ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైలే వేరు అన్నట్లుగా ఉంటారు. తన వద్ద సమాధానం లేని ప్రశ్నను ఎవరైనా వేస్తే, ఎదురు ప్రశ్నించడంతో వారి నోరు మూయించే యత్నం చేస్తుంటారు. అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించి మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఒక విలేకరి అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది? ఎంత వ్యయం చేస్తారు? అని ప్రశ్నించారు. ఆయన వద్ద దానికి సరైన జవాబు లేదు. అంతే! వ్యూహాత్మకంగా ఆయన మీరే చెప్పండి.. మీరు అయితే ఎంత కాలంలో నిర్మిస్తారు? అంటూ ఏదేదో మాట్లాడారు. అది విన్నవారు విస్తుపోవడం తప్ప చేయగలిగింది లేదు.
ప్రభుత్వ గల్లా పెట్టె ఖాళీగా ఉంది.. గత ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో అర్ధం కావడం లేదు. ఆ వివరాలన్ని సిద్దం చేస్తున్నారు.. అని కూడా చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అది పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందో, ఇంకా ఎక్కువ అవుతుందో అని వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో అలా కూడా చెప్పలేదు. పైగా ప్రశ్నించివనారే ఎంత కాలం పడుతుందో చెప్పాలని అంటున్నారు. అమరావతిలో రకరకాల రూపాలలో సెంటిమెంట్ పండించడానికి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిను విమర్శించడానికి ఆయన ఈ సందర్శనను వాడుకున్న సంగతి అర్ధం అవుతూనే ఉంది.
రాజకీయాలలో ఇలాంటివి సహజమే అయినా చంద్రబాబు నాయుడు అసలు విషయాలను పక్కదోవన పట్టిస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది? ఒకవైపు అమరావతిని పూర్తి చేస్తామని అంటారు. అమరావతిలో ప్రభుత్వానికి మిగిలే భూముల అమ్మకంతో వచ్చే డబ్బుతో రాజధాని నిర్మాణంతో పాటు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అంటారు. అమరావతి రాజధానిలో మౌలిక వసతులకే లక్ష కోట్లకు పైగా వ్యయం అవుతుందని ఐదేళ్ల క్రితమే అంచనా వేశారు. అది ఇంకా పెరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తొలిదశకు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంచనా అవుతుందని అప్పట్లో లెక్కించామని, తాజాగా ఎంత అవుతుందన్నది గణించాలని కొద్ది రోజుల క్రితం చెప్పారు.
ఇక్కడ అందరికి వచ్చే సందేహం ఏమిటంటే? ముందుగా ప్రభుత్వం సమీకరించిన భూమికి సంబంధించి రైతులకు ప్లాట్లు కేటాయించి, అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అంటే రోడ్లు, డ్రైన్లు, మంచినీరు తదితర సదుపాయాలు కల్పించాలన్నమాట. ఇక ప్రభుత్వ పరంగా నిర్మించదలచిన భవనాలకు కూడా వేల కోట్ల వ్యయం అవసరం. వీటన్నిటికి డబ్బు సమకూర్చుకోవాలంటే భూములు అమ్మాలి. గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఏదైనా చేయడానికి భూములను విక్రయించడానికి ప్రయత్నిస్తే టీడీపీ అడ్డుకునేది. ఇప్పుడు తాను భూములను అమ్మి సంపద సృష్టించి దానిని అటు అమరావతికి, ఇటు సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేస్తానని చెబుతున్నారు. ముందుగా అన్నీ వసతులు ఏర్పడితే కదా వాటిని కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చేది అనే ప్రశ్న వస్తుంది.
రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చిన రాజధానిలో హైప్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు పర్యటన ఉపయోగపడవచ్చు. కానీ సకాలంలో చంద్రబాబు ప్రభుత్వం తాము చెప్పిన విధంగా సదుపాయాలు కల్పించి, ఆయా సంస్థలను రాజధానికి తీసుకురాలేకపోతే ఈ హైప్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాని వల్ల అక్కడ భూములు కొన్నవారికి నష్టం జరుగుతుంది. గత ఏడాది కాలంలో హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించిందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన భవనాల స్పేస్ కన్నా బాగా అధికంగా అందుబాటులో ఉండడం, అమెరికాలో మాంద్య పరిస్థితులు, ఇతర అంశాలు ఇందుకు కారణమని వారు అంటున్నారు.
అమరావతిలో ప్రస్తుతం కొంతమేర రేట్లు పెరిగాయని సమాచారం. అది కొనసాగాలంటే ముందుగా ప్లాట్ల కేటాయింపు, అభివృద్ది పనులు పూర్తి కావాలి. అందుబాటులోకి వచ్చే ప్లాట్లు అమ్ముడుపోవడానికి తగిన డిమాండ్ ఉండాలి. ఒక ఏడాదిలోనో, రెండేళ్లలోనో జరిగేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుంది. నిజానికి చంద్రబాబు నాయుడు 2014 టరమ్ లో రాజధానికి అవసరమైన రెండువేల నుంచి ఐదువేల ఎకరాల వరకు భూములు తీసుకుంటే సరిపోయేది. మిగిలిన భూమిని ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అభివృద్ది చేసుకునేవారు. ప్రభుత్వపరంగా తీసుకోవల్సిన చర్యలు చేపడితే సరిపోయేది. అలా చేయకుండా ఏభైఐదువేల ఎకరాలభూమిని సమీకరించడంతో ఆ బాధ్యత అంతా ప్రభుత్వంపై పడింది.
రైతుల నుంచి సమీకరించిన ముప్పైమూడు వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములు కలిపి ఏభైఐదువేల ఎకరాలు అభివృద్ది చేయాలంటే లక్షన్నర కోట్ల వరకు వ్యయం కావచ్చు. ఒకసారి చంద్రబాబు నాయుడు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని అంటారు. ఇంకోసారి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని అంటారు. మరోసారి ఎప్పటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామో చెప్పలేమని అంటారు.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికర సంగతి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి తేదీన ఉద్యోగుల జీతాలు పెన్షన్లు, వృద్దాప్య పెన్షన్లు తదితర ఖర్చుల నిమిత్తం పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనావేశారు. ఇందుకోసం వనరుల సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయని, రుణ సమీకరణ చేస్తున్నారని టీడీపీ మీడియా ఈనాడు పత్రికలోనే రాశారు.
గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం దేనికైనా రుణాలు తీసుకుంటే.. అప్పుల చిప్ప అని రాసిన ఈ పత్రిక ఇప్పుడు రుణ సమీకరణ అని చాలా గౌరవంగా చెబుతోంది. విశేషం ఏమిటంటే ఒక్క సామాజిక పెన్షన్లు నాలుగువేల రూపాయలు, బకాయిలతో సహా చెల్లించడానికి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లు చెల్లించడానికే పదివేల కోట్లు అవసరం అయితే, మరి మిగిలిన హామీలకు ఎన్నివేల కోట్లు అవసరం అవవుతాయన్న ప్రశ్న వస్తుంది. ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున నెలకు చెల్లిస్తామని, మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు మూడువేల రూపాయల భృతి, తల్లికి వందనం స్కీమ్ లో ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని ఇలా అనేక హామీలను టీడీపీ, జనసేనల కూటమి మానిఫెస్టోలో ప్రకటించింది. వాటన్నిటికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న వస్తుంది.
ప్రస్తుతానికి ఏవైనా కొన్ని భవనాలను నిర్మించి సరిపెట్టుకుంటారా? లేక గతంలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పన్నులన్నిటిని ఇక్కడే ఖర్చు చేస్తారా? అనేదానిపై క్లారిటీ రావల్సి ఉంటుంది. దీనివల్ల ఇతర ప్రాంతాలలో అసంతృప్తి వస్తుంది. అన్నిటికి జిందా తిలస్మాత్ మాదిరి అమరావతి రాజధానిలో మిగులు భూముల అమ్మకం ద్వారా సంపద సృష్టించి కార్యక్రమాలు అమలు చేస్తామని చెబుతున్నారు. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి కోసం పదిహేనువేల కోట్ల సాయం అడిగారట. కేంద్రం ఆ డబ్బు ఇస్తే ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట అభిస్తుంది. కానీ అది సాధ్యమా అన్నది సంశయం.
ఈ నేపథ్యంలో అమరావతి ఎప్పటికి అభివృద్ది కావాలి? ఎప్పటికి కొత్త సంస్థలు రావాలి? అక్కడ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నివేల మంది రావాలి? ఇదంతా జరగడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకు తమ హామీలను అమలు చేయలేమని చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెబుతుందా? ప్రభుత్వంలో గల్లా పెట్టె ఖాళీగా ఉందని చంద్రబాబు అంటున్నారు. అలాగే అప్పుల గురించి కూడా ఏమీ తెలియదన్నట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల అప్పు చేసిందని ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు చెప్పారు కదా! ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడుతారేమిటి? అని ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెబుతాం.
ఇక్కడ ఇంకో సంగతి ప్రస్తావించాలి. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అనేక స్కాములు జరిగాయని కేసులు పెట్టింది. అందులో చంద్రబాబుతో సహా పలువురు నిందితులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కేసులన్నీ ఏమి అవుతాయో తెలియదు. వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందా? లేక ఇంకేమైనా చేస్తారా అనేది చూడాలి. ఆ కేసులు పెట్టిన అధికారులపై ఇప్పటికే కక్షసాధింపు చర్యలు ఆరంభించారు. ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారి తీస్తాయో కాలమే తేల్చుతుంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment