
ఉక్కుపాదాలకో కర్మాగారం
ఒక విద్యాలయ ప్రాంగణంలో జరుగుతున్న అమానుషాలను అరికట్టలేని వారు అంతర్జా తీయ ఉగ్రవాదాన్ని నిరోధించగలరా అనిపిస్తుంది. ఏ దౌర్జన్యం జరిగినా ఉక్కుపాదంతో అణచివేస్తాం’’అంటూ ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం మన పాలకులకు ఆనవాయితీ అయింది.
కొత్త దుస్తులు, కొత్త పుస్తకాలు... కొత్త కొత్తగా క్యాంపస్‌లో అడుగుపెడతారు. ఎన్నో ఊహల్నీ, ఆశల్నీ వెంట తెచ్చు కుంటారు. వచ్చీరాని రెక్కల్ని చూసు కుంటూ మురిసిపోతుంటారు. విద్యార్థి జీవితంలో ఇదొక అద్భుతమైన దశ. ఆ బంగారు కలల్ని ధ్వంసం చేసి వినోదించే రాక్షస సంస్కృతి రోజురోజుకీ విస్తరి స్తోంది. ర్యాగింగ్ రాక్షసక్రీడను అరికట్టడం అంత కష్టమేమీ కాదు. సామదాన భేద దండో పాయాలను చిత్తశుద్ధితో ప్రయో గిస్తే అడ్డుకట్ట పడకుండా ఉండదు. దుర దృష్టమే మంటే మన పంటచేలల్లో కంచెలు, మంచెలే చేను మేసేస్తుంటాయి. అందుకని వేరే దిక్కుండదు.
కళాశాలలో అడుగు పెట్టడమంటే, మిసమిసలాడుతూ నూత్న యవ్వనంలో అడుగుపెట్టడం. మనసు ఆటగుర్రంలా ఉండే వయసు. సీనియర్స్ సరదాగా వారి ని ఆట పట్టించడం వరకూ ఫర్వాలేదు. జూనియర్స్ రకరకాల ప్రాంతాల నుంచి, ఎన్నో రకాల నేపథ్యాల నుంచి వచ్చి ఉంటారు. అప్పటికే క్యాంపస్‌కి పాత కాపులైన సీని యర్స్ తమ వినోదానికో, కాలక్షేపానికో కొత్త వారితో ఆడుకో వడం భరించతగినదే. దానివల్ల పరస్పర పరిచయాలూ, సాన్ని హిత్యాలూ పెరుగుతాయి. కానీ ఈ రాక్షసత్వమేమిటి? ఈ అమా నుష చర్యలేమిటి? పిల్లల ప్రాణాలు తీసే పైశాచిక వినోదమా? ఎవరిచ్చారు వీళ్లకీ హక్కు? ఇవన్నీ ఏళ్లుగా కురుస్తున్న ప్రశ్నలు. పరిష్కారం దొరకని శుష్క ఆవేశం.
ఒక విద్యాలయ ప్రాంగ ణంలో, నాలుగు గోడల మధ్యా జరుగుతున్న అమానుషాలను అరికట్టలేని వారు అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిరోధించగలరా అనిపిస్తుంది. నిరాశ కలుగుతుంది. ఏ దౌర్జన్యం జరిగినా ‘‘ఉక్కుపాదంతో అణచివేస్తాం’’అంటూ ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం మన పాలకులకు ఆనవాయితీ అయింది. ఉక్కుపాదాలు తయారుచెయ్యడానికి అచ్చంగా ఒక ఫ్యాక్టరీని నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏలినవారికి మనవి చేస్తున్నా. ‘‘కాబోయే విశ్వవిఖ్యాత మహానగరం, ఆంధ్రుల అలకాపురి, బౌద్ధ సంస్కృతి పరిఢవిల్లిన నేల, ఆచార్య నాగార్జునుడి పేర వెలసిన విశ్వవిద్యాలయమే ఈ తీరున అఘోరిస్తే, మిగిలిన వాటి దుర్గతిని ఊహించుకోండి!’’ అంటూ ఒక పెద్దాయన కంటతడి పెట్టాడు.
పల్లెటూళ్లో కొత్తగా కాపురానికి వచ్చిన కోడళ్లని పాత కోడళ్లు చాలా ఏడిపించేవారు. ఆ చనువుతో, స్నేహం తో ఆ ఇంటి పద్ధతుల్నీ, ఆ ఊరి సంప్ర దాయాల్నీ కొత్త కోడళ్లకి నేర్పేవారు. వాళ్లు రాటుతేలేలా అరగతీసేవారు. కర్మాగారాల్లో, ఇతర సంస్థల్లో అప్పుడే చేరిన కార్మికులను ఎప్పుడో చేరిన వారు చిన్న చిన్న అవస్థలు పెట్టేవారు.
అది సరసంగా శిక్షణ ఇవ్వడంలా ఉండేది. ఒక మంచి సంస్కృతి క్రమేపీ విష సంస్కృతిగా మారిపోయింది. మనం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి, ఈ విద్యా సంవత్సర ఆరంభ తరుణం లోని పత్రికలను తిరగేస్తే- ఇలాంటి వార్తలే కనిపిస్తాయి. బలవ న్మరణాలు, రాలిపోయిన పిందెలు వార్తల్లో ఉంటాయి. ఉక్కు పాదం ప్రతిజ్ఞే కనిపిస్తుంది. అదే వాక్యనిర్మాణం, అంతే ఘాటు గా. సీనియర్ విద్యార్థులారా! భావి భారత పౌరులారా! సహపాటీలను బతకనీయండి. వారి తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చకండి!
(శ్రీరమణ వ్యాసకర్త ప్రముఖ కథకుడు)