ఇంటింటా ఉసిరి | Sri Ramana write article on Amaravathi Surroundings | Sakshi

ఇంటింటా ఉసిరి

Oct 21 2017 1:05 AM | Updated on May 25 2018 7:06 PM

Sri Ramana write article on Amaravathi Surroundings - Sakshi

అక్షర తూణీరం
మా చంద్రబాబు నాయుడు అయితే ఏ చిన్న అవకాశాన్ని వదలడు. అమరావతి పరిసరాలలో వనభోజనాలకు పది వనాలను పెంచుతానంటాడు.

శరదృతువుకో ప్రత్యేకత ఉంది. అప్పటిదాకా వర్షాకాలం సృష్టించిన చిత్తడిని, బురదని ఇంకింప చేస్తుంది. ఈ రుతువులో ఎక్కడ చూసినా పచ్చికలు, గరికపూలు, రంగురంగుల కలుపు మొక్కలతో నేలలు తివాచీ పరుచుకున్నట్టుంటాయి. నగరాలలో పొడిదుమ్ము తగ్గుతుంది. కార్తీకమాసపు చిరుచలి మనుషుల మనసుకు ఆహ్లాదాన్నిస్తూ ఉంటుంది. పెందరాళే చీకటి పడుతుంది. పగటి పొద్దు తక్కువై పరుగులు పెట్టిస్తుంది. కార్తీకానికి వెలుగు ముద్ర అన్నట్టు వీధి గుమ్మాలలో, తులసికోటలలో నిత్యం దీపం దర్శనమిస్తుంది. శివాలయ ధ్వజస్తంభం మీద ఆకాశదీపాలు ఆధ్యాత్మిక వెలుగులని ప్రసరిస్తుం టాయి. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా చెబుతారు. శివార్చనలు, రుద్రాభిషేకాలు, ఒంటిపొద్దు ఉపోషాలతో మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు కొలుస్తూ ఉంటారు.

ఇక సాంఘికంగా, సామాజికంగా కూడా కార్తీకమాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో జరిగే సామూహిక వనభోజనాలు ఒక చక్కని సదాచారం. ఏడాదికోసారి సర్వులూ ఒక చెట్టు నీడన చేరి సహపంక్తి భోజనం చేయడం ఒక పండు గలా వస్తోంది. ఈ ఆచారంలో ఓ సందేశం ఉంది. కుల, మత, వర్గ వివక్ష లేకుండా అంతా కలసి మెలసి ఒక కుండ కూడు, ఒక మబ్బు కింద, ఓ చెట్టు నీడన తినడం ఈ వ్రతక్రమం. కాసిన పూసిన వనంలో ఉసిరి చెట్టు సమక్షంలో అంతా సమభావంతో ప్రకృతి ఒడిలో ఒక పూటైనా సేద తీరడం దీని పరమార్థం. ప్రకృతిని పూజించడం, వృక్ష సంపద విలువలను గుర్తించడం ఈ సమారాధనల వెనుక దాగి ఉంది. రకరకాల చెట్ల గుణగణాలను ఆస్వాదిస్తాం. అవి చేస్తున్న మేలుని తలుచుకుని ‘ఆహా’ అనుకుంటాం.

స్మశాన, పురాణ వైరాగ్యాల్లాగే, పర్యావరణ వైరాగ్యాన్ని మరుక్షణం విస్మరిస్తాం. పూర్వం ఒక పేట, ఒక ఊరు, ఒక వాడ, ఒక కార్యాలయం వారు, ఒక కర్మాగారం సిబ్బంది ఇలా సమష్టిగా కుటుంబాలతో వన భోజనాలు చేసేవారు. తరతమ భేదాలు చెరిగి మానవ సంబంధాలు కాస్తంత మెరుగుపడేవి. ఒకరి రుచులు, మరొకరి అభిరుచులు పరస్పరం పంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడూ జరుగుతూనే ఉన్నాయి గానీ, సంప్రదాయానికి వెన్ను వేసింది. కులాల వారీగా, తెగల ప్రకారంగా, వర్గాల వారీగా నేడు వనభోజనాలకు పిలుపులొస్తున్నాయి. భారీ ఫ్లెక్సీలు మొలుస్తున్నాయి. కొన్ని సెంటర్లలో రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నచోట రాజకీయ గబ్బు తప్పదు.

ఈ వనభోజన వేదికని వాడుకుంటూ, కార్తీక దృశ్యాలు నడుస్తుంటాయి. ఇలా చెబుతుంటే అమరావతి ప్రాంతీయుడొకాయన అందుకుని, మా చంద్రబాబు అయితే ఏ చిన్న అవకాశాన్ని వదలడు. అమరావతి పరిసరాలలో వనభోజనాలకు పది వనాలను పెంచుతానంటాడు. అవసరమైతే తాజా సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని, వచ్చే కార్తీకంలోగా వృక్షాలను సిద్ధం చేస్తానంటాడు. ఔషధ మొక్కలతో పాటు పదిమంది రామ్‌దేవ్‌ బాబాలను తయారు చేసుకుందామని హామీ ఇస్తాడు. ఇంటింటా ఉసిరి చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపడతాం. ‘ఇంట్లో ఉసిరి– తెలుగువారి సిరి’ఇదే మా నినాదం – అంటూ ముగించాడు ఆ ఆసామి.


- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement