
కొండకి నాగలంటే ఇదే!
అక్షర తూణీరం
బాబు తెరపై చూపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ మహానగరం ఎప్పటికి చూస్తామోనని ప్రజలు తహతహలాడుతున్నారు. కొందరికి అసలు చూడమేమోనని దిగులు.
రైతులు ఇచ్చారో కాపిటలిస్టులు తీసుకున్నారోగానీ ముప్పై వేల ఎకరాల సుక్షేత్రాన్ని బీడు పెట్టేశారు. కాపిటలిస్టులంటే మహానగర నిర్మాతలని నా ఉద్దేశం. రాష్ట్రంలో కూరగాయలకు కరువొచ్చిపడింది. టమేటాలు సలక్షణమైనవి కిలో వందరూపాయలు, పచ్చిమిర్చి దానికి సరితూగుతోంది. మిగతా పచ్చికూరలన్నీ మన సొంత హెరిటేజ్‌లో సైతం మండిపోతున్నాయి. రెండు ఏరువాకలు గడిచిపోయాయి. జరిగిందేమిటంటే తాత్కాలిక సచివాలయం మరియు శాసనసభా భవనం, అవి కూడా మన రాష్ట్రప్రభుత్వ ఆంతరంగిక సమాచారంలాగే అడపా దడపా లీకులకు గురి అవుతున్నాయి.
అది నిర్మాణ లోపం కాదనీ, వాన కురుస్తున్న తీరే కారణమని అప్పటికప్పుడు నొక్కి వక్కాణిస్తున్నారు. లీకుల వల్ల తడిసేది వారే గానీ సామాన్య ప్రజ కానేకాదు. పోనీ, ఈ తాత్కాలికాలకు ఓ వెయ్యి ఎకరాలు పక్కన పెట్టినా, మిగతా సుక్షేత్రాలలో కూరగాయలు పండించవచ్చు. మిగతా మెట్టపంటలు వెయ్యొచ్చు. ఒకవేళ సింగపూర్ వాళ్లు, జాపనీయులు వస్తే పంటతో నేలను చూపించవచ్చు. వాళ్లు వచ్చేసరికి బీడు భూముల్లా కనిపించాలని ఖాళీగా పెట్టారు.
ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ, బాబు తెరమీద చూపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ మహానగరం ఎప్పటికి చూస్తామోనని ప్రజలు తహతహలాడుతున్నారు. కొంచెం వయసు మీరినవారు అసలు చూడమేమోనని దిగులు పడుతున్నారు. కొందరు మాత్రం, ‘కొండకి నాగలి పట్టించాడు. కొంచెం కష్టమే’నని నిట్టూరుస్తున్నారు. కృష్ణమ్మ మీద నయన మనోహరమైన వంతెనలు, ఆబాల గోపాలాన్ని ఆడించే నందనవనాలు, కోరిన చోటల్లా ఫ్లైఓవర్‌లు బాబు చూపిస్తున్న బొమ్మల్లో తెగ ఊరిస్తున్నాయి. నా చిన్నప్పుడు హనుమంతుడు గారని ఒకాయన ఏటా నాలుగుసార్లు మా ఊళ్లకి వచ్చేవాడు. ఒక ఎడ్లబండిలో రెండు రాతి విగ్రహాలు, వెనకాల మరో బండిలో ఊరూరు తిరిగేవారు. ఏటవతల ఆలయనిర్మాణం జరుగుతోందని, అక్కడ ప్రతిష్ట చేసే విగ్రహాలు ఇవేనని భక్తిపూర్వకమైన భాషలో మైకులో ప్రకటించేవాడు హనుమంతుడుగారు. ‘ఇదే ఆఖరి అవకాశం.. దేవుడు మీ ఇంటిముందుకొచ్చాడు.
తర్వాత మనమే గుడికి వెళ్లాలి దర్శనానికి’ అంటూంటే, ఇహ జనం టెంకాయలే కాదు, హారతులే కాదు, కానుకలే కాదు.. హనుమంతుడుగారి పంటపండేది. రెండు బజార్లు కవర్ చేసేటప్పటికి బియ్యంతో, అపరాలతో వెనకాల బండి నిండిపోయేది. రొఖ్ఖం సరే సరి. ప్రతిష్ట తర్వాత గోత్రనామాలతో పూజకి ముందస్తు బుకింగ్‌లు కూడా జరిగేవి. హనుమంతుడు మైకులో కట్టబోయే ఆలయాన్ని గోపురాలతో, ప్రాకారాలతో, ధ్వజస్తంభాలతో, జే గంట లతో, మహామంటపాలతో, కొలనులతో బొమ్మ కట్టించి భక్తుల్ని తన్మయుల్ని చేసేవాడు. మీరొక మారేడుకి ఆశ్రయం ఇవ్వొచ్చు. మీరొక పున్నాగను పూయించవచ్చు.
పొగడ, పొన్న, పారిజాతం ఏదైనా సరే మీ పేరు మీద పూస్తూ, దేవుళ్లను సేవిస్తూ ఉంటుంది– ఒక్క నూట పదహారు రూపాయలు చాలు. మళ్ళీసారి హనుమంతుడు కొత్త బొమ్మలు తెచ్చేవాడు. దశావతారాలు, నవగ్రహాలు.. ఇలా రకరకాల విగ్రహాలు. ఆలయం ఎక్కడో తెలియదు. ఎప్పటికి ప్రతిష్టలవుతాయో చెప్పలేం. మొత్తానికి ముప్పైఏళ్లపాటు హనుమంతుడిగారి జీవితం సుఖంగా సాగిపోయింది. మనదేశంలో దేవుడి బొమ్మలతో ఎంత కాలమైనా వ్యాపారం నడిచిపోతుంది. కానీ ఇతరత్రా బొమ్మలతో మాత్రం కథ నడవదు.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)