Nerella Venumadhav
-
మిమిక్రీ చక్రవర్తి
ధ్వన్యనుకరణ కళకి ఆద్యుడు పూజ్యుడు నేరెళ్ల వేణుమాధవ్. ఆయనకు ముందు మిమిక్రీని ఓ కళగా ఒంట పట్టించుకుని జన సామాన్యాన్ని నవ్వు లలో ముంచెత్తిన వారు లేరు. ఆయనతో పుట్టి, ఆయనతో పెరిగింది. ధ్వన్యనుకరణ సమ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ ఇక వినిపించరు. మానవాళికి పెద్ద లోటు. ఆ సహస్ర కంఠుడు మూగపోవడంతో సుమారు ఏడు దశాబ్దాల అపురూపమైన సందడి సద్దుమణిగింది. వేదికలతో పని లేదు. ఆర్కెస్ట్రాతో అస్సలు పనిలేదు. తెరమరుగులు, దీపకాంతుల అవసరమే లేదు. నేరెళ్ల తన సహజమైన చిరు నవ్వుతో నడిచివచ్చి మైకు చేపడితే చాలు. జనం చప్పట్లు కొడతారు. ప్రారంభించకుండానే నవ్వడం మొదలుపెడతారు. వెంటనే సభ నిశ్శబ్దమైపోతుంది. యావన్మందీ చెవులు రిక్కిస్తారు. ఆయనొక స్వర మాంత్రికుడై విజృంభిస్తారు. స్వర మాంత్రికుడై శ్రోతల మనసుల్ని వశపరచుకుంటారు. మనకు దక్కిన మరో కోహినూర్ వజ్రం నేరెళ్ల వేణుమాధవ్. మా తెనాలిలో కొల్లా కాశయ్య, తాయారమ్మ దంపతులుండేవారు. ప్రజాహిత కార్యక్రమాలతో వారక్కడ ప్రసిద్ధులు. నేరెళ్ల కొల్లా వారి అల్లుడు. నా బాల్యంలో మా నాన్న తరచు కొల్లా వారింటికి తీసుకు వెళ్తుండేవారు. లోపల పెద్దలు వారి వ్యవ హారం సాగిస్తుంటే, నేను బయట రాలిన పొగడ పూలు ఏరుకుంటూ కూచునేవాణ్ణి. పొద్దు తెలిసేది కాదు. వారింటి కాంపౌండ్‌లో రెండు పెద్ద పొగడ మాన్లుండేవి. 1960లలో మొదటగా వేణుమాధవ్‌ని నేనక్కడ చూశాను. ఆ చెట్లు తిరుగుతూ, గొణు క్కుంటూ, ఆయనలో ఆయన నవ్వుకుంటూ, తర్వాత ఆయన వెలుగులోకి వచ్చారు. ఎన్టీఆర్ నిధుల సేక రణ యజ్ఞాలలో నేరెళ్ల పాలు పంచుకున్నారు. ఆయన తన ప్రజ్ఞ ద్వారా అందరికీ హితులయ్యారు. మా పరిచయం కొనసాగుతూనే ఉంది. పత్రికా రంగంలో ఉండటంవల్ల తరచూ కలుస్తుండేవాళ్లం. 1978లో నా జీవిత కథ మీరు రాసిపెట్టాలంటూ మా ఇంటికి వచ్చారు. మొత్తం అప్పటిదాకా నేరెళ్లపై కురి సిన ప్రశంసలు, వ్యాసాలు, సన్మానాలు, బిరుదులు భోగట్టా దస్త్రాలన్నీ ఇచ్చి వెళ్లారు. అంతేకాదు, ఎవ్వ రికీ దక్కని అదృష్టం నాకు దక్కింది. వేణుమాధవ్ విజయవాడ ఎప్పుడొచ్చినా ఆయనకు ఉచితంగా ఆతిథ్యమిచ్చే మంచి హోటల్ ఒకటుండేది. అక్కడ దిగేవారు. నన్ను పిలిచేవారు. ఇక చిన్నప్పటినుంచీ కబుర్లు, ప్రపంచంలో ఎక్కడెక్కడో ప్రదర్శించిన ఘట్టాలు చేసి చూపేవారు. ఇలాగ దాదాపు ఏడాది పాటు... కనీసం వంద గంటలు. జీవితంలో నాకు అబ్బిన గొప్ప అదృష్టాల్లో ఇది ముఖ్యమైంది. ఇంతకీ నేను జీవిత కథ రాయనేలేదు. కావాలంటే పెద్ద వ్యాసం రాస్తానన్నాను. ‘‘చూడండి సార్! అమలాపురం నించి ఐరాస దాకా మెప్పించారు. నెహ్రూ, సర్వేపల్లి, బ్రిటిష్ రాణి, జాన్ కెనడీ మనసా మెచ్చుకున్నారు. మీరు నడిచే నవ్వుల రథం. ఇవి చెప్పాక ఏమి రాసినా కేటలాగు అవుతుంది గానీ వేరు కాదు. మీలాంటి కళాకారుల కథ ఎవరిది రాసినా అంతే అవుతుంది. మీ జీవితంలోని ఇతర సంగతులకు అంత ప్రాము ఖ్యం ఉండదండీ’’ అని దణ్ణం పెట్టాను. నా సంజా యిషీ ఆయనకు నచ్చలేదు. ఆనక పురాణంతో రాయించారు. మద్రాసులో కలిసినప్పుడు పుస్తకం ఇచ్చారు. ‘అంత బాగా రాలేదు. మీరన్నట్టు అందంగా ఆల్బమ్ వేస్తే బావుండేది’ అన్నారు. ఆ మహానుభావుడు నన్ను అపార్థం చేసుకోనందుకు ఆనందించాను. నేరెళ్ల చిత్తూరు నాగయ్యలో పరకాయ ప్రవేశం చేసేవారు. కొన్ని దృశ్యాలకు దృశ్యాలు పాటలు, హావభావాలతో సహా ప్రదర్శించి ఆశ్చర్యపరిచేవారు. మెకనాస్ గోల్డ్‌లో గుర్రాలు ఎడారిలో పరిగెత్తడం, నటి భానుమతి మాట పాట.. ఇలా ఏదైనా అద్భుతమే! నేరెళ్ల, గుమ్మడి, మిక్కిలినేని, సింగిరెడ్డి ఈ నలుగురూ ఆప్తమిత్రులు. మమ్మల్ని దుష్టచతు ష్టయం అనుకుంటారని గుమ్మడి నవ్వుతూ అంటుం డేవారు. ఆ నలుగురూ కలిసి కనిపిస్తే కళలు, కవి త్వం కొలువైనట్టనిపించేది. ఈ ఇష్టచతుష్టయంలో నాలుగో ఇష్టుడు కూడా కనుమరుగైనాడు. వారికి అశ్రునయనాలతో... శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
స్వర సామ్రాట్
-
నేరెళ్ల వేణుమాధవ్ (1932–2018)
ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గత డిసెంబర్లో సాక్షి ఫ్యామిలీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా భార్య గురించి భర్త, భర్త గురించి భార్య మాట్లాడిన రెండు మాటలు. నా పక్కనే దైవం ప్రదర్శనలు అంటూ నేను ఊళ్లు పట్టుకు తిరిగినా ఇల్లు, పిల్లల సంరక్షణలో ఏ లోటూ రానీయలేదు శోభ. నా వరకు ఏ సమస్యనూ రానివ్వలేదు. ఎనిమిది పదుల వయసులోనూ ఇప్పుడు ఇంట్లో ఆమె చేతే అన్ని పనులూ చేయించుకుంటున్నాను. నాకు నడవడం చేతకాకపోయినా వ్యాపకం లేకుండా ఉంటే మంచిది కాదని ఇన్నర్ వీల్ క్లబ్ వరకు తీసుకెళ్లి, తీసుకొస్తుంటుంది. చంటిపిల్లాడి మల్లే నా బాగోగులు చూసుకుంటుంది. దైవం ఎక్కడో ఉండడు మనకు సాయం చేసే ప్రతి ఒక్కరిలో ఉంటాడు. ఇప్పుడు నా అర్ధాంగి రూపంలో నా పక్కనే ఉన్నాడు అనిపిస్తోంది. – వేణుమాధవ్ గత జన్మ రుషి ఆయనలో ఒక్క చెడ్డగుణం లేదు. అందువల్ల అందరూ ఆయన్ని ప్రేమిస్తారు. ఎలాంటి వారికైనా విమర్శలు తప్పవు. కానీ వేణుమాధవ్‌గారిని ఎవ్వరూ విమర్శించరు. కిందటి జన్మలో ఆయన రుషి అయి ఉండవచ్చు. ఏదైనా ఒక పొరపాటు చేసి ఈ మానవ జన్మ పొంది ఉండవచ్చని నాకు అనిపిస్తుంటుంది. తిరుపతిలో ఆయనకు జరిపిన గజారోహణలో నేనూ పాల్గొన్నాను. ఆయనలో సగమైన నాకూ ఆ అదృష్టం లభించింది. – శోభవతి, నేరెళ్ల వేణుమాధవ్ సతీమణి -
స్వరబ్రహ్మ నేరెళ్ల వేణుమాధవ్ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, స్వరబ్రహ్మ నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొన్నిరోజులుగా వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందారు. మిమిక్రీ రంగంలో తనదైన సొంత ఒరవడితో, సొంత శైలితో స్వరబ్రహ్మగా వేణుమాధవ్ పేరుతెచ్చుకున్నారు. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఇటీవల ఆయన పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. 2001లో పద్మశ్రీ పురస్కారం ఆయనను వరించింది. శ్రీరాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డునూ ఆయన అందుకున్నారు. ఆయన మృతిపై సర్వత్రా సంతాపం వ్యక్తమవుతోంది. వరంగల్‌లో జననం బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నేరెళ్ల వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న వరంగల్‌లోని మట్టెవాడలో జన్మించారు. 16 ఏళ్లకే ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. చిలకమర్తి ప్రహసనాల్లో నటించడం ద్వారా రంగస్థలానికి పరిచయం అయ్యారు. అనంతరం పలువురు ప్రముఖుల గొంతును అనుకరిస్తూ.. అనతికాలంలో విశేషమైన పేరుప్రఖ్యాతలు గడించారు. ఇంగ్లిష్ సినిమాల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్‌తో సహా మిమిక్రీ చేయడంలో ఆయన సిద్ధహస్తులు. 1947లో ఆయన తొలి మిమిక్రీ ప్రదర్శన ఇచ్చారు. 1953లో హన్మకొండలో జీసీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేశారు. అదే సంవత్సరం రాజమండ్రిలో థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్‌లో మలి ప్రదర్శన ఇచ్చారు. 1975లో శోభావతితో వేణుమాధవ్ వివాహం జరిగింది. వేణుమాధవ్‌కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మిమిక్రీ కళలో తిరుగులేని రారాజుగా ఎదిగిన ఆయన దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. 2005లో తెలుగు యూనివర్సిటీ నుంచి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు వేణుమాధవ్ నిర్వహించిన పదవులు 1976-77 మధ్యకాలంలో ఎఫ్డీసీ డైరెక్టర్‌గా వేణుమాధవ్ వ్యవహరించారు 1974-78లో సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా కొనసాగారు సౌత్‌జోన్ కల్చరల్ కమిటీ తంజావూరు సభ్యుడిగా ఉన్నారు 1993-94లో దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా, రైల్వో జనల్ యూజర్స్ కమిటీ సభ్యుడిగా సేవలు అందించారు ఏపీ లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడిగా, రవీంద్రభారతి కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 1975-76లో ప్రభుత్వ అకడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు ‘నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్’ను స్థాపించి వర్ధమాన కళాకారులకు చేయూతనిచ్చారు వేణుమాధవ్ బిరుదులు ఇవే.. ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, కళా సరస్వతి, స్వర్కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, ధ్వన్యనుకరణ చక్రవర్తి, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ సంతాపం ప్రముఖ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీకి గుర్తింపు తీసుకువచ్చి.. చరిత్రలో చిరస్థాయిగా నేరెళ్ల నిలిచిపోయారు. ధ్వని అనుకరణ సామ్రాట్ ఆయన. మిమిక్రీని పాఠ్యాంశంగా, అధ్యయన అంశంగా మలిచి.. మిమిక్రీ పితామహుడిగా వేణుమాధవ్ ప్రఖ్యాతి గాంచారు’ అని సీఎం కేసీఆర్ కీర్తించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తెలుగు జాతికి తీరని లోటు : వైఎస్ జగన్ మహాకళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్.. ఆయన మృతి తెలుగు జాతికి తీరని లోటు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తెలుగువారికి ఎంతో కీర్తిప్రతిష్టలు ఆయన తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా వేణుమాధవ్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, దశాబ్దాలుగా ఆయన వందలమంది మిమిక్రీ కళాకారులకు మార్గదర్శనం చేశారని అన్నారు. అనేక భారతీయ భాషల్లో స్వరానుకరణ, హాలీవుడ్ నటుల స్వరాలను కూడా అలవోకగా పలికించటంతోపాటు హాస్యం పండించడం ద్వారా వేణుమాధవ్ కోట్లమంది హృదయాలకు చేరువయ్యారని పేర్కొన్నారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేరెళ్ల వేణుమాధవ్‌కు అరుదైన గౌరవం