కారుణ్యమూర్తికి అక్షరాంజలి | July 8th YS Rajasekhara Reddy Birth Anniversary | Sakshi
Sakshi News home page

కారుణ్యమూర్తికి అక్షరాంజలి

Published Sat, Jul 6 2019 4:55 AM | Last Updated on Sat, Jul 6 2019 4:56 AM

July 8th YS Rajasekhara Reddy Birth Anniversary - Sakshi

జూలై 8న మనసున్న మారాజు, తెలుగుతల్లి ముద్దుబిడ్డ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుట్టినరోజు. ఆయన ఔదార్య కారుణ్యాలను ప్రతిబిం బించే కథలాంటి ఓ నిజం–అది గుంటూరు. ఆ యువతి పేరు శేషశ్రీ. కడు పేదరాలు. భర్తకి ఉద్యోగం లేదు. ఒక చిన్న ఆపరేషన్‌ సమయంలో డాక్టర్ల తప్పిదంవల్ల ఆమెకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఉన్నట్టుండి శేషశ్రీ మూత్రపిండాలు ముడుచుకు పోయాయి. గుంటూరు కన్యల ఆసుపత్రిలో వైద్యం నడుస్తోంది భరించరాని ఆర్థిక ఇబ్బందుల మధ్య. అప్పుడే పదిహేనేళ్ల పేషెంటు ఆమెకు తారసపడ్డాడు. ‘అక్కా! ముందు నా కథ విను..’ అంటూ మొదలుపెట్టాడు. ‘నాకు నా అనే వాళ్లెవరూ లేరు. వైఎస్‌ దేవుడు తాడికొండ వచ్చినప్పుడు ఊరివాళ్లు నా గురించి చెప్పారు. నా కిడ్నీ వ్యాధి గురించి, నా దిక్కులేనితనం గురించి విన్నవించారు. వెంటనే, అయితే వెళ్లి హైదరాబాద్‌ నిమ్స్‌లో చేరిపో. నేను ఏర్పాటు చేస్తానన్నారు. మేమెవరం ఆ దేవుడి మాటల్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పటిలాగే వీధులవెంట తిరుగుతున్నాను. ముఖ్యమంత్రి నేరుగా నిమ్స్‌కి ఫోన్‌ చేసి, ఫలానా కుర్రవాడు ఎందుకు చేరలేదో వాకబు చెయ్యండని ఆదేశించారు. నా కోసం గాలించారు. నన్ను పట్టు కొని తెచ్చి నిమ్స్‌లో చేర్పించారు. నాకు ఉచితంగా రాజవైద్యం జరిగింది. అక్కా! నువ్‌ బతికి బట్టకట్టాలంటే ఆయనొక్కడే దిక్కు’ అంటూ ఆ అనాథ పేషెంటు హితవు పలికాడు. అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హైదరాబాద్‌ లేక్‌వ్యూ అతిథి గృహంలో ప్రజల సొంత సమస్యల్ని ఆల కించడానికి పొద్దున పూట ప్రత్యేక సమయం కేటాయించేవారు.

శేషశ్రీ గంపెడాశతో వైఎస్సార్‌ దర్బార్‌కి హాజరైంది. వైఎస్‌ వస్తూనే కారు దిగుతూనే నిర్జీవంగా ఉన్న శేషశ్రీని గమనించారు. దగ్గరగా వచ్చి వెన్నుతట్టి ఆమెను లోపలికి తీసుకెళ్లారు. ఆమె వణికిపోతోంది. కనీసం కుర్చీలో కూడా కూర్చునే స్థితిలో లేదు. నేలమీద చతికిలపడింది. ముఖ్య మంత్రి కూడా నేలమీదే ఆమెకు దగ్గరగా కూర్చున్నారు. ఆపేక్షగా పరామర్శించారు. వృత్తిరీత్యా డాక్టర్‌ కాబట్టి సమస్యని అవలీలగా అర్థం చేసుకో గలిగారు. ఆమెకు ధైర్యం చెప్పారు. అక్కడే ఉన్న అధికారిని ఈ వ్యాధికి ఎక్కడైతే మంచి చికిత్స ఉంటుందని అడిగారు. అధికారి స్విమ్స్, తిరుపతి సార్‌ అని చెప్పడంతో, సీఎం తన లెటర్‌ప్యాడ్‌ తీసి స్వదస్తూరితో స్విమ్స్‌ డైరెక్టర్‌కి లేఖ రాశారు. ‘వెళ్లి తిరుపతిలో వైద్యం చేయించుకో. ఏ సమస్య ఉన్నా సరే ఎప్పటికప్పుడు నాకు చెబుతూ ఉండు. ఇదిగో ఇది నా పర్సనల్‌ టెలిఫోన్‌ నంబర్‌. నీ దగ్గర పెట్టుకో. ఈ నెంబరు ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు. తెలిసిందా’ అని గట్టిగా హెచ్చరించి మరీ పంపారు.

శేషశ్రీకి ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. ఆమె భర్తకి అర్హతకి తగిన ఉద్యోగం ఏర్పాటు చేశారు. స్విమ్స్‌లో అడ్మిట్‌ చేసుకున్నారు. ఎందుకంటే అది ముఖ్యమంత్రి ఆదేశం. కానీ ఆ సమస్యకి తగిన సాధన సామగ్రి స్విమ్స్‌లో లేదు. అత్యవసరంగా తెప్పించాలన్నా చాలా సమయం పడుతుంది. ఆ సంగతి పేషెంట్‌కి వివరంగా చెప్పారు. ఆమె ఫోన్‌ చేసి సంగతి వివరించింది. వైఎస్‌ అక్కడే ఉన్న అప్పటి అధికారిని కేకలు వేయడం శేషశ్రీకి వినిపించింది. తర్వాత హైదరాబాద్‌ నిమ్స్‌లో చేరడానికి మారాజు సకల ఏర్పాట్లు చేయించారు. నిమ్స్‌లో రూపాయి తీసుకోలేదు. ఆమెకు, కూడా ఉన్న వారికి కావల్సిన సదుపాయాలన్నీ నిమ్స్‌వారే చూసుకున్నారు. ‘ఏనాటి అనుబంధమో! కన్నవారైనా ఇంతటి దయాపేక్షలతో కాచుకుంటారా’ అని వారంతా మనసులో కోటిదణ్ణాలు పెట్టుకున్నారు.

ఒక్క శేషశ్రీతో తప్ప ఇంకెవరితోనూ వైఎస్‌ మాట్లాడింది లేదు. వారి పొగడ్తలు స్వీకరించింది లేదు. నిమ్స్‌లో ట్రీట్‌ మెంట్‌ ప్రారంభించి, మీ రేషన్‌కార్డ్‌ చూపించండని అడిగారు. వారికి ఏ రంగు కార్డూ లేదు. అర్జంటుగా కావాలి. వైఎస్‌ పర్సనల్‌ ఫోన్‌ మోగింది. గుంటూరు ఎమ్మార్వోకి మరుక్షణం ఫోన్‌ వెళ్లింది. గుంటూరు ఎమ్మార్వో ఆఫీసుకి వెళ్లగానే, క్షణాలమీద తెల్ల రేషన్‌కార్డ్‌ అధికారికంగా చేతుల్లో పెట్టారు. దేవుడు వరాలు ఇవ్వాలనుకుంటే దృశ్యాలు ఇట్లాగే ఉంటాయ్‌. వాళ్లు కొద్ది నెలల తర్వాత ఆరోగ్యం కొంచెం కుదుటపడ్డాక తిరిగి గుంటూరు వచ్చారు. మర్నాడు రచ్చబండ కార్య క్రమం.. వైఎస్‌ శేషశ్రీకి ఫోన్‌ చేశారు. ‘నీ మందులకి వాటికి నెలనెలా బ్యాంక్‌లో జమ అవుతున్న డబ్బు నాలుగు నెలలుగా డ్రా చెయ్యడం లేదు. ఇట్లా అయితే రూల్స్‌ ప్రకారం ఆ డబ్బు వెనక్కి వెళ్లిపోతుంది’ అని గుర్తు చేశారు. ఎంతటి ఆదరణ! ఎంతటి మానవత్వం! రచ్చబండ మర్నాడు ఏం జరి గిందో అందరికీ తెలుసు. అందరూ షాక్‌కి గురయ్యారు. శేషశ్రీ ఇంతటి దిక్కుని కోల్పోయాననే బెంగతో, వైద్య కారణాలతో ఎక్కువకాలం జీవించలేదు. శేషశ్రీ తల్లి ఆదిపూడి జానకి గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో చిన్న గుమాస్తాగిరి చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. వైఎస్‌ని వారంతా దేవుడిగా పరిగణిస్తారు. ఎవరడిగినా ఈ యథార్థ గాథని పూస గుచ్చినట్టు ఆమె చెబుతారు. ఆ కారుణ్యమూర్తికి అక్షరాంజలిగా సమర్పణ.

శ్రీరమణ 
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement