పునరేకీకీకీకరణ
అక్షర తూణీయం
తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో, తమిళనాడులో సేవా కాంక్ష కట్టలు తెంచుకుని రూలింగ్ పార్టీవైపు వురకలు లేస్తోంది. ‘‘పవర్’’ పెద్ద అయస్కాంతం. ఆకర్ష్ మంత్రం పఠించక పోయినా లాగేస్తుంది. అంతా అనుకోవడంలో ఉంటుంది.
‘‘అమ్మాయి లేచి పోయింది’’ అంటే ఒకలా ఉంటుంది. అదే ‘‘అమ్మాయి వయసొచ్చిందని చెప్పకనే చెప్పింది’’ అంటే శ్రావ్యంగా వినిపిస్తుంది. ఏ మాటవాడినా ఫలితాలు, పర్యవసానాలు ఒకటే. ప్లేటు ఫిరాయించారు, కండువాలు మార్చారు, వలసల బాట పట్టారు, దూకారు, జారిపోయారు, తీర్థం పుచ్చుకున్నారు లాంటి మాటలు జంప్‌ల వేళ వాడుతూ ఉంటారు. ఈ పరిభాష అంత యింపుగా వినిపించదు. కేసీఆర్ వాడుకలోకి తెచ్చిన ‘‘క’’ భాష బావుంది. పునరేకీకరణ! చాలా హుందాగానూ, అయోమయంగానూ వినవస్తోంది. అసలు అంకితమైతే పునరంకితం ప్రసక్తి వస్తుంది. ఏకీకరణ జరిగి ఉంటే పునరేకీకరణ పదం పుడుతుంది. ఏ ‘కరణం’ అయితేనేమి సమీకరణం మారింది. మిత్రులు ప్రగతిబాటలో రాళ్లెత్తడానికి గులాబి కండువాలు చుట్టు కుంటామంటున్నారు. పూటకో కారుడిక్కీడు కండువాలు కొత్త మెడల్లోకి వెళ్తున్నాయి. రాష్ట్రం పురోగమిస్తున్న ‘‘వాసన గుబాళిస్తోంది’’. అదే ‘‘గబ్బుకొడుతోంది’’ అంటే అస్సలు బావుండదు.
మిత్రలాభం కథ ఒకటుంది. చెరువు క్రమక్రమంగా ఎండిపోతోందని గ్రహించిన ముందు చూపు గల కప్పలు, నీళ్లున్న చెరువులోకి గంతులేస్తూ వెళ్లిపోయాయి. ఒక బుర్ర తక్కువ తాబేలు అక్కడే బురదలో మిగిలిపోయింది. దానికి మిత్రులైన కొంగలు సాయం చేయడానికి పూను కున్నాయి. ఓ చిన్న కర్రని తమ ముక్కులతో రెండు కొంగలు పట్టు కున్నాయి. ఆ కర్రని గట్టిగా పట్టు కోమని తాబేలుకి చెప్పాయి. ఆ విధంగా తాబే లుతో సహా ఆకా శంలోకి కొంగలు ఎగిరాయి. ఆ దృశ్యాన్ని చూసి అంతా ఆశ్చర్యంతో వినోదిస్తున్నారు. ‘‘ ఆహా! ఈ తెలివి ఎవరిదో కదా’’ అనగా విని, ‘‘నాదే’’ అన్నది గర్వంగా తాబేలు. సీన్ కట్ చేస్తే ‘‘ధబ్’’ మన్న శబ్దంతో నింగి నించి నేలకు పడి పిచ్చిచావు చచ్చింది. అయితే, మన నేతలు నీరెండేదాకా నిలువ ఉండరు. ఉన్నా తాబేలు వలే నోరు తెరవరు. నేలకి దిగి మీడియా ముందు నోరు తెరిస్తే, ‘‘మార్పు నా తీర్పు. దేశమాత ఆదేశం మేరకే ఏం చేసినా’’ అనేస్తారు.
మారన్నలంతా పెద్దాయన తలపెట్టిన ప్రగతి పథకాలకు ముగ్ధులై, తాళలేక తట్టుకోలేక తపనతో గోడదూకిన వారే కాని వేరే ఆలోచన లేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో, తమిళనాడులో సేవా కాంక్ష కట్టలు తెంచుకుని రూలింగ్ పార్టీవైపు వురకలు వేస్తోంది. ‘‘పవర్’’ పెద్ద అయస్కాంతం. ఆకర్ష్ మంత్రం పఠించకపోయినా లాగేస్తుంది. అంభంలో కుంభం ఆదివారంలో సోమవారమన్నట్టు, చంద్రబాబుకి దిశలు తెల్లారుతున్నాయి. అపోజిషన్ వాళ్ల ఎమ్మెల్యేలకి లేని రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. పదవీకాలం గట్టిగా రెండేళ్లుంది. ‘‘ముప్పై కోట్లు, మూడు టెండర్లూ అంటే టూమచ్. ఆ ధరలే నిజమైతే నేను పదిమందిని తెచ్చి టీడీపీలో కట్టేస్తా. నాకు టెన్ పర్సెంట్ యిస్తారా?’’ అంటూ పార్టీ ఆఫీస్‌కి ఓ బ్రోకర్ ఫోన్ చేశాడని వినికిడి. ఇలాంటి కప్పలకి శాసనసభలో వేరే బెంచీలు కేటాయించాలి. జనం వారిని ఎప్పుడూ గుర్తించి గుర్తుపెట్టుకునేలా చూడాలని ఒక మేధావి సూచించాడు. జరిగే పనికాదు.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు : శ్రీరమణ)