ఇటీవలికాలంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అంటే ఆయన సర్వజ్ఞుడు అనే ప్రచారం జరుగుతుంటుంది. ఆయనకు ప్రపంచంలోని అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన ఉంటుంది అనే అభిప్రాయం ప్రబలింది. అందులోను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటివారి విషయంలో ఇక చెప్పనవసరం లేదు.
ఆయన సీఎం హోదాలో ఏమి పలికినా అదో అద్భుతం అని ప్రచారం చేసే మీడియా ఉండడం ప్లస్ పాయింట్. అదే నేత గతంలో ఇందుకు విరుద్ధంగా మాట్లాడారు కదా అనే ఆలోచన రావడానికి వీలులేదు. సీఎం అయి ఉండి అసంబంద్దంగా మాట్లాడుతున్నట్లు ఉందే అని ఏ అధికారి నోరు తెరిచే పరిస్థితి ఉండదు. చంద్రబాబు అదే వరసలో ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్లిపోతుంటారు.
2024 శాసనసభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఆయన అభిప్రాయాలు మారిపోయిన వైనం గమనిస్తే నేతలు ఇంతగా మాట మార్చివేస్తారా? అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఏపీలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగితే చంద్రబాబుది దాదాపు ఏకపాత్రాభినయమే అని వేరే చెప్పనవసరం లేదు. ఆయా శాఖలకు సంబంధించి ఏ అధికారి ఎలాంటి నివేదిక ఇస్తున్నా, మద్యలోనే జోక్యం చేసుకుని అన్నిటిమీద ఒపినీయన్ ఇచ్చేస్తుంటారు. అవసరమైతే ఆదేశాలు కూడా వెలువడిపోతుంటాయి.
ఒకప్పుడు జిల్లా కలెక్టర్ల సమావేశం అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మంచి, చెడు విశ్లేషణ జరిగేది. అధికారులు చర్చలలో పాల్గొనేవారు. కొందరైతే తమ భావాలను నిర్మొహమాటంగా చెప్పేవారు. అసలు జిల్లా కలెక్టర్ల సమావేశం అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రారంభోపన్యాసం, ముగింపు సందేశం ఇవ్వడానికి వచ్చేవారు. మధ్యలో అధికారులు స్వేచ్చగా చర్చలు జరిపేవారు.
ప్రభుత్వానికి అవసరమైన సిఫారస్‌లు చేసేవారు. వాటిలో సీఎం ఏవైనా మార్పులు చేస్తే చేయవచ్చు. మంత్రులు సలహాలు ఇస్తే ఇవ్వవచ్చు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ముప్పై ఏళ్ల క్రితమే ఈ ట్రెండ్ మార్చేశారు. అన్ని తానై వ్యవహరించడం ఆరంభించారు. ప్రతి విషయంలోను అదికారులు చెప్పి, చెప్పకముందే తన సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడం అనేది ఆనవాయితీగా అలవరచుకున్నారు. అధికారులు సైతం తమకు ఎందుకులే.. ఆయన చెప్పేదేదో వినిపోతే పోలా అనే పరిస్థితికి వచ్చేశారు. దోమలపై యుద్దం అన్నా, డ్రోన్‌లతో దోమలను కనిపెడతామని చెప్పినా, అమరావతిలో ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గించాలని ఆదేశాలు ఇస్తున్నానని అన్నా ఎవరూ నోరు మెదపలేరు.
ఒకప్పుడు మీడియా అయినా ప్రశ్నలు అడిగేది. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక 2014లో ఆయన కలెక్టర్ల సమావేశంలో తమ పార్టీవారు చెప్పినట్లు అధికారులు వినాలని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఐదేళ్లపాటు అదే ప్రకారం విభజిత ఏపీని పాలించారు. అప్పుడు కనీసం కొంతమందైనా సీనియర్ నేతలు మంత్రులుగా ఉండేవారు. కానీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిస్థితి లేదు. అత్యధిక శాతం మంది ఆయన కుమారుడు లోకేష్ అనుచరులే మంత్రులుగా ఉన్నారన్న భావన ఉంది. చంద్రబాబు కన్నా లోకేషే పవర్‌పుల్ అనే అభిప్రాయం నెలకొంది. వీరి వెనుక ఇద్దరు మాజీ పోలీసు అధికారుల హల్‌చల్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆ సంగతి పక్కనబెడితే కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆయా సందర్భాలలో వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలు గమనిస్తే, ఏపీని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తున్నారు కాబోలు అనిపిస్తుంది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిపిన కలెక్టర్ల సమావేశంలో ప్రజల సంక్షేమం విషయంలో ప్రాంతం, కులం, మతం, పార్టీ వంటివాటిని చూడకుండా సమానంగా అమలు చేయాలని చెప్పారు. అలాగే ఆయన స్కీములన్నీ అమలు చేస్తుంటే, టీడీపీ మీడియా ఈనాడు, జ్యోతి వంటివి ఏదో రకంగా వంకలు పెడుతూ, అసత్యాలు రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసేవి. ఎలాగైతేనే ప్రజలు కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సూపర్ సిక్స్‌కు ఆకర్షితులై పాలిచ్చే పాడి గేదెను వదలుకున్నట్లుగా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను కూడా ఓడించుకున్నారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసి లబోదిబో అంటున్నారు. అది వేరే విషయం.
ఇంతకీ చంద్రబాబు కలెక్టర్‌లకు ఏమి చెబుతున్నారు. తమది రాజకీయ పాలన అని, ఆ విషయాన్ని అధికారులు గమనించాలని స్పష్టం చేశారు. అంటే ఏమిటి దీని అర్దం! 2014 లో ఉన్న చంద్రబాబుకు, ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్నదానికి తేడా ఏమీ లేదని, ఆయనలో మార్పేమీ రాలేదని తేటతెల్లమవుతోంది కదా! విపక్షంలో ఉన్నప్పుడు ఏమి అనేవారు! ప్రజల ఇళ్లనుంచి చెత్త తీసుకువెళ్లడానికి పన్ను వేస్తున్న చెత్త ప్రభుత్వం అని వైఎస్సార్‌సీపీపై ధ్వజమెత్తేవారు. అదెంతయా అంటే ఇంటికి మహా అయితే ఏభై నుంచి వంద రూపాయలు. ఆయనతో పాటు పవన్ కల్యాణ్ కూడా యుగళగీతం పాడేవారు.
సీన్ కట్ చేస్తే పవన్ కల్యాణ్ పిఠాపురంలో చెత్త తీసుకువెళ్లడానికి జనం నుంచి ఇంకా ఎక్కువే వసూలు చేయాలని చెప్పారట. మరి అప్పుడు చెత్త ప్రభుత్వం అన్నారు కదా అని ఎవరైనా అడిగితే అనే సదేహం రావచ్చు. వైఎస్సార్‌సీపీవారు విమర్శలు చేస్తే చేయవచ్చు. దానిని పట్టించుకోకపోతే సరి! తమ వద్దకు వచ్చేవారు ఎవరు వాటి గురించి నిలదీయరులే అనే ధీమా కావచ్చు. పట్టణాలలో అనేక సంస్కరణలకు తానే ఆద్యుడనని చెప్పుకునే చంద్రబాబు, ఏది ఉచితం కాదు అని అధికారంలో ఉన్నప్పుడు ధీరిని చెప్పే చంద్రబాబు విపక్షంలో ఉంటే మాత్రం అన్నీ ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు. అధికారంలోకి రాగానే మొత్తం మారిపోయి, అంతకుముందు మాట్లాడిన విషయాలేవీ గుర్తు లేనట్లు వ్యవహరించడమే ఆయన స్పెషాలిటి.
ఈ మద్య ఇండోర్ కమిషనర్‌గా పనిచేసిన ఒక అధికారి సోషల్ మీడియాలో చెప్పిన విషయాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అక్కడ ఎవరూ బయట చెత్త వేయడానికి లేదు. ప్రతి ఒక్క ఇంటివారు 150 రూపాయలు చెల్లించి తమ వద్దకు వచ్చే బండివాడికే ఆ చెత్త అప్పగించాలి అందువల్ల ఇండోర్ అంత నీట్‌గా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో సైతం ప్రతి ఒక్క ఇంటి యజమాని చెత్తకు వంద రూపాయలు చెల్లించవలసిందే. మరి ఇప్పుడు ఏపీలో ఏమి చేస్తున్నది తెలియదు కానీ, చెత్త డబ్బులు వసూలు చేయని పట్టణాలలో దుర్గందం వ్యాపించిందని వార్తలు వచ్చాయి.
పిఠాపురంలో చెత్త పన్నుకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కల్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చారట. ఇప్పుడు దానిని ఏ ప్రభుత్వం అనాలో తెలియదు. చెత్తపన్ను వేస్తేనే పెద్ద తప్పు అని అరచి గీపెట్టిన చంద్రబాబు ఇప్పుడు తన ప్రభుత్వం వేసే ప్రతి రోడ్డుకు టోల్ గేట్ పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే జాతీయ రహదారులపై గూబ గుయ్ అనేలా టోల్ పన్ను వసూలు చేస్తుంటే, ఏపీలో ఇక రాష్ట్రంలో వేసే కొత్త రహదారులు అన్నిటిపై టోల్ వేస్తారట. ఈ మేరకు నివేదికలు తయారు చేయాలని కలెక్టర్‌ల సమావేశంలో అధికారులను సీఎం ఆదేశించారు. చెత్త పన్ను వేయడమే తప్పు అయితే మరి ఈ రోడ్డు పన్ను ఏమిటి అని ఈనాడు మీడియా రాయదు. పైగా పీపీపీ మోడల్‌లో రోడ్ల నిర్మాణం అని ఘనంగా రాసింది. అంటే రోడ్లను వెడల్పు చేసి, రోడ్లను వేసి, తదుపరి వాటి నిర్వహణ అంతా ప్రైవేటువారికే అప్పగిస్తారట.
ఇక ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా నిరుత్సాహపరచవద్దని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టైమ్ లో ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో అభివృద్ది చేసి, అక్కడ చికిత్సలు సరిపోకపోతే అప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడానికి సిఫారస్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులను పెద్దగా పట్టించుకోబోవడం లేదని పరోక్షంగా చెప్పేశారా అనే ప్రశ్న వస్తోంది. గతంలో విద్యా వ్యవస్థకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లి చదువుకుంటే చాలు, అక్కడ అన్ని సదుపాయాల నిమిత్తం, మధ్యాహ్న భోజనం నిమిత్తం సిబ్బందిని పెట్టారు. మరి వాళ్లంతా ఏమి అయ్యారో కానీ, ఎర్రగొండపాలెం వద్ద ఒక గిరిజన స్కూల్‌లో అన్నీ పనులు విద్యార్దులే చేసుకోవలసి వస్తోందట.
ఈ మార్పులు ఎందుకు వచ్చాయి? స్కూళ్ళను ఏమి చేయాలని అనుకుంటున్నారు. ప్రైవేటు స్కూళ్లకు విద్యార్ధులు వెళ్లేలా ముఖ్యమంత్రే మాట్లాడితే ప్రభుత్వ స్కూళ్లపై ఎవరికి నమ్మకం కలుగుతుంది. పిల్లలందరికి ఇస్తానన్న తల్లికి వందనం ఇవ్వలేదు. పైగా ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన చోట విద్యా వలంటీర్లను పెట్టుకోండని చంద్రబాబు సూచించారట. ఈ వార్తను కూడా ఈనాడు మీడియా గొప్ప విషయంగానే ప్రొజెక్టు చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టైమ్ లో మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తే ఈనాడు మీడియాకు విధ్వంసంగా కనిపించింది. అదే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ విద్యా వలంటీర్లను పెడుతుంటే ఆహా, ఓహో అంటోంది. ఇంటింటికి వెళ్లి రేషన్ ఇచ్చే విదానాన్ని రద్దు చేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ఏమైందో తెలియదు.
అమరావతిలో రాజధానిలో పేదలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన ఏభైవేల ఇళ్ల స్థలాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రతి నెల పదో తేదీన పేదలకోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందట. మరి మిగిలిన రోజులు ఎవరి కోసం పనిచేస్తారన్న సందేహం రావచ్చు. పేదలు గురించి పైకి మాట్లాడుతూ, ధనికుల కోసం టీడీపీ పనిచేస్తుందని అనుకోవచ్చు. పేదల కోసం పదే, పదే పరితపించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఘోరంగా జనం ఓడించిన తర్వాత చంద్రబాబు ఆలోచనే కరెక్టేమో! పేదలకు ఇచ్చిన సూపర్ సిక్స్ కు మంగళం పలికి, ధనవంతుల రియల్ ఎస్టేట్ కోసం పనిచేయడమే బెటర్ అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనుకుంటే తప్పు అవుతుందా!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment