ఇద్దరూ వాగ్దాన కర్ణులే!
కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లను, మంచినీళ్లని నమ్మారే కానీ ప్రభుత్వ బడులలో అయ్యవార్లను నియమిస్తామని గాని, దవాఖానాల్లో వైద్యమందేట్లు చూస్తామని గాని కోతలు కొయ్య లేదు. అదే 99 వైపు పరుగులు తీయించి పరువు నిలిపింది.
తొంభై తొమ్మిది ఒక తమాషా సంఖ్య. వంద సంఖ్య పూర్ణత్వాన్ని ధ్వనింపచేస్తుంది. 99లో ఒక రాజసం ఉంది. దీనికి ఒక్కటి కలిస్తే చాలు- వంద, వెయ్యి, పదివేలు, లక్ష అయిపోవడానికి. కొన్ని సార్లు ఈ తమాషా సంఖ్య భలే ఉపయోగపడుతుంది. వాహనంలో వంద లేదా అంతకు మించి ప్రయాణికులను ఎక్కించరాదు అనే నిబంధన ఉంటే, తొంభై తొమ్మిదితో సరిపెడతారు. మొత్తం సొమ్ము లక్ష రూపాయలైతే విధిగా చెక్కు ద్వారా చెల్లించాలని రూలు ఉంటుంది. అప్పుడు, ఐదు తొమ్ముదుల లక్కీ నెంబర్‌తో చెక్కు రాసి రూల్‌ని గౌరవిస్తారు. ఒకానొక సన్నివేశంలో సుయోధనుడు, ‘‘... నూర్గురు సహోదరులకు అగ్రజుండనై’’ అంటూ వాపోతాడు. నిజానికి రాజరాజుకి సహోదరులు తొంభైతొమ్మిది మందే! వత్సల సహోదరి. మరీ కచ్చితంగా పోకుండా రౌండ్‌ఫిగర్ చెప్పి బాధపడ్డాడు. ‘‘తొంభైతొమ్మిదిపాళ్లు అవుతుంది’’ అంటే అయిపోతుందనే అర్థం. కాకపోతే ఆ ఒక్కపాలు దేవుడిమీద భారం వేస్తారు.
వచ్చాడు, దిగాడు, సాధించాడన్నట్టుగా కేసీఆర్ కోటలో పాగా వేశారు. కోటమీద జండా ఎగరేశారు. అందరం ఇక్కడికి వలస వచ్చిన వాళ్లమే! ఏం భయపడొద్దు. మిమ్మల్ని కడుపులో పెట్టుకు చూసుకుంటానని ఆంధ్రోళ్లకి అభయం ఇచ్చారు. పరమ శివుణ్ని కడుపులో పెట్టుకున్న గజాసురుడు గుర్తుకు వచ్చాడు. ఎన్నికల్లో వాగ్దా నాలు అందరూ చేస్తారు. ఎవరో ఒక్కరివే పేలాల్లా పేల్తాయ్. ఓట్లుగా రాల్తాయ్. కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు పంట గడి చేరడానికి ఊతమి చ్చింది. మంచినీళ్లని నమ్మారు. అంతేగాని నగ రంలో వీధి కుక్కల బెడ దను తొలగిస్తామని కాని, ప్రభుత్వ బడులలో అయ్య వార్లను నియమిస్తామని గాని, దవాఖానాల్లో వైద్యం అందేట్లు చూస్తా మని గాని లేనిపోని కోతలు కొయ్యలేదు. అదే 99 వైపు పరుగులు తీయించి పరువు నిలిపింది.
తెలుగుదేశం తొలి అంకెతో సరిపెట్టుకుని భంగపడింది. దేశాన్ని పాలిస్తున్న కమలం గుప్పెడు కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సభలు, సమావేశాలు, అధిక ప్రసంగాలు, రోడ్‌షోలు చేసినా బూడిదలో పన్నీరుగా, అడవి గాచిన వెన్నెలగా మిగిలాయి. ముప్పవరపు ముప్పతిప్పలు పడ్డా- నొప్పులు రొప్పులు తప్ప చేర్పుకూర్పుల నేర్పుని జనం చప్పరించారు. చంద్రబాబు యువరాజుని రంగంలోకి దింపారు. ఇంకేముంది సొంత భజన కత్తులు ‘‘చినబాబు అరంగేట్రం! ప్రమోదంగా ప్రసంగం! వాక్కులు వడగళ్లు! పలుకులు పకోడీలు!’’ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. తీరా ఫలితాలు వచ్చాక’’ ఐరన్ లెగ్’’ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. బాబుకి అంత సీన్ లేదంటున్నారు.
తెలుగు సీఎంలిద్దరికీ వాగ్దాన కర్ణులుగా మంచిపేరుంది. రాజకీయాల్లో ఎవరు ఓటర్లని నమ్మించి బుట్టలో వేశారన్నదే ముఖ్యం. ఆవు మాట నమ్మి పులి దాన్ని వదిలేసిందని తెలిసిన ఓ ఎద్దు అలాగే నమ్మించబోయింది. పులి అడవి దద్దరిల్లేలా గాండ్రించి, నిన్ను వదల.. నేన్నీకు గాడిదలా కనిపిస్తున్నా కదూ.. దూడకి పాలిచ్చి వస్తానంటే నమ్మేంత దద్దమ్మలా ఉన్నానా...’ అంటూ పంజా విసిరింది. అందుకని ఎజెండా కథలు వినసొంపుగా ఉండాలి. ఆసక్తికరంగా చెప్పగలగాలి. అప్పుడు తొంభై తొమ్మిది పాళ్లు విజయం వరిస్తుంది. లేకపోతే ఒక్కటితో ఆగిపోతుంది.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
- శ్రీరమణ