మహాసంకల్పం | AP CM YS Jagan Good Governance Says Ramana | Sakshi
Sakshi News home page

మహాసంకల్పం

Published Sat, Oct 19 2019 4:57 AM | Last Updated on Sat, Oct 19 2019 4:57 AM

AP CM YS Jagan Good Governance Says Ramana - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్రని క్షేత్రంగా చేసుకుని త్రికరణశుద్ధిగా మహాసంకల్పం చేశారు. వాటిలో తొమ్మిది ముఖ్యాంశాలున్నాయ్‌. వాటినే నవరత్నాలన్నారు. జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి వాటిమీదే దృష్టి లగ్నం చేశారు. యువతలో ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగాన్ని ఒక్కసారిగా తగ్గించగలిగారు. దీనివల్ల గ్రామపాలన తిరిగి శ్వాసించడం మొదలుపెట్టింది. ఇంతకుముందు గ్రామాల్లో ఎక్కడా ప్రభుత్వం ఉన్న జాడలు కనిపించేవి కావు. రోడ్లు లేవు. వీధి దీపాలు లేవు. వర్షపు నీటి కాలువలు లేవు. ఇంకా ఏవీ లేవు. గ్రామ పంచాయతీలకు వచ్చే పన్నులు లేవు. పోయే ఖర్చులు లేవు. పాఠశాల భవనానికి వెల్ల వేయించాల్సిందెవరు? మరమ్మతులు చేయించాల్సిందెవరు? ఇలాంటి దుస్థితిలో ఉన్న గ్రామాలు ఒక్కసారి మేల్కొన్నాయి. చదువుకున్న యువత ఉద్యోగులై, బాధ్యతాయుతంగా ప్రజలకు అన్నిటా సహకరించడానికి వచ్చారు. వట్టిమాటలు కాక గట్టిమేల్‌ చేసేవారు. సమస్యల్ని ఆర్చేవారు. తీర్చేవారు. వారి స్థాయి దాటినవైతే పైవారికి నివేదించి పరిష్కరించే వెసులుబాటు ఉంది. ‘‘ఇహ నించి ప్రతి గ్రామ పంచాయతీకి ఏటా కోటి రూపాయల ఆదాయం వచ్చే ఐడియా నా దగ్గర ఉంది. వెర్మి కంపోస్ట్‌ని ప్రతి ఊళ్లో కుప్పలు తెప్పలుగా పోషిస్తాం. దాన్ని రైతులు కొంటారు. ఆ డబ్బుతో గ్రామాన్ని ఎక్కడికో తీసికెళ్తాం’’ అని ఉన్నట్టుండి చిన్నబాబు చెప్పేసరికి టీడీపీ శ్రోతలు తెగ చప్పట్లు కొట్టారు. తర్వాత వాళ్లంతా నివ్వెరపోయారు. వానపాములతో ఇంత ఆదాయమా అని ఆశ్చర్యపోయారు.

చంద్రబాబుకి ఏనాడూ గ్రామీణ ప్రాంతాలమీదగానీ, వ్యవసాయంమీదగానీ నమ్మకం లేదు. పండించటం కంటే, కొని దళారీతనం చేసి అమ్ముకోవడం లాభసాటి అని నమ్మకం. ఆయన చేసేది అదే. బ్రోకరేజ్‌లో పురుగుమందులతో పని లేదు. విత్తనాలు, యూరియా అక్కర్లేదు. చివరకు గాలివాన గండం ఉండదు. అందు కని ఈ విధంగా ముందుకు వెళ్లాలన్నది ఆయన లక్ష్యం. నిజమే, వ్యవసాయం కష్టతరమైంది. అట్లాగని దాన్ని వదిలిపెడితే ఏమి తిని బతుకుతాం? మన రైతులు చాలా అమాయకులు. నేను నేలదున్ని పండించకపోతే, పాపం ఈ జనం ఎలా బతుకుతారని ఆలోచిస్తారు. అందుకే వ్యవసాయ భూములు ఇంకా మిగిలాయ్‌. మన గ్రామాల్లో మౌలికమైన విద్య వైద్యం నెర్రలు బారేలా చేశారు. వలసలకు ఒక ముఖ్య కారణం ఇదే. ప్రతి గ్రామం ఒక వృద్ధాశ్రమంలా తయారైంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక కదలిక వచ్చింది. రైతుల్లో పునర్‌ జాగృతి. జగన్‌ సంస్కరణతో బెల్ట్‌షాపులు మూతపడ్డాయ్‌. పల్లెలు కొంచెం ప్రశాంతంగా నిద్రపోతున్నాయ్‌. సంస్కరణలని ఒక్కసారి తీసుకురావడం అంత తేలిక కాదు. మనం నేలమీద బాగా పాదులు తవ్వి, మంచి ఎరువులు వేసి మొక్కలు నాటి పెంచి పెద్ద చెయ్యాలని కృషి చేస్తాం. అయితే అవి ఎంతకీ ఎక్కిరావు. అదే గోడమీద పిట్టల రెట్టల్లోంచి మొక్కలొస్తాయ్‌. వాటిని వదిలించుకుందామంటే అవి వదలవ్‌. ఎంత నరికినా అవి మళ్లీ తలెత్తి లేస్తూనే ఉంటాయ్‌. దురలవాట్లు కూడా ఇలాంటివే.

‘ఆనోభద్రాక్రతయన్తు విశ్వతః’ అని ఉపనిషత్‌ వాక్యం ఉంది. గొప్ప ఆలోచనలు ఎటునుంచి వచ్చినా స్వీకరిద్దాం. ప్రతిదాన్నీ ఖండిస్తూ, వక్రభాష్యాలు చెబుతూ ఉండక్కర్లేదు. నిన్నెవరో ఒక మాజీ మంత్రి నోరు చేసుకుని ‘చైనా నుంచి బ్యాటరీ బస్సులు వస్తాయంట. ఇది మొత్తం అవినీతిమయం. ఇందులో చాలా మిగుల్తుంది’ అంటూ పరిపరివిధాలా వాపోయాడు. ఆయనకన్నీ తెలిసినట్టు, ఏదో తనకి పూర్వానుభవం ఉన్నట్టు చెప్పారు. మొన్న మహాబలిపురంలో చైనా అగ్రనేతతో మాట్లాడి అంతా తెలుసుకున్నట్టు చెప్పేశాడు. ఇలాంటి గురిగింజలు కొన్నాళ్లు మైకుల ముందు నోళ్లు పెట్టకూడదు. నిన్నగాక మొన్న ప్రజలు వీరికి భయంకరమైన తీర్పు ఇచ్చారు. ఒకతరంపాటు తెలుగుదేశం రాజకీయ సన్యాసం స్వీకరించాలని పరోక్షంగా సూచించారు. కనుక విజ్ఞతతో ప్రవర్తించాలని పరోక్షంగా సూచించారు. కనుక విజ్ఞతతో ప్రవర్తించాలి. రోజూ మనం కనిపించి, మనగొంతు వినిపించకపోతే మర్చిపోతారనే భయంతో ఉన్నారు. కొత్తవాళ్లకి జనం చక్కని అవకాశం ఇచ్చారు. పరిపాలించనివ్వండి. సీనియారిటీ ఉంటే నిర్మాణాత్మక సూచనలివ్వండి. మీ అంతిమ లక్ష్యం ప్రజా సేవే కదా. కనుక చెయ్యి చెయ్యి కలపండి. చంద్రబాబు పెద్ద మనసు చరిత్రకి ఎక్కుతుంది. ఈ రోజువారీ స్టేట్‌మెంట్స్‌వల్ల ఒక ఇసుక రేణువంత కూడా పెరగదు. అది మహాసంకల్పం.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement