మా ఊరెళ్లాలి... | Sri Raman write article on Own villages | Sakshi
Sakshi News home page

మా ఊరెళ్లాలి...

Published Sat, Sep 30 2017 1:31 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

Sri Raman write article on Own villages - Sakshi

అక్షర తూణీరం

మనందరి వేళ్లు ఇప్పటికీ మన గ్రామంలోనే ఉన్నాయి. పండుగ వస్తే, మూడ్రోజులు వరుసగా సెలవులొస్తే ఊరికి ప్రయాణమవుతాం.

అప్పుడప్పుడు మా ఊరెళ్లాలనిపిస్తుంది. చెప్పలేనంత బలంగా, ఆగలేనంత ఆత్రంగా వెళ్లాలనిపిస్తుంది. ఎన్నెన్నో జ్ఞాపకాలు ముసురుతూ, కసురుతూ ఉన్నచోట ఉండనివ్వవు. పెద్ద పండుగలు దసరా, సంక్రాంతి వస్తున్నాయంటే మనసు నిలవదు. గుళ్లోంచి పున్నాగపూల వాసన ఉద్యోగపు ఊరుదాకా వచ్చి కవ్విస్తుంది. పిల్ల కాలువలు, పచ్చిక డొంకలు, తాటిబీళ్లు పేరెట్టి మరీ పిలుస్తాయి. ఇంకా రాలేదేమని పదే పదే అడుగుతాయ్‌. రథం బజార్‌ సెంటర్లో రావిచెట్టు గలగలమంటూ ఏదో చెప్పాలని ఆరాటపడుతుంది. మా ఊరెళ్లాలి. ఆ గడ్డపై ఏదో ఆకర్షణ ఉంది. పాదరక్షలు లేకుండా ఆ మట్టిమీద నడవాలనిపిస్తుంది. మా ఊరి చెరువులో బాతులతో సమానంగా ఈదులాడ మనసవుతుంది. మర్రి ఊడల ఉయ్యాలలూగి బాల్యాన్ని ఒంటిమీదికి ఆవాహన చేసుకోవాలని ఉంది. సత్తార్‌ భాయ్‌తో సమానంగా దసరా పులి వేషం కట్టి ఆడాలనే కోరిక ముదురుతోంది. పులి ఆట, డప్పులు అడుగు నిలవనివ్వకుండా వినిపిస్తున్నాయ్‌. మా ఊరెళ్లాలి.

చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు ఇంకీ ఇంకని బురద వీధిలో.. కొత్త దుస్తులు, విల్లమ్ములు, కోతి బొమ్మలు ధరించి బుక్కాలు కొట్టుకుంటూ సాటి పిల్లలతో ఊరంతా తిరగడం నిన్నమొన్నటి సంగతిలా అనిపిస్తుంది. అయ్యవారికి చాలు అయిదు వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు– జయీభవ! దిగ్విజయీభవ అని దీవెనలు పెడుతూ అరుగు అరుగు ఎక్కి దిగడం పప్పూ బెల్లాలు తినడం ఇంకా నాలిక మీద ఉంది. ఇప్పుడు మా ఊరు మారిపోయింది. ఆ ఇళ్లు, ఆ గోడలు, ఆ అరుగులు లేవిప్పుడు. బోలెడు మా ఊరి ఆనవాళ్లు కన్పించనే కన్పించవు. ఆ మనుషులు మచ్చుకి కూడా కనిపించరు. ఆత్మీయంగా పలకరించే ఆ పిలుపులు వినిపించవ్‌. మా ఊరెళ్లాలి, అంతే! చేలమీంచి వచ్చే జనపపూల వాసన ఇప్పుడు లేదు. పురుగు మందుల కంపు వేటాడుతుంది. ఎద్దుల మెడ గంటల సవ్వడి వినరాదు, ట్రాక్టర్ల రొద తప్ప. కొంచెమే పాతముఖాలు, అవీ బాగా వెలిసిపోయి కనిపిస్తాయి. అన్నీ కొత్త మొహాలే. పాపం నన్ను గుర్తుపట్టలేవ్‌. చేసంచీతో వెళ్లి, ఊరంతా తనివితీరా తిరిగి రావాలి. పాత గుర్తులన్నింటినీ తిరిగి మా ఊరికి అలంకరించి, ఆనాటి ఊరు తల్లిని దర్శించాలి. అందుకే మా ఊరెళ్లాలి.

మనందరి వేళ్లు ఇప్పటికీ మన గ్రామంలోనే ఉన్నాయి. పండుగ వస్తే, మూడ్రోజులు వరుసగా సెలవులొస్తే ఊరికి ప్రయాణమవుతాం. ఏటా రెండు మూడు సందర్భాలు మాత్రమే వస్తాయ్‌. ఈ సంగతి అందరికీ తెలుసు. ప్రజలకు ప్రభుత్వాలకు ఎరుకే. అయినా ప్రయాణ సౌకర్యాలుండవ్‌. సరిగ్గా అప్పుడే రవాణా సంస్థ సర్వర్లు పనిచెయ్యవ్‌. సరిగ్గా అప్పుడే ప్రైవేట్‌ రవాణాదార్లకు గిరాకీ పెరుగుతుంది. టికెట్‌ ధర ఐదు నుంచి పదిరెట్లవుతుంది. అవసరాన్ని బట్టి టికెట్లు వేలం పాడుకోవలసి ఉంటుంది. ఇదొక పెద్ద మాయ! రోడ్డు రవాణా సంస్థ సైతం ధరలు పెంచుతుంది. రైల్వేశాఖ పెంచుతుంది. ఆకాశ మార్గం అయితే సరే సరి– ఆకాశమే హద్దంటుంది. ఇలా పండుగ వస్తే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఎంతలా కిటకిటలాడిపోతాయో మీడియా బొమ్మలు చూపించి వినోదపరుస్తుంది. ఇలా జనం స్వగ్రామాలు వెళ్లడం కూడా మా ప్రభుత్వ కృషి ఫలితమేనని ఏలినవారు క్లెయిమ్‌ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఎంత కష్టమైనా, నిష్టూరమైనా ఊరివైపు కాళ్లు లాగేస్తాయి. ఉన్నచోట నిలవనివ్వవ్‌. మా ఊరెళ్లాలి, తప్పదు.

-శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement