ధ్వన్యనుకరణ కళకి ఆద్యుడు పూజ్యుడు నేరెళ్ల వేణుమాధవ్. ఆయనకు ముందు మిమిక్రీని ఓ కళగా ఒంట పట్టించుకుని జన సామాన్యాన్ని నవ్వు లలో ముంచెత్తిన వారు లేరు. ఆయనతో పుట్టి, ఆయనతో పెరిగింది. ధ్వన్యనుకరణ సమ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ ఇక వినిపించరు. మానవాళికి పెద్ద లోటు. ఆ సహస్ర కంఠుడు మూగపోవడంతో సుమారు ఏడు దశాబ్దాల అపురూపమైన సందడి సద్దుమణిగింది. వేదికలతో పని లేదు. ఆర్కెస్ట్రాతో అస్సలు పనిలేదు. తెరమరుగులు, దీపకాంతుల అవసరమే లేదు. నేరెళ్ల తన సహజమైన చిరు
నవ్వుతో నడిచివచ్చి మైకు చేపడితే చాలు. జనం చప్పట్లు కొడతారు. ప్రారంభించకుండానే నవ్వడం మొదలుపెడతారు. వెంటనే సభ నిశ్శబ్దమైపోతుంది. యావన్మందీ చెవులు రిక్కిస్తారు. ఆయనొక స్వర మాంత్రికుడై విజృంభిస్తారు. స్వర మాంత్రికుడై శ్రోతల మనసుల్ని వశపరచుకుంటారు. మనకు దక్కిన మరో కోహినూర్ వజ్రం నేరెళ్ల వేణుమాధవ్.
మా తెనాలిలో కొల్లా కాశయ్య, తాయారమ్మ దంపతులుండేవారు. ప్రజాహిత కార్యక్రమాలతో వారక్కడ ప్రసిద్ధులు. నేరెళ్ల కొల్లా వారి అల్లుడు. నా బాల్యంలో మా నాన్న తరచు కొల్లా వారింటికి తీసుకు వెళ్తుండేవారు. లోపల పెద్దలు వారి వ్యవ హారం సాగిస్తుంటే, నేను బయట రాలిన పొగడ పూలు ఏరుకుంటూ కూచునేవాణ్ణి. పొద్దు తెలిసేది కాదు. వారింటి కాంపౌండ్‌లో రెండు పెద్ద పొగడ మాన్లుండేవి. 1960లలో మొదటగా వేణుమాధవ్‌ని నేనక్కడ చూశాను. ఆ చెట్లు తిరుగుతూ, గొణు క్కుంటూ, ఆయనలో ఆయన నవ్వుకుంటూ, తర్వాత ఆయన వెలుగులోకి వచ్చారు. ఎన్టీఆర్ నిధుల సేక రణ యజ్ఞాలలో నేరెళ్ల పాలు పంచుకున్నారు. ఆయన తన ప్రజ్ఞ ద్వారా అందరికీ హితులయ్యారు.
మా పరిచయం కొనసాగుతూనే ఉంది. పత్రికా రంగంలో ఉండటంవల్ల తరచూ కలుస్తుండేవాళ్లం. 1978లో నా జీవిత కథ మీరు రాసిపెట్టాలంటూ మా ఇంటికి వచ్చారు. మొత్తం అప్పటిదాకా నేరెళ్లపై కురి సిన ప్రశంసలు, వ్యాసాలు, సన్మానాలు, బిరుదులు భోగట్టా దస్త్రాలన్నీ ఇచ్చి వెళ్లారు. అంతేకాదు, ఎవ్వ రికీ దక్కని అదృష్టం నాకు దక్కింది. వేణుమాధవ్ విజయవాడ ఎప్పుడొచ్చినా ఆయనకు ఉచితంగా ఆతిథ్యమిచ్చే మంచి హోటల్ ఒకటుండేది. అక్కడ దిగేవారు. నన్ను పిలిచేవారు. ఇక చిన్నప్పటినుంచీ కబుర్లు, ప్రపంచంలో ఎక్కడెక్కడో ప్రదర్శించిన ఘట్టాలు చేసి చూపేవారు. ఇలాగ దాదాపు ఏడాది పాటు... కనీసం వంద గంటలు. జీవితంలో నాకు అబ్బిన గొప్ప అదృష్టాల్లో ఇది ముఖ్యమైంది. ఇంతకీ నేను జీవిత కథ రాయనేలేదు. కావాలంటే పెద్ద వ్యాసం రాస్తానన్నాను.
‘‘చూడండి సార్! అమలాపురం నించి ఐరాస దాకా మెప్పించారు. నెహ్రూ, సర్వేపల్లి, బ్రిటిష్ రాణి, జాన్ కెనడీ మనసా మెచ్చుకున్నారు. మీరు నడిచే నవ్వుల రథం. ఇవి చెప్పాక ఏమి రాసినా కేటలాగు అవుతుంది గానీ వేరు కాదు. మీలాంటి కళాకారుల కథ ఎవరిది రాసినా అంతే అవుతుంది. మీ జీవితంలోని ఇతర సంగతులకు అంత ప్రాము ఖ్యం ఉండదండీ’’ అని దణ్ణం పెట్టాను. నా సంజా యిషీ ఆయనకు నచ్చలేదు. ఆనక పురాణంతో రాయించారు. మద్రాసులో కలిసినప్పుడు పుస్తకం ఇచ్చారు. ‘అంత బాగా రాలేదు. మీరన్నట్టు అందంగా ఆల్బమ్ వేస్తే బావుండేది’ అన్నారు. ఆ మహానుభావుడు నన్ను అపార్థం చేసుకోనందుకు ఆనందించాను.
నేరెళ్ల చిత్తూరు నాగయ్యలో పరకాయ ప్రవేశం చేసేవారు. కొన్ని దృశ్యాలకు దృశ్యాలు పాటలు, హావభావాలతో సహా ప్రదర్శించి ఆశ్చర్యపరిచేవారు. మెకనాస్ గోల్డ్‌లో గుర్రాలు ఎడారిలో పరిగెత్తడం, నటి భానుమతి మాట పాట.. ఇలా ఏదైనా అద్భుతమే!
నేరెళ్ల, గుమ్మడి, మిక్కిలినేని, సింగిరెడ్డి ఈ నలుగురూ ఆప్తమిత్రులు. మమ్మల్ని దుష్టచతు ష్టయం అనుకుంటారని గుమ్మడి నవ్వుతూ అంటుం డేవారు. ఆ నలుగురూ కలిసి కనిపిస్తే కళలు, కవి
త్వం కొలువైనట్టనిపించేది. ఈ ఇష్టచతుష్టయంలో నాలుగో ఇష్టుడు కూడా కనుమరుగైనాడు. వారికి అశ్రునయనాలతో...
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment