ధృతరాష్ట్ర వారసత్వం
అక్షర తూణీరం
‘‘నాకీ సంగతి తెలియదే. నా గురించి నా ప్రజలేమనుకుంటారు?’’ ‘‘సర్వం తెలిసిన మూర్ఖుడు. గొప్ప నట చక్రవర్తి అనుకుంటారు మహారాజా!’’ ఇంతలో కోట వచ్చింది. ఈ భూమ్మీద గుడ్డివాడిలా నటించగలవాడే పాలకుడిగా రాణించగలడు. భారతదేశ నేతలు ధృతరాష్ట్ర వారసులు. యుగాలు మారినా నేల అదే కదా!
అది ద్వాపరయుగం. హస్తినాపురం.
ఒకరోజు ధృతరాష్ట్రుడు విదురునికి కబురంపాడు. ‘‘మనం ఈ అర్ధరాత్రి మారువేషాలలో నగరాన్ని సందర్శించాలి. ప్రజల ఆంతర్యాలను తెలుసుకోవాలని ఉంది’’ అన్నాడు. విదురుడు వెంటనే, ‘‘మహారాజా! ఎందుకు పదే పదే మిమ్మల్ని మీరు దగా చేసుకుంటారు? మీకు అన్నీ తెలుసు. అయినా మీకు ప్రయాస లేకుండా నేను అందరి ఆంతర్యాలు చెప్పగలను’’ అన్నాడు విదురుడు. ‘‘కాదులే, వెళదాం!’’ అన్న రాజాజ్ఞను మన్నించి గోప్యంగా అందుకు తగిన ఏర్పాట్లు చేయించాడు.
అర్ధరాత్రి వీళ్లిద్దరూ పరదేశీయుల లాగా వీధుల వెంట నడిచి తిరుగుతున్నారు. ఒక చిన్న సందులోంచి లయబద్ధంగా నేత మగ్గం చప్పుడు వినవచ్చింది. ఆ పూరింట్లో చిన్న ప్రమిద వెలుగుతోంది. అతను మగ్గం మీద ఉంటే, ఇల్లాలు నూలు కండెలను ఆసు పోస్తోంది. అంతా వివరించి చెప్పాడు విదురుడు. ‘‘ఇంత రాత్రి వేళా?’’ అన్నాడు రాజు. ‘‘ఔను, వాళ్లకి పగలూ రాత్రీ ఒకటే. ఒక్కొక్క పోగూ నేసి వస్త్రాన్ని సిద్ధం చేస్తారు. కోటి పోగులైనా ఒక మూరెడు వస్త్రం కాదు.’’ ‘‘మరి ఈ జిలుగు పనికి వెలుగు?’’ ‘‘చిన్న ప్రమిద. కాని వారికి మనోదీపం ఉంటుంది.’’ అని విదురుడు అనగానే, ‘‘అదెలా సాధ్యం?’’ అని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు. ‘‘సాధ్యమే రాజా! అందుకు మీరే ప్రబల సాక్ష్యం. మీ కోటలో, దివాణంలో జరిగే సమస్తం తమరికి కళ్లకు కట్టినట్టు ఎరుకే గదా! పుట్టు అంధులు మీకే.....’’ మాట పూర్తి కాకుండానే ‘‘సరి సరి. మరోచోటికి వెళ్దాం’’ అంటూ రాజు కదిలాడు.
ఆ ఇంట్లో భార్య, భర్త ఘర్షణ పడుతున్నారు. అది తీవ్ర స్థాయికి వెళ్లింది. ‘‘నీ వల్లే వాడట్లా భ్రష్టుపట్టాడు. వాడెన్ని తప్పుడు పనులు చేసినా హర్షిస్తావు. వాడినే సమర్థిస్తావు. చూడు, చివరికి వాడేకాదు, వాడి అకృత్యాల వల్ల అందరం నాశనం అవుతాం. నీది ధృతరాష్ట్ర ప్రేమ’’ అంటూ భర్త భార్యపై రంకెలు వేస్తున్నాడు. ‘‘రాజా! విన్నారా?’’ అన్నాడు విదురుడు. ‘‘నాకు చెవులున్నాయిగా, పద..పద..’’ అన్నాడు కోపంగా, ధృతరాష్ట్రుడు.
ఇద్దరూ ఓ ఇంటి అరుగు మీద సేద తీరారు. ఆ ఇంట్లోంచి మాటలు స్పష్టంగా వినవస్తున్నాయి. ‘‘ఏమిటి, మహారాణిలా అర్ధరాత్రి సింగారాలు?’’ అంటున్నాడు భర్త పరిహాసంగా. ఆవిడ నవ్వి, ‘‘నా మొగుడు గుడ్డివాడూ కాదు. నేను బండి గుర్రంలా కళ్లకి గంతలు కట్టుకోనూ లేదు. అర్ధరాత్రి అలంకారాలకు నాకేం ఖర్మ?’’ అన్నది. ‘‘నాకేం బోధపడలేదు. విదురా! వివరించవా!’’ అన్నాడు రాజు. ‘‘ఈ పాటక జనం మాటలు ఎవరికీ అర్థం కావు’’ అనగానే, ‘‘నువ్వు అసత్యమాడవని నాకో గుడ్డి నమ్మకం’’ అన్నాడు ధృతరాష్ట్రుడు. వెంటనే విదురుడు, ‘‘అది మీ అంతఃపుర రహస్యం. మహారాణి అర్ధరాత్రి వేళ పరిచారికల సాయంతో, వైనంగా అభ్యంగన స్నానం చేసి సర్వాలంకార భూషితయై జాము సేపు అందాన్ని నిలువుటద్దంలో చూసుకుంటారు’’ అన్నాడు విదురుడు. ‘‘నాకీ సంగతి తెలియదే. నా గురించి నా ప్రజలేమను కుంటారు?’’ ‘‘సర్వం తెలిసిన మూర్ఖుడు. గొప్ప నట చక్రవర్తి అనుకుంటారు మహారాజా!’’ ఇంతలో కోట వచ్చింది.
ఈ భూమ్మీద గుడ్డివాడిలా నటించగలవాడే పాలకుడిగా రాణించగలడు. భారతదేశ నేతలు ధృతరాష్ట్ర వారసులు. యుగాలు మారినా నేల
అదే కదా!
(వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు)