akshra tuneeram
-
మాట్లాడే బొమ్మ
‘‘నగరవాసులు తాము మేధావులమని భావిస్తారు గాని పల్లెల్లో ఉండేవారే చాలా సున్నితంగా ఆలో చిస్తారు. చాలా పరిశీల నగా ప్రతి చిన్న విష యాన్ని గమనిస్తూంటారు. చూశారా! యీ మధ్య యన్టీఆర్ మళ్లీ ఫ్రేములోకి వచ్చారు’’ అంటూ మా ఊరి ఓటరు మాట ప్రారంభిస్తే నాకేమీ అర్థం కాలేదు. పిచ్చి చూపు చూశాను. మా ఓటరు నవ్వి, ‘‘అదేనండీ జనంలో తనమీద నమ్మకం పడి పోయిందని సందేహం వచ్చినప్పుడల్లా చంద్ర బాబు అన్నగారి బొమ్మని దగ్గరకి తీసుకుంటారు. గమనించండి కావలిస్తే, యీ మధ్య ఒకే ఫ్రేములో యిద్దరూ సన్నిహితంగా కనిపిస్తున్నారు’’ అంటూ నావంక చూశాడు. నిజమే కావచ్చు గాని నేనె ప్పుడూ మా ఓటరు చూసినంత యిదిగా గమనిం చలేను. నేను మర్యాదకి ఔనన్నట్టు తలూపాను. ఓటరు మరోసారి నవ్వి, అన్నగారే పక్కన కూకుని నడిపిస్తున్నారన్న భ్రమ కలిగించే కోణంలో ఆ బొమ్మని పెట్టుకుంటున్నారీ మధ్య. అసలు అదెట్టా వుంటదంటే, అక్కడక్కడ తీర్థంలో తిరునాళ్లలో మాట్లాడే బొమ్మని చేతిలో పట్టుకుని ఒకాయన కనిపిస్తూ వుంటాడు. ఆ బొమ్మచేత చమత్కారంగా మాటలు చెప్పిస్తూ ఉంటాడు. నిజానికి బొమ్మ మాటలన్నీ ఆయనే మాటలాడతాడు, ఇక్కడ గారడీ ఏమిటంటే పెదాలు కదలకుండా మాట్లాడే కళని ఆయన నేర్చుకుంటాడు. చూసే వాళ్లకి వినేవాళ్లకి వినోదంగా, విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా మన వూరి రచ్చబండ జనాభాకి అన్నగారు మాట్లాడే బొమ్మలాగే కనిపిస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా ఏ మంచి చేసినా దాన్ని క్షణంలో తిరగేసి దానికో వక్రభాష్యం చెప్పేసి హాయిగా ఓ పని అయిపోయిందన్నట్టు రిలాక్స్ అవటం చంద్రబాబుకి అలవాటు అయిపోయింది. కోట్లాది రూపాయలు, లక్షలాది కుటుంబాలకు సరాసరి తరుగులు లేకుండా పంచిపెడుతుంటే, ఓస్, యిదేనా... యిది తెలుగుదేశం బ్రెయిన్ చైల్డ్. ఆలోచించి... చించి డిజైన్ చేసింది నేనే! దాన్ని కొంచెం పాడుచేసి యీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇదొక పెద్ద మోసం. అంటూ చంద్రబాబు అంటుంటే అనుచరగణం అందుకు కోరస్ పాడుతోంది. టీడీపీ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అంత సునాయాసంగా మోసపోయే దశలో ఉన్నారా? ఉండి ఉంటే బాబూ! మీ పార్టీకి ఇలాంటి దశ పడుతుందా? వాళ్లు అనుభవంతో చేవతేలారు. చంద్రబాబు హయాంలో వారు చెప్పుడు మాటలు వినీ వినీ చెడ్డారు. ‘‘అయన పుణ్యమా అని రాటు తేలాం’’ అంటున్నారు వాళ్లు. అసలు అయినా ఎందుకీ అక్కర్లేని రాద్ధాం తాలు. టీడీపీ హయాంలో ఏ సంక్షేమ పథకాలకి ఎంత ఖర్చు చేశారో నిజంగా జనం చేతులకి అందాయో చెప్పండి. ఇప్పుడు ఎంతెంత అందు తున్నాయో చూడండి. ప్రతిదీ మైకు ముందు ఖండిస్తే చెల్లిపోతుందని మునుపటిలాగే చంద్ర బాబు భ్రమలో వుంటున్నారు. ముందు ఆయన ఆ పూర్వపు భ్రమలోంచి బయటపడాలి. అది చాలా మంచిది. అవసరం కూడా. ప్రతిరోజూ చంద్రబాబు వదిలిపెట్టిన బకాయిలు వందల వేల కోట్ల రూపా యలు వద్దన్నా వార్తల్లోకి వస్తున్నాయి. వాటి గురించి మాట్లాడరు. అమరావతి నూతన క్యాపి టల్ గురించి మాట్లాడతారు. చంద్రబాబు హయాంలో లండన్‌లో ప్లాన్లు గీయించారు, సింగపూర్‌తో చర్చలు నడిపారు. జపాన్‌తో యింకేదో జరిపారు. అయిదేళ్లలో వీసమంత పని జరగలేదు. భూములిచ్చిన వారిని ఒకే భ్రమలో ఒక రంగుల కలలో వుంచారు. అదేదో బంగారు గుడ్లు పెట్టే బాతుగా అభివర్ణించి చెబుతున్నారు. ఒక క్యాపిటల్ దానికి తగ్గట్టు ఉండాలి గాని టూరిస్ట్ కేంద్రంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆదాయం వచ్చే క్యాపిటల్‌ని చెయ్యాలనుకుంటే, హాయిగా మన నేటివ్ జూదాలు అంటే కోడి పందాలు, పేకాట లాంటి వాటిని అధికారికంగా నడిపిస్తే పిచ్చ బోలెడు ఆదాయం! మద్యానికి మూతలు తీసి విచ్చలవిడిగా అమ్మి సొమ్ము చేసు కున్న చరిత్రగల గత పాలకులకు ఇందులో ఏ మాత్రం తప్పు అనిపించకపోవచ్చు. వ్యాసకర్త: శ్రీరమణ ప్రముఖ కథకుడు -
కార్తీక వన రాజకీయాలు
రాజకీయం ఏ అవకాశాన్నీ వదులుకోదు. అసలు రాజకీయం అంటేనే అది. ఈసారి మంచి తరుణంలో ఎన్నికలవేడి అందుకుంది. పాపం, మన పూర్వీకులు ఏదో సదుద్దేశంతో ఒక ఆచారం పెడతారు. తీరా, తరాలు గడిచేసరికి ఆ సదాచారం శీర్షాసనం ధరి స్తుంది. అర్థం పర్థంలేని కులాలు గోత్రాలు చెరిగి పోయి, అంతా ఓ చెట్టు నీడన సహబంతి భోజనాలు సాగించాలని తీర్మానించారు. కార్తీకమాసం అందుకు శ్రేష్ఠమని పురాణాల్లో చెప్పారు. అందుకు ఉపవాస దీక్షని జోడించారు. శివుడు కోరిన వరాలిస్తాడని పుణ్యం పుష్కలమని మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న మహర్షుల మాటగా చెప్పారు. నెలరోజులు గడువు ఇచ్చారు. కార్తీక వన భోజనాలు బాగా క్లిక్ అయినాయి. కాకపోతే ఇప్పుడిప్పుడు పిక్నిక్ కళ తెచ్చుకుంది. ఆర్థిక, సాంఘిక, కుల రాజకీయ వ్యవహార చర్చలకు వేదికగా మారింది. చివరికిప్పుడు కుల ప్రాతిపదికన ఈ వన సమారాధనలు నిరాటంకంగా జరుగుతున్నాయి. మనవాళ్లంతా రండి. మనవాళ్లని తీసుకురండి. మనోడు స్పాన్సర్ చేస్తున్నాడు. మనవాడి ఫాంహౌజ్‌లోనే... అంటూ సాదరంగా పిలుపులు వస్తున్నాయ్. ఇట్లు, మీవాడు అంటూ ఆహ్వానాలు పంపుతున్నారు. ఇలాంటప్పుడు కొత్త సమాచారం సేకరిస్తుంటారు కులపెద్దలు. ఫలానా సెంట్రల్ మినిస్టర్ తీరా చూస్తే మనవాడేనని తేలింది. ఆయన ముత్తాతగారి పెత్తాత గోదావరి వాడంట. నువ్వుజీళ్లు తయారించి, అమ్ముకుని జీవించేవాడు. వరుసగా మూడేళ్లు భయంకరమైన కరువొస్తే తట్టుకోలేక పొట్టని, నువ్వుజీళ్ల ఫార్ములాని చేతపట్టుకుని పొగ ఓడలో బొంబాయి చేరుకున్నాట్ట. అక్కడ జీళ్ల కార్ఖానా రాజేశాడు. వెళ్లిన వేళా విశేషంవల్ల దశ తిరిగింది. ఇహ ఆ కొలిమి ఆరింది లేదు. శివాజీ మహరాజ్ జీళ్లకి అబ్బురపడి, ఫిరంగి గుళ్లు, తుపాకీ తూటాలు కూడా చేయించి వినియోగించారట. ‘ఈ దినుసేదో బావుంది. వినియోగం తర్వాత చీమలకి ఆహారం అవుతోంది భేష్’ అంటూ మెచ్చుకుని ప్రోత్సహించారు. ఆ విధంగా పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. కాలక్రమాన ఆ వంశం ముంబాదేవి ఆశీస్సులతో అక్కడ స్థిరపడిపోయింది. వలస వచ్చాం అని చెప్పుకోవడం దేనికి లేనిపోని రొష్టని బొంబాయి జనజీవన స్రవంతిలో ఐక్యమైపోయారు. ‘ఆయన మనోడే. కావాల్సినన్ని రుజువులున్నాయ్. డీఎన్ఏలతో సహా పక్కా.. మనోడే’ అని కులపెద్దలు ఆనందంగా బయటపెట్టారు. ఆయన సమారాధన సభకి వస్తున్నట్టు ప్రకటించారు. మీడియా భాషలో చెప్పాలంటే ఈ టైములో వనభోజనాలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. హాయిగా మనసువిప్పి కులం భాషలో మాట్లాడుకుంటున్నారు. పంట ఓట్లు తక్కువగానూ, పైఓట్లు ఎక్కువగానూ అవసరపడే అభ్యర్థులు చర్చించి రేట్లు ఖాయం చేసుకునే పనిలో ఉన్నారు. తీరా ఆవేల్టికి రేట్లు మన చేతిలో ఉండవ్. ఇప్పుడైతే పచ్చని చెట్లకింద శివసాన్నిధ్యంలో ఓ మాట అనుకుంటే, పాపభీతికి జంకైనా మాటమీద నిలబడతారని నమ్మకం. తులసీ దళం మీద కొందరు, మారేడు దళం మీద మరికొందరు ఓటర్లతో∙ప్రమాణం చేయించుకుంటున్నారట.సర్వసిద్ధంగా ఉన్న అభ్యర్థులు షడ్రసోపేతమైన భోజనం పెట్టి, చివరకు మారేడాకు, తులసి ఆకో గుర్తువేసి ఇస్తున్నారట. తులసి ఆకు చూపిస్తే విష్ణాలయాల్లోనూ, మారేడైతే శివాలయంలోనూ దాన్ని రొఖ్ఖంలోకి మార్చుకోవచ్చు. ఈ విధంగా కార్తీక వన విందులు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయ్. మన సంప్రదాయాల వెనుక ఎప్పుడూ ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది. కారల్‌మార్క్స్ అన్నట్టు సమస్త సంబంధాలూ కడకు ఆర్థిక సంబంధాలకే దారి తీస్తాయ్. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వడ్లగింజలో బియ్యపుగింజ
అక్షర తూణీరం ‘‘స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావ స్తోంది. అయినా మనలో దేశభక్తి మొలకెత్తలేదు. ఇది ఎప్పటికి పెరిగి పెద్దదై ఫలించేను?’’ అం టూ ఒక పెద్దాయన వాపోయాడు. ఇలాంటి నిట్టూర్పులు విన్నప్పుడు నిస్పృహ కలుగుతుం ది. జరుగుతున్న వాటిని ప్రత్యక్షంగా కంటున్నపు డూ, వింటు న్నపుడూ మరీ దిగులేస్తుంది. నిన్న మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాలు చూశాం. నిర్వహణకి నిమిషానికి పదివేలకు పైగా ఖర్చవుతుందంటారు. నిమిషం కాదు కదా, ఒక్కక్షణం కూడా సద్వినియోగం కాలే దు. భారతరత్న అబ్దుల్ కలాం మరణానికి సంతాప సూచకంగా సభ వాయిదా పడింది. ఆ ఒక్కరోజు మాత్రమే సద్వినియోగమయిం దనిపించింది. నిండు సభలో పెద్దలుగా పేరు బడ్డవారు అలా ఎందుకు అరుచుకుంటున్నా రో, కరుచుకుం టున్నారో ప్రజలకు అర్థం కాదు. చాలా రికామిగా ఉన్న సీనియర్ సిటిజ నులు పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలు చూ స్తూ బీపీలు పెంచుకుంటున్నారు. మధ్యత రం, యువతరం ఇలాంటి ప్రసారాలు చూడడం, ఇలాంటివి చదవడం ఎన్నడో మానేశారు. ప్రశాంతంగా ఉన్నారు. ఒకప్పుడు ఎన్.టి.ఆర్. ఉన్నట్టుండి ‘కేంద్రం మిథ్య’ అని ఒక మాట లోకం మీదకు విసిరితే అందరూ కలవరపడ్డారు. అలా అనకూడదన్నారు. అపరాధమన్నారు. ఇప్పుడు సామాన్యుడికెలా అనిపిస్తోంది? అందరూ కలసి అల్లరి చేస్తున్నారు. ఆడుకుంటున్నారు. అసలు సమస్యల్ని కలసిక ట్టుగా కూడబలుక్కుని మరీ దాటవేస్తున్నారన్నది సామాన్యుడి అభిప్రా యం. ‘‘మనకి డిక్టేటరే తగు’’ అని కోట్లాది మంది తమలో తాము నిత్యం తీర్మానించుకుంటున్నారు. ఇది శుభసూచకం కాదు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడానికి మాత్రమే పార్లమెంటు క్షేత్రంగా మిగిలింది. ప్రజాస భలు అవతరించి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ‘స్పీకర్’కి సరైన అధికార స్వరం రాలేదు. సందర్భం వచ్చినపుడు ఒక రోజో, పది రోజులో సభ నుం చి సస్పెండ్ చేయడం కాదు, శాశ్వతంగా సభ్యత్వాన్ని రద్దు చేయగల అధి కారం స్పీకర్‌కి ఉండాలి. సభా నిర్వహణకి సంబంధించి అనేక సవరణలు చేసుకోవాలి. అడ్డుకున్న వారిని సభలోంచి బయటకు పంపడం కాదు, వారిని సభలోనే ఉంచి వారి సీట్లల్లో సమున్నతంగా నిలబెట్టా లి. వారు దేశప్రజలకు ఎత్తుగా కనిపించాలి. సభను ఎలాంటి లావాదేవీలు జరగకుండా చేసినందుకుగాను, సభ్యులందరికీ మూడు నెలల గౌరవ వేతనాన్ని కత్తిరించి, నిర్వహణ ఖర్చుని కొంతైనా పూడ్చాలి. ఇలాంటి సంస్క రణలను చేస్తే సరే, లేదంటే మరో మంచి మా ర్గం ఉంది. అది పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారా లను నిలిపివేయడం. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మర్నాడు కావలసినవారు చక్కని పార్లమెంటరీ భాషలో సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకుంటారు. ఇది ఆసేతు హిమాచలం జెండా పండుగ జరుపుకునే మహోజ్వల ఘట్టం. గౌరవ సభ్యులు దేశమాత సాక్షిగా ఒక్కక్షణం ఆలోచించండి. ఆశ తో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజల కోసం ఏమి చేశాం, ఏమి సాధించాం, ఏమి శోధించామని ఒక్కసారి ప్రశ్నించుకోండి. అప్పటికీ మీకు నిద్ర, ఆకలి మామూలుగానే ఉంటే మీరు మీ ఓటర్ల రుణం తీర్చుకున్నట్టే. సమున్నతంగా ఎగిరే జెండా మన జాతి గౌరవాన్ని సదా కాపాడు గాక! దేశాభిమానాన్ని రగుల్చు గాక! భారతదేశం వర్థిల్లు గాక! జైహింద్. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇదొక ఏకగ్రీవ తీర్మానం!
అక్షర తూణీరం అలా మొదలైంది.. కొందరు దిష్టి దెబ్బ తగిలిం దన్నారు. మరి కొందరు ప్రభు త్వ వైఫల్యం అన్నారు. ఇంకొం దరు అధికారుల నిర్లక్ష్యంగా అభివర్ణించారు. నెపం ఏదైతేనే మిగాని దీని విలువ ముప్ఫై నిండు ప్రాణాలు, కొన్ని అంగ వైకల్యాలు. ‘‘నీవే కారణమింతకు...’’ అంటూ ప్రతి పక్షులు ముఖ్యమంత్రిని ఎత్తిపొడిచారు. పనిలో పనిగా, ఆనవాయితీగా, రాజీనామా చెయ్యాల్సిందేనని డిమాం డ్ చేశారు. చెయ్యక్కర్లేదని వీరికీ వారికీ కూడా తెలుసు. చెయ్యరని ప్రజలకు తెలుసు. ఇటీవలి కాలంలో మనది ప్రజారాజ్యమనే భావన కలగడం లేదు. రాజ్యాలు, రాజులు, రాజ్యాధికారాలు, యివే తలపిస్తున్నాయి. వీవీఐపీలు, వీఐపీలు, ఐపీలు చాలా ఎక్కువ అయిపోయారు. ఎక్కడైనా కావచ్చుగాని కొన్ని చోట్ల అధికుల మనరాదు. తిరుపతి లాంటి దైవ క్షేత్రంలో ‘‘వీవీఐపీ’’ బోర్డులు కనిపించినపుడు కొంచెం నవ్వు వస్తుంది. దైవ సన్నిధిలో ఎవరహో యీ వీవీఐపీ అనిపిస్తుంది. ప్రత్యేక ద్వారాల్లోంచి వందిమాగధులతో సహా క్షణంలో వెళ్లి, గంటసేపు సేవించి, చాలా పుణ్యం మూటకట్టానని మురిసిపోయే వివిఐపిలను చూస్తే జాలేస్తుంది. ఆ ఆర్భాటంలో దేవుడి ముందు నిలబడేది ఆయన గారి అహంకారమే గాని ఆయన కాదు. ఎవరెవరో, ఎవరేమిటో మూలవిరాట్ గుర్తించలేదా? గుర్తించలేకపోతే దేవుడే కాదు. కొండ మీద గుడి కడుతున్నారు. ప్రాకారాలు, గోపురాలు, మండపాలు, రకరకాల చెక్కడాలతో అదొక మహానిర్మాణం. ఆ రోజుల్లో ఆధునిక సదుపాయాలు లేవు. బండరాళ్లని మనుష్యులు, కంచర గాడిదలు, ఏనుగులు కొండమీదికి చేరవేస్తున్నాయి. ఆలయ నిర్మాణం మహా యజ్ఞంగా సాగి పూర్తయింది. రేపటి రోజు ఆలయ మహా కుంభాభిషేకం. సిద్ధాంతులు, స్వాములు, ఆగమ పండితులు ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు. శిలాఫలకంపై ‘‘ ఫలానా రాజు నిర్మించిన ’’ అంటూ బిరుదు నామాలతో సహా చెక్కి అక్షరాలకు బంగరుపూత పెట్టారు. తీరా ముహూర్తం వేళకి ఆ శిలాఫలకంలో వేరే పేరు కనిపించింది. అంతా కలకలం చెలరేగింది. పని చేస్తున్న రోజుల్లో అక్కడ శ్రమించిన గాడిదలకు పచ్చిక మేత అందించి, నీళ్లు తాగించిన ఒక వృద్ధుని పేరు ఆ ఫలకం మీద వెలిసింది! అందుకని నిజానిజాలు దేవుడికి తెలుస్తాయి. పుష్కరాల్లో, విఐపి ఘాట్లను రూపొందించారు. అయితే, ఫలానా ఘట్టంలోనే పుణ్యం పురుషార్థమని సీఎం గారి వ్యక్తిగత సిద్ధాంతులు ధ్రువీకరించారు. ఇక రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? పుష్కర జలాల్లో నేత యోగా నుంచి సినిమా సీన్స్ దాకా చేశారు. సామాన్య ప్రజ ఏమైపోయినా అధికార యంత్రాంగానికి పట్టదు. వాళ్లందరికీ పెద్ద సార్ ఒక్కరే పడతారు. ఇక తర్వాత జరిగిన విషాదాన్ని ప్రత్యక్షంగా చూసి విలపించాం. పుష్కర స్పెషల్ ఆఫర్‌గా ఎక్స్‌గ్రేషియా ప్రాణానికి పది లక్షల చొప్పున ప్రకటించి ముఖ్యమంత్రి తన ఔదార్యం చాటుకున్నారు. ఇలాంట ప్పుడు అపోజిషన్ వారు ఇరవై, పాతికా అంటూ పై పాట పాడతారు. ఇదంతా మామూలే. జరిగిన వైఫల్యాన్ని, విషాదాన్ని మరిపించాలని అటునుంచి కృషి జరుగుతోంది. ఈ మహా విషాదానికి చిహ్నంగా, ప్రాణాలు కోల్పోయిన అమాయకుల స్మృతి స్తూపాన్ని గోదావరి పుష్కర ఘాట్‌లో నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాను. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)