బాబుకి జగన్ అంటే సింహస్వప్నం కాబట్టే వైఎస్సార్‌సీపీపై బురదజల్లే దీక్షలో ఉంటారు. దానికి బదులు మోదీ పాలనపై పూర్తి స్థాయిలో అస్త్రాలు సంధించడం మంచిది.
అంతా గందరగోళంగా ఉంది. అంతా అయోమయంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కాలుష్య యుగం నడుస్తోంది. నరేంద్ర మోదీ ఇరగదీస్తాడని అంతా ఆశపడ్డారు. తీరా వచ్చాక ఓటర్ల వెన్నెముకలు అరగదీస్తున్నాడని జన వాక్యం. భాజపా పదవీ కాలంలో సింహ భాగం అయిపోయింది. సామాన్యుడికి వొరిగిందేమీ లేదు. దేవతా వస్త్రాల నేత చందంగా ఉంది మోదీ సర్కార్ వైఖరి. పూర్వం మన ప్రధాని ఒకాయన దేశానికి జటిల సమస్య వచ్చినప్పుడల్లా ఢిల్లీ పెద్దాసుపత్రిలో చేరేవాడు. పెద్ద డాక్టర్లు వాళ్లు చుట్టూ చేరి, వారికి సెగ తగలకుండా కాపాడేవారు. జబ్బేమిటంటే– అది తెలుసుకొనే పనిలో ఉన్నామని డాక్టర్లు ముప్పొద్దులా బులెటిన్లు విడుదల చేసేవారు. మూడో రోజుకి దేశ సమస్య ఒక కొలిక్కి వచ్చేది. పరిష్కారానికి ఒక దారి కనిపించేది. ప్రధాని ఠక్కున దిండుని ఓ తన్ను తన్ని, బయటికొచ్చి, ‘నా దేశం.. నా ప్రజలు... నా ఊపిరి’ అంటూ తిరిగి వార్తల్లో పడేవాడు. ఇప్పుడీ ప్రధాని కూడా కొన్ని చెవిన పెట్టక, కొన్ని పెడచెవిని పెడుతూ కాలాన్ని తన్నుకుంటూ పబ్బం గడిపేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయంలో మోదీ చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారని ఆర్నెల్లనాడు మాట వరుసగా జనం మధ్యకు వచ్చిన మాట అతి వేగంగా ముదిరింది. విస్తరిం చింది. అసలేమీ మాట్లాడరేంటి. ఓ కొత్త రాష్ట్రం ఇక్కడ అఘోరిస్తోందని గమనించరేంటి. బీజేపీ పద్మవ్యూహంలో చంద్రబాబు బాగానే ఇరుక్కున్నారు. ప్రతికూల పవనాలను అనుకూలంగా మార్చుకోవడంలో దిట్టనని తరచూ చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు. మోదీ ఈ పరీ క్షని మిత్రునికి కావాలనే పెట్టారా? రేపు ధర్మదీక్షలతోనో, అధర్మదీక్షలతోనో తెలుగునేత వ్యూహాన్ని ఛేదించుకు బయటపడితే– చూశారా.. చూడండి... దటీజ్ బాబు. నా మిత్రుని శక్తియుక్తుల్ని దీక్షాదక్షతల్ని ఈ అగ్నిపరీక్ష ద్వారా నిగ్గుతేల్చాను. కనుక మీరు రానున్న ఎన్నికల్లో బాబుకే ఓట్లు వెయ్యండి. బాబు నెగ్గితే మేం నెగ్గినట్టే ఎందుకంటే ఈసారి కలిసే పోటీ చేస్తాం. నీళ్లని చీల్చుకుంటూ నావ వెళ్తుంది. నది రెండుగా చీలినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
మరో కొసనుంచి చీలికలు కలసిపోతూ తిరిగి మహానది ఏ మాత్రం చీలనట్టే కనిపిస్తుంది. కొందరేమంటారంటే ఎన్నికల ముందు కోరిన వరాలే గాక, కోరనివి కూడా ఇస్తారు. బీజేపీ ఉత్తుత్తి కబుర్లేగానీ, ఎన్నికల బరిలో కత్తులు దూసినట్టు కరెన్సీ దూస్తున్నారని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. చిన్న చిన్న రాష్ట్రాలలో కుర్చీ కోసం బీజేపీ పడ్డ తాపత్రయాలు నిన్న మొన్నటి వార్తలు.
ఒకప్పుడు ఉల్లిపాయలు దేశ రాజకీయాల్ని తారుమారు చేస్తుండేవి. ఇప్పుడు వట్టిపోయిన గోమాతల్లా వీధులపక్క నిలబడ్డ ఏటీయంలు కమలపాలనని బ్లాంక్ ఫేస్‌లతో వెక్కిరిస్తున్నాయ్. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉందని బ్యాంకు ఖాతాదారులు నిమిషానికోసారి వాపోతున్నారు.
బీజేపీ, సంఘ్ వారు సైతం మోదీ వైఖ రిని సమర్థించలేక పోతున్నారు. ఆయన అమిత్ షా కాదు, అమృత్ షా అంటూ కొనియాడిన వారు ఇప్పుడు నాలికలు తిప్పేసి, అంతా ఉత్తిదే అంటున్నారు. చంద్రబాబు విఠలాచార్య సినిమాలో రాకుమారుడిలా, రెండు చేతులతో రెండు కత్తులు ఝళిపిస్తూ– ఒక చేత ప్రధానిని, ఇంకో చేత జగన్‌ని నిలువరించడానికి ప్రయాసపడుతున్నారు. చంద్రబాబుకి జగన్ అంటే సింహస్వప్నం. అందుకని అకారణంగా, అసందర్భంగా, అదే పనిగా వైఎస్సార్‌సీపీ పై బురదజల్లే దీక్షలో ఉంటారు. బురదదీక్షకి కాసేపు స్వస్తిపలికి, అమరావతి తెలుగు సోదరులు మోదీ దుష్ట పాలన మీద పూర్తి స్థాయిలో అస్త్రాలు సంధించడం మంచిది. ఎదుటివారిపై ఒక వేలు చూపిస్తే, మూడవేళ్లు మనల్ని చూపిస్తాయన్న క్కురల్ సూక్తిని గుర్తు చేస్తూ తెలుగు తమ్ముళ్లని కార్యోన్ముఖుల్ని చేస్తున్నా.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment