
తల్లి గోదావరి సేద తీరింది!
అక్షర తూణీరం
కోట్లాది మంది పుష్కరస్నానాలు ఆచరించారు. తెలుగు ప్రభు త్వాల ప్రచారం ఫలించింది. కోట్లకు కోట్లుగా తీర్థస్నానానికి తరలివచ్చారు. పెద్దలను భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. ఇదం తా భక్తేనా? కాదన్నారు ఒక మేధావులు. మేధావి అంటే చాలు కదా అనుకోవచ్చు. కాని మేధావి నిత్య బహువచనం. ‘‘ప్రస్తు తం జనంలో ఒక అలజడి, అస్థిరత్వం ఆవరించి ఉన్నాయి. అం దుకని ప్రజలు ఏమాత్రం అవకాశం దొరికినా పక్కకి పారిపోవా లని చూస్తున్నారు. దాని పర్యవసానమే ఇది’’ అంటూ విశ్లేషిస్తు న్నారు. మరికొందరు, ‘‘ఏం లేదండీ! ఇదొక మాస్ హిస్టీరియా’’ అని కొట్టి పారేస్తున్నారు. ఏదైనా రెండువారాల పాటు జనాన్ని వేరే ప్రపంచంలో ఓలలాడించిన మాట వాస్తవం. మా నేత పిలుపుతో జనం తరలి వచ్చారంటున్నారు. మహానేత పిలుపుని అందుకుని మహాజనం మహోత్సవంగా తరలి వచ్చారని సంబరపడుతున్నారు. ఇది పరోక్షంగా తెలుగుదేశం సుభిక్ష పాలనని సమర్థించడమే, ఇది చంద్రబాబు విజయం అంటూ కొందరు కీర్తిస్తున్నారు.
నాటకం అయీ కాకుండానే తెరలూ, పూసల కోట్లూ, గదలూ, గెడ్డాలూ మీసాలూ, జుల పాల జుట్లూ మూటలు కట్టే సినట్టు - మీడియా పుష్క రాల సరంజామాని సర్దేసిం ది. పుష్కర పరిభాషని మార్చేసుకుని, సాధారణ జనజీవన స్రవంతిలోకి వచ్చేసింది. ఈ మహా తరు ణాన్ని మార్కెట్ చేసుకున్న వారంతా తమ తమ కలెక్ష న్లను లెక్క చూసు కుంటు న్నారు. రాబోయే కృష్ణా పుష్కరాలకు ఈ అనుభవాన్ని జోడిస్తూ కొత్త ఆలోచనలు చేస్తున్నా రు. ‘‘మూఢ నమ్మకాలను జనంపై రుద్ది నిజాల్ని మభ్యపెడుతున్నారు. ఇది పాలకుల దివాలాకోరుతనానికి సాక్ష్యం. ప్రభుత్వం మూడువేల కోట్లు వృథాచేసింది. కనీసం పది వేల కోట్ల ప్రజాధనం గోదావరి పాలైంది. ఈ డబ్బూ, ఈ పనిగంటలూ వెచ్చిస్తే ఒక ఉప యుక్తమైన జలాశయం పూర్తయ్యేది’’ అంటున్నారు గతితార్కికులు. ప్రతి సందర్భానికీ వారొక స్టేట్‌మెంట్ ఇస్తారు. ఒక ప్రతిపాదన చేస్తారు. ఎవ్వరూ వాళ్లని పట్టించుకోరు. అయినా వాళ్లు ఖాతరు చెయ్యరు. వారి సదాచారాన్ని వారు పాటిస్తూనే ఉంటారు.
గురుడు సింహరాశిలోకి వస్తున్నాడు. ఊరికే మనుషులతో మాటా మాటా పెరిగే అవకాశాలెక్కువ, జాగ్రత్త! అంటూ మన్మథ ఉగాది రోజున సిద్ధాంతిగారు హెచ్చరించారు. అందుకే నా జాగ్రత్తలో నేనుంటున్నాను. అయితే, రుషితుల్యులైన మన ప్రవచనకారులు నాలాగా మెలకువగా ఉన్నట్టు లేరు. మొన్న పన్నెండు రోజులూ పూనకాలు వచ్చినట్టు దుయ్యబట్టుకున్నారు. దూసి పోసుకున్నారు. మీడియా రేటింగులు పెంచారు. ఇప్పటికే ఇన్ని మతాలు, ఇన్ని శాఖలు, ముప్పదిమూడు కోట్ల దేవుళ్లతో సామాన్యులు సతమత మవుతున్నారు. అసలే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న మూఢమతులకు దారి చూపాల్సిన వారే పరస్పరం ‘‘మట్టి’’ జల్లు కుంటుంటే ఇక దిక్కెవరు?
పుష్కరాల ఆఖరిరోజు గోదావరి తీర దేవుళ్లంతా ఒకచోట చేరారు. ఈ పర్వంలో వారి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మహర్దశ పట్టిన దేవుళ్లను మిగతా వారు అభినందించారు. పుష్కరాలకు వలస వచ్చిన వెంకటేశ్వరస్వామి కూడా అక్కడకు వచ్చి చేరారు. ‘‘తీర్థప్రజ వచ్చి, గంటల తరబడి వేచి, మా దర్శనం చేసుకువెళుతుంటే ఓ గొప్ప అనుభూతి కలిగింది. శ్రీనివాసా! నీ వైభవం, నీ భోగం ఏ స్థాయిదో మాకు బోధ పడింది!’’ అంటూ సాటి దేవుళ్లు వేనోళ్ల పొగిడారు. దేనికైనా పెట్టిపుట్టి ఉండాలని అభిప్రా యపడ్డారు. ఇంతలో ముత్తైవులా గోదావరి మాత అక్కడకు వచ్చింది. అంతా సవిన యంగా నమస్కరించి స్వాగతం పలికారు. ‘‘అలసిపోయావా?’’ అని అడిగారు. ‘‘లేదు, నా బిడ్డల స్పర్శతో సేద తీరాను!’’ అన్నది మాత గోదావరి.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు).