రసికుడు. పార్టీ ఫిరాయిం పుతో ఇటీవల వార్తల్లోకెక్కిన రేవంత్ రెడ్డి మంచి మాట కారి. చమత్కారి. ఇలాంటి వారికి దీటైన శత్రువు ఉంటే తమ వాక్బాణాలకు పదును పెట్టుకుంటారు. తెలంగా ణలో తెదేపా ఎమ్మెల్యేగా హుషారైన పాత్రే పోషించినా, అది అడవిగాచిన వెన్నెలే. అందుకని కాంగ్రెస్‌లో చేరా డంటే పొరబాటు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఒక సారి రేవంత్ ఒక చక్కని సామ్యం చెప్పారు.
‘‘కేసీఆర్‌తో వ్యవహారం శివలింగం మీద తేలు మాదిరి. చెప్పుతో కొట్టలేం, చేత్తో తియ్యలేం’’ అంటూ చక్కని సామె తతో విశ్లేషించారు. మంచి రాజకీయ పరిజ్ఞానం, వయసుకు తగ్గిన కుర్రతనం రేవంత్‌కి అదనపు క్వాలిఫికేషన్లు. ఆ మధ్య వెలమ, కమ్మ రాజకీయ వర్గాలను సంధి సూత్రంతో కలిపి ‘వెల్‌కమ్’ గ్రూప్స్‌గా మాటకట్టాడు. రాజకీయాల్లో పార్టీ పదవులకంటే, మంచి మాటల పొందికకు జనాకర్షణ ఎక్కువ.
ఇలాంటి యువనేత పచ్చకండువా పక్కనపెట్టి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం మీద చాలా వాదనలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఇది వ్యూహాత్మకం, అమరావతి రిమోట్‌గా పనిచేసే డ్రోన్ అన్నాడొకాయన. రేవంత్ ఫిరాయింపుపై రకరకాల వ్యూహాగానాలు వినిపిస్తున్నాయ్. తెలంగా ణలో తెదేపా రోజు రోజుకీ శుష్కిస్తోంది. అటు చూస్తే కేసీఆర్ ఉన్న దానికి లేని దానికి నిప్పులు చెరిగే మనిషి. ఎంతవారినైనా దద్ద మ్మలు, సన్నాసులు అనడం ఆయనకు పరి పాటి. బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో అవశే షంగా ఉంది గానీ, విశేషంగా లేదు. ఇక తెరాసకి సభల్లో కనిపిస్తున్నది కాంగ్రెస్ తల కాయలే. ‘పునరేకీకరణ’ మంత్రాన్ని తిరిగి తెరమీదికి తెచ్చి, ఈ రేవంత్ డ్రోన్‌ని చేతిలో పెట్టారని కొందరి ఊహ.
ఎందుకంటే అధినేత దేశంలో లేని తరుణంలో ఈ బాంబు పేలింది. పైగా మంత్రివర్గ ప్రముఖులమీద విస్ప ష్టంగా ఆరోపణలు వినిపించాయి. అసలీ విస్ఫోటనా నికి పరిటాల వారింటి పెళ్లి నాంది పలికినట్టని పిస్తుంది. తెదేపా ప్రముఖులు కేసీఆర్‌కి భృత్యులై చరిస్తున్నారనీ, వేల కోట్ల కాంట్రాక్టులు, పరిటాల బ్రాండ్ బీర్ ఫ్యాక్టరీ నిజం కాదా అంటూ రేవంత్ గళమెత్తాడు. ఈ మాటలన్నీ ఇక్కడికంటే లండన్‌లో ఉన్న బాబుకి ఐదు గంటలు ముందే వినిపించాయి. అయినా రేవంత్‌ని ఉత్తుత్తినే కూడా కేకలు వేయ లేదు. బాబు ఉదాసీనత ఆయా నాయకులని గొప్ప అసహ నానికి గురి చేసినా, ఉలుకూ పలుకూ లేక ఊరుకున్నారు. అధినేత ఈ మొత్తం ఘట్టాన్ని ఆనందించాడు. కాగల కార్యం గంధర్వుడు తీర్చాడు.
ఈ మొత్తానికి స్క్రీన్ ప్లే, డైలాగులు, నేపథ్య సంగీతం సమస్తం కొత్త క్యాపిటల్‌లోనే తయా రైందిట. అందుకే పార్టీ వదిలి వెళ్లే వారికి పెట్టే శాపనార్థాలేవీ రేవంత్‌కి పెట్టలేదు. ఇంకా చిత్రం వారాలు గడిచినా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ ఏపీ స్పీకర్‌కి చేరకపోవడం. టెక్నాలజీ మాన్ చంద్రబాబు ఈ జాప్యాన్ని పట్టించు కోవాలి. ఓ పెద్దాయన ఇదేం కాదండీ, అసలు కారణం వినండని మొదలు పెట్టాడు. లోకేశ్ బాబు ఒకరోజు అయిదువేలు జనాభా దాటిన గ్రామాలకు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని, ప్రతి పంచాయతీకి కంపోస్ట్ ద్వారా ఏటా వెయ్యి కోట్ల ఆదాయం తెప్పిస్తానని ఉద్ఘాటించాడట. ఆ దెబ్బకి రేవంత్ అఘా తానికి గురై పార్టీ వీడాడని వివరించాడు. ఇది కూడా నావరకూ నాకు నమ్మ తగ్గట్టుగానే ఉంది.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment