♦ అక్షర తూణీరం
ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా మహా నిర్మాణాల శిలాఫలకాల మీద రాజుల, నియంతల, ప్రధానుల పేర్లే ఉంటాయిగానీ రాళ్లెత్తిన కూలీల పేర్లుండవు.
ఉన్న సమస్యలు చాలవన్నట్టు లేనివి కొనితెచ్చుకోవడం మనకో విలక్షణమైన అలవాటు. ప్రసిద్ధ చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌ని యూపీ పర్యాటక శాఖ వెలి వేయడం, దాని నిర్మాతలు సన్మార్గులు కారనడంతో వివాదం చెలరేగింది. సెగ పైదాకా తగిలింది. తాజ్‌మహల్ లాంటి మహల్ ప్రపంచంలో మరెక్కడా లేని మాట నిజం. ప్రపంచ ప్రజల్ని తాజ్‌ని చూసినవారు, చూడనివారు అని రెండు వర్గాలుగా విభజించవచ్చని ప్రముఖులు తీర్మానించారు.
ఎవరేమన్నా భారతదేశానికి ఆ పాలరాతి మందిరం ఓ కొండగుర్తు. కాదు, అసలది తేజ్‌మహల్. శివాలయం కాగా దాన్ని మార్చి, పరిమార్చి తాజ్‌మహల్ చేశారని కోతిచేత నిప్పు తొక్కించారెవరో. ఇది చినికి చినికి గాలివాన అయ్యేట్టుందని యూపీ ముఖ్యమంత్రి రంగప్రవేశం చేసి, నిర్మాతలెవరైనా, రాళ్లెత్తిన కూలీలు చిందించిన స్వేదాన్ని, రక్తాన్ని గౌరవిస్తా, తాజ్‌మహల్‌ని గౌరవిస్తానని బహిరంగ ప్రకటన చేశారు. ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా మహా నిర్మాణాల శిలాఫలకాల మీద రాజుల, నియంతల, ప్రధానుల పేర్లే ఉంటాయిగానీ రాళ్లెత్తిన కూలీల పేర్లుండవు. కనీసం ఆ మహా నిర్మాణక్రమంలో నలిగి, కమిలి బలవన్మరణాల పాలైనవారి పేర్లైనా ఉండవు. ‘‘మీ మహాప్రస్థానానికి అక్షరం అక్షరం పొది గిన వారెవరు? అచ్చులొత్తిందెవరు? అట్టలు కుట్టిందెవరు? కట్టలు మోసిందెవరు? ఎక్కడైనా వారి పేర్లు అచ్చు వేశారా?’’అని మహాకవిని నిలదీశారు. జవాబు లేదు. అంతే, కొన్ని కోటబుల్ కోట్స్ అవుతాయిగానీ చర్చకు నిలవవు. తిరిగి తాజ్‌మహల్ దగ్గరకు వస్తే– అన్నట్టు ముగ్గేలా తాజ్‌మహల్ ముని వాకిటలో అన్నాడు శ్రీశ్రీ!
ముఖ్యమంత్రి యోగి మొత్తం శుద్ధి చేయడానికి తాజ్‌మహల్ పరిసరాలన్నీ తుడుస్తూ చీపురుతో పాదయాత్ర ప్రారంభించారు. అయ్యవార్లంగారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టుంది. ఈ నైజం భాజపా రక్తంలోనే ఉందనిపిస్తుంది. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మక నిర్ణయం పాతనోట్ల రద్దు– పైకి తేవా ల్సిన చిచ్చుబుడ్డి అడుగునించి గుంటపూలు పూసిందని అపోజిషన్ ఆక్షేపిస్తోంది. బ్లాక్ డేని బ్లాక్‌మనీ డేగా తిరగ్గొడతామని సర్కార్ అంటోందిగానీ మాట నీళ్లు నవుల్తున్నట్టుంది. ‘‘వీళ్లింతేనండీ, అడుసు తొక్కడం, గంగాజలంతో కాళ్లు కడుక్కోవడం, మళ్లీ అడుసువైపు పరుగులు తీయడం...
వీళ్లకి దేశభక్తి, మతాభిమానం ఉంటే ఏదండీ రామమందిరం? నాలుగేళ్లలో నాలుగు స్తంభాలైనా నిలిపారా’’ అన్నాడొక అపర హనుమంతుడు ఆక్రోశంగా. ‘‘చూస్తున్నాంగా ఈయనవీ ఊకదంపుడు ఉపన్యాసాలే. కాకపోతే మరీ నాసిరకం ఊక కాకుండా హెర్బల్ ఊక వాడుతున్నాడని’’ ఓ పెద్దమనిషి ఆక్షేపించాడు. జీఎస్టీ కూడా బురద బురదగానే ఉంది. దాన్నొక క్రమంలో పెట్టకుండా, అచ్చీపచ్చీగా జనం మీదకు వదిలారని అనుభవజ్ఞులంటున్నారు. హిందీ భాషలో ఏది స్త్రీ లింగమో, ఏది పుంలింగమో చెప్పడం క్లిష్టతరం. దానికో వ్యాకరణ సూత్రం లేదు. వస్తు సేవల పన్ను పరిభాష కూడా అలాగే ఉంది. కొన్ని వేల లక్షల పన్ను విధానాలు. ఇది అంకెలలో నిర్మించిన హిందీ భాష. ఇది నా మనసులో మాట!
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment