‘జిల్లా’యిలే... జీడిపప్పులే!
ఒక చెరువుని నాలుగు చెరువులుగా విభజించి గట్లు వేస్తే దోసెడు నీళ్లు కూడా పెరగవు. జిల్లాలను ముక్కలు చేయడం కంటే చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి.
ఇరవై మూడు జిల్లాల రాష్ట్రం రెండుగా చీలింది. దీపంలా ఉన్న రాష్ట్రం ప్రమిదలా, వత్తిలా విడి పోయింది. జిల్లాల సంఖ్య క్షీణించడంతో పాలకులకు చిన్నతనంగా ఉండటం సహజం. ఆ చిన్నతనాన్ని దూరం చేసుకోడానికి వ్యూహ రచన చేసుకుని, పరిపాలనా సౌలభ్యం కోసం ఒక్కో జిల్లాని రెండు చేస్తున్నామన్నారు. అందుకు కత్తులు, కత్తెర్లు సిద్ధం చేసుకున్నారు. కొత్త జిల్లాలకు ఇష్టుల పేర్లు పెట్టుకుని మంచి పేరు తెచ్చుకోవచ్చు.
కేసీఆర్‌కి నిజాములన్నా, వారి పాలనన్నా పరమ ప్రీతి. ఆయన నిజాము రోజుల్ని స్వర్ణయుగంగా భావిస్తారు. ఆ పరంపరలోని కొందరి పేర్లు తప్పక జిల్లాలకు పెడతారు. పాల్కురికి సోమన, బమ్మెర పోతన తప్పదు. ఇంకా కొందరు ఉర్దూ కవి గాయకులను సంభావించుకుంటారు. ఇక ఉద్యమ నేతలకు, అమర వీరులకు పెద్దపీటలు వేస్తారు. పేర్లు మిగిలితే జిల్లాల్ని పెంచుకుంటాం. ఇంకా తగ్గితే మిషన్ కాకతీయలో పునర్జన్మకి నోచుకుంటున్న ముప్పై వేల చెరువులకు బారసాలలు చేస్తాం.
ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాలుగడుగులు ముందుంటారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి జిల్లాని అంట్లు తొక్కి మూడు చేస్తారు. దేశంలోనే జిల్లాల విషయంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలుపుతారు. అత్యధిక జిల్లాలున్న రాష్ట్రాలకు అగ్రనేతగా గిన్నిస్‌లో స్థానం పొందినా ఆశ్చర్యం లేదు. కొత్త జిల్లాల ఆలోచన మంచిదే. అనేకమంది కలెక్టర్లు, బోలెడు మంది యస్పీలు వారి వారి అధికారా లతో రంగప్రవేశం చేస్తారు. యంత్రాంగం, మంత్రాంగం తామరతూడులా విస్తరిస్తుంది. మంది మార్బలం, వందిమాగధులు, ఆశ్రీతులు, భజనపరులు, సామాజి కులు... పెద్ద బలగమే ఏర్పడుతుంది.
వికేంద్రీకరణ మంచిదే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో చాలా వ్యవస్థలు, దానికి తగిన అవస్థలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ, మండల వ్యవస్థ, మున్సి పాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ వ్యవస్థ ఉండగా- పైన పెత్తనం చేయడానికి ఎమ్మెల్లేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు రాజ్యసభ సభ్యులు వుండనే వుండిరి.
ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యానికి లోటేమి వచ్చిందో తెలియదు. ఇప్పుడు ప్రతి కొత్త జిల్లాకు కనీసం వెయ్యిమంది కొత్త జీతగాళ్లు అవసరపడతారు. వారి జీతాలు, నాతాలు, పెట్రోళ్లు, సెల్‌ఫోన్లు, పర్యటనలు అన్నీ కలిసి తడిసి మోపెడవుతుంది. ప్రజాధనాన్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి రాజ్యాంగంలోని ఏ అధికరణం అనుమతిచ్చిందో చెబితే బావుంటుంది.
ప్రజా సేవకుల సంఖ్యని పెంచుకుంటూ వెళ్లడం కన్నా, వారిలో సేవానిరతిని, ఉద్యోగ ధర్మాన్ని పెంచడం మంచిది. ఒక చెరువుని నాలుగు చెరువులుగా విభజించి గట్లు వేస్తే దోసెడు నీళ్లు కూడా పెరగవు. జిల్లాలని ముక్కలు చేయడం కంటే అత్యవ సరంగా చేయతగ్గవి అనేకం ఉన్నాయి. సర్కారు పాఠశాలల్లో అయ్యవార్లను నియమించవచ్చు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల్ని పెంచవచ్చు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలు నిర్భయంగా జీవించేలా చెయ్యచ్చు. ధర్మాసు పత్రులలో కాస్తంత నీడ, కొంచెం దయా దాక్షిణ్యాలతో వైద్యం అందేలా వ్యవస్థను మరమ్మత్తు చేయతగు. ఏలినవారికి ఏమాత్రం అవకాశమున్నా మార్కెట్ యార్డు లకి పై కప్పులు సమకూర్చవచ్చు.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)