ఇదొక ఏకగ్రీవ తీర్మానం!
అక్షర తూణీరం
అలా మొదలైంది.. కొందరు దిష్టి దెబ్బ తగిలిం దన్నారు. మరి కొందరు ప్రభు త్వ వైఫల్యం అన్నారు. ఇంకొం దరు అధికారుల నిర్లక్ష్యంగా అభివర్ణించారు. నెపం ఏదైతేనే మిగాని దీని విలువ ముప్ఫై నిండు ప్రాణాలు, కొన్ని అంగ వైకల్యాలు. ‘‘నీవే కారణమింతకు...’’ అంటూ ప్రతి పక్షులు ముఖ్యమంత్రిని ఎత్తిపొడిచారు. పనిలో పనిగా, ఆనవాయితీగా, రాజీనామా చెయ్యాల్సిందేనని డిమాం డ్ చేశారు. చెయ్యక్కర్లేదని వీరికీ వారికీ కూడా తెలుసు. చెయ్యరని ప్రజలకు తెలుసు.
ఇటీవలి కాలంలో మనది ప్రజారాజ్యమనే భావన కలగడం లేదు. రాజ్యాలు, రాజులు, రాజ్యాధికారాలు, యివే తలపిస్తున్నాయి. వీవీఐపీలు, వీఐపీలు, ఐపీలు చాలా ఎక్కువ అయిపోయారు. ఎక్కడైనా కావచ్చుగాని కొన్ని చోట్ల అధికుల మనరాదు. తిరుపతి లాంటి దైవ క్షేత్రంలో ‘‘వీవీఐపీ’’ బోర్డులు కనిపించినపుడు కొంచెం నవ్వు వస్తుంది. దైవ సన్నిధిలో ఎవరహో యీ వీవీఐపీ అనిపిస్తుంది. ప్రత్యేక ద్వారాల్లోంచి వందిమాగధులతో సహా క్షణంలో వెళ్లి, గంటసేపు సేవించి, చాలా పుణ్యం మూటకట్టానని మురిసిపోయే వివిఐపిలను చూస్తే జాలేస్తుంది. ఆ ఆర్భాటంలో దేవుడి ముందు నిలబడేది ఆయన గారి అహంకారమే గాని ఆయన కాదు. ఎవరెవరో, ఎవరేమిటో మూలవిరాట్ గుర్తించలేదా? గుర్తించలేకపోతే దేవుడే కాదు.
కొండ మీద గుడి కడుతున్నారు. ప్రాకారాలు, గోపురాలు, మండపాలు, రకరకాల చెక్కడాలతో అదొక మహానిర్మాణం. ఆ రోజుల్లో ఆధునిక సదుపాయాలు లేవు. బండరాళ్లని మనుష్యులు, కంచర గాడిదలు, ఏనుగులు కొండమీదికి చేరవేస్తున్నాయి. ఆలయ నిర్మాణం మహా యజ్ఞంగా సాగి పూర్తయింది. రేపటి రోజు ఆలయ మహా కుంభాభిషేకం. సిద్ధాంతులు, స్వాములు, ఆగమ పండితులు ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు. శిలాఫలకంపై ‘‘ ఫలానా రాజు నిర్మించిన ’’ అంటూ బిరుదు నామాలతో సహా చెక్కి అక్షరాలకు బంగరుపూత పెట్టారు. తీరా ముహూర్తం వేళకి ఆ శిలాఫలకంలో వేరే పేరు కనిపించింది. అంతా కలకలం చెలరేగింది. పని చేస్తున్న రోజుల్లో అక్కడ శ్రమించిన గాడిదలకు పచ్చిక మేత అందించి, నీళ్లు తాగించిన ఒక వృద్ధుని పేరు ఆ ఫలకం మీద వెలిసింది! అందుకని నిజానిజాలు దేవుడికి తెలుస్తాయి.
పుష్కరాల్లో, విఐపి ఘాట్లను రూపొందించారు. అయితే, ఫలానా ఘట్టంలోనే పుణ్యం పురుషార్థమని సీఎం గారి వ్యక్తిగత సిద్ధాంతులు ధ్రువీకరించారు. ఇక రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? పుష్కర జలాల్లో నేత యోగా నుంచి సినిమా సీన్స్ దాకా చేశారు. సామాన్య ప్రజ ఏమైపోయినా అధికార యంత్రాంగానికి పట్టదు. వాళ్లందరికీ పెద్ద సార్ ఒక్కరే పడతారు. ఇక తర్వాత జరిగిన విషాదాన్ని ప్రత్యక్షంగా చూసి విలపించాం. పుష్కర స్పెషల్ ఆఫర్‌గా ఎక్స్‌గ్రేషియా ప్రాణానికి పది లక్షల చొప్పున ప్రకటించి ముఖ్యమంత్రి తన ఔదార్యం చాటుకున్నారు. ఇలాంట ప్పుడు అపోజిషన్ వారు ఇరవై, పాతికా అంటూ పై పాట పాడతారు. ఇదంతా మామూలే. జరిగిన వైఫల్యాన్ని, విషాదాన్ని మరిపించాలని అటునుంచి కృషి జరుగుతోంది. ఈ మహా విషాదానికి చిహ్నంగా, ప్రాణాలు కోల్పోయిన అమాయకుల స్మృతి స్తూపాన్ని గోదావరి పుష్కర ఘాట్‌లో నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాను.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)