
చంద్రబాబు ‘ప్యాకేజీ’ అనే ఎండమావి వెనకాలపడి నాలుగేళ్ల నుంచీ పరుగులు పెడుతున్నారు. దానివల్ల దాహం పెరిగిందిగానీ ఎక్కడా తడి తగల్లేదు.
బాగా ఎల్తైనవి, చాలా లోతైనవి మామూలు దృష్టికి అంతుచిక్కవు. ఉదాహరణకి భూగోళం. అది గుండ్రంగా ఉంటుందని, నారింజపండు లాగానో, రుద్రాక్ష కాయలా గానో ఉంటుందనే సత్యం మామూలు కంటితో చూసి నిర్ధారించలేం. నిజం నిరూపించాలంటే చాలా ఎత్తుమీద నుంచైనా చూడాలి, లేదా అత్యాధునిక టెలిస్కోపునైనా వాడాలి. రాజకీయం తెలుసు కాబట్టి చక్రం తిప్పుతానని ఊరికే అతి విశ్వాసంతో ముందుకు వెళ్లకూడదు. శాస్త్ర పురాణాలు క్షుణ్ణంగా కాకపోయినా పైపైన అయినా చదవాలి. దేవుడు పది అవతారాలెత్తాడు. కానీ ఏ రెండూ ఒక దాన్ని పోలి ఒకటి లేవు. చేపకి, తాబేలుకి, నరసింహానికి సాపత్యం ఏవన్నా ఉందీ? లేదని భావం. వామనావతారం మరో చమత్కారం. భూమికి జానెడు ఎత్తున వటువుగా నడిచి వచ్చి మూడు వేళ్లు చూపించి మూడడుగుల దానం ఇమ్మన్నాడు. బలి చక్రవర్తికి తెలిసి చావలా– అవి మూడేళ్లు కావు తిరునామం. ఆంతర్యం అంతుపట్టక తీసుకో, కొలుచుకో అన్నాడు. అంతే! వామన పురాణంగా వాసికెక్కింది. ఒకే ఒక డాట్‌ని విశదపరిస్తే కేంద్ర బడ్జెట్ సవివరంగా వచ్చినట్టు– వామనుడు త్రివిక్రముడి డిజిటలైజ్ వెర్షన్.
చంద్రబాబు కూడా ఇక్కడే పప్పులో కాలేశాడు. మోదీని ముందు ధరించి పసుపు పచ్చ జెండా ఊపుకుంటూ ముందుకు కూతలు వేసుకుంటూ సాగి పోవచ్చనుకున్నాడు. ఇప్పుడు పట్టాల దారి కనిపించడంలేదు.
‘నేనున్నానని’ అభయ మిస్తూ కనిపించిన వెంకయ్యనాయుడుని సమున్నతమైన కొండ గుహలో కూర్చోపె ట్టారు. ఇది కూడా మోదీ పుణ్యమే! చంద్రబాబు అందరూ చెబుతున్నా విన కుండా ‘ప్యాకేజీ’ అనే ఎండమావి వెనకాల పడి నాలుగేళ్ల నుంచీ పరుగులు పెడుతు న్నారు. దానివల్ల దాహం పెరిగిందిగానీ ఎక్కడా తడి తగల్లేదు. ఇప్పుడు మళ్లీ తూచ్ అనేసి ప్రత్యేక హోదాయే ముద్దు, అది అయిదుకోట్ల చిల్లర తెలుగువారి హక్కు అని గర్జిస్తున్నారు. ‘ప్యాకేజీ’ చాలా చాలా లాభమన్నారు మొన్నటిదాకా. నిన్నట్నించి గళం మార్చి స్వరం మార్చి ప్రసంగిస్తున్నారు. ఎన్నడూ లేనిది, మోదీని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఆయన ‘దేశముదురండీ’ అని నాలుగేళ్ల నాడే ఒక సంఘ్ పెద్ద అన్నారు– ఏ భావంతో అన్నారో గానీ.
అరటితోటలో ఆంజనేయస్వామి కొలువై ఉంటాడని పుస్తకంలో ఉందని తోట లన్నీ గాలిస్తే దొరుకుతాడా? దొరకడని భావం. త్రేతాయుగంలో ఆంజనేయస్వామి రామబంటుగా రామాయణం నిండా కొలువు తీరాడు. ద్వాపరం వచ్చే సరికి జెండా మీద బొమ్మై, జెండాపై కపిరాజుగా గాలిలో రెపరెపలాడాడు. కలియుగం వచ్చే సరికి కిరసనాయిల్ డబ్బాల మీద, ట్రాన్స్‌పోర్ట్ లారీలపైన ట్రేడ్‌మార్క్ గుర్తుగా స్వామి సేవలందిస్తున్నాడు. సంఘ్‌లో పుట్టి సంఘ్‌లో పెరిగిన సంఘీయుడు మోదీ. ఆయన నాయకత్వంలో అయోధ్య బృహత్తర రామమందిరం ప్రస్తుతం రైలు స్టేషన్‌గా అవతరించబోతోంది. మన కల నెరవేరబోతోంది. అందుకని చంద్ర బాబు మనుషుల్ని జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఆట్టే వ్యవధి కూడా లేదు.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ