భార్య శోభవతితో నేరెళ్ల వేణుమాధవ్ (ఫైల్ ఫొటో)
ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గత డిసెంబర్‌లో సాక్షి ఫ్యామిలీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా భార్య గురించి భర్త, భర్త గురించి భార్య మాట్లాడిన రెండు మాటలు.
నా పక్కనే దైవం
ప్రదర్శనలు అంటూ నేను ఊళ్లు పట్టుకు తిరిగినా ఇల్లు, పిల్లల సంరక్షణలో ఏ లోటూ రానీయలేదు శోభ. నా వరకు ఏ సమస్యనూ రానివ్వలేదు. ఎనిమిది పదుల వయసులోనూ ఇప్పుడు ఇంట్లో ఆమె చేతే అన్ని పనులూ చేయించుకుంటున్నాను. నాకు నడవడం చేతకాకపోయినా వ్యాపకం లేకుండా ఉంటే మంచిది కాదని ఇన్నర్ వీల్ క్లబ్ వరకు తీసుకెళ్లి, తీసుకొస్తుంటుంది. చంటిపిల్లాడి మల్లే నా బాగోగులు చూసుకుంటుంది. దైవం ఎక్కడో ఉండడు మనకు సాయం చేసే ప్రతి ఒక్కరిలో ఉంటాడు. ఇప్పుడు నా అర్ధాంగి రూపంలో నా పక్కనే ఉన్నాడు అనిపిస్తోంది.
– వేణుమాధవ్
గత జన్మ రుషి
ఆయనలో ఒక్క చెడ్డగుణం లేదు. అందువల్ల అందరూ ఆయన్ని ప్రేమిస్తారు. ఎలాంటి వారికైనా విమర్శలు తప్పవు. కానీ వేణుమాధవ్‌గారిని ఎవ్వరూ విమర్శించరు. కిందటి జన్మలో ఆయన రుషి అయి ఉండవచ్చు. ఏదైనా ఒక పొరపాటు చేసి ఈ మానవ జన్మ పొంది ఉండవచ్చని నాకు అనిపిస్తుంటుంది. తిరుపతిలో ఆయనకు జరిపిన గజారోహణలో నేనూ పాల్గొన్నాను. ఆయనలో సగమైన నాకూ ఆ అదృష్టం లభించింది.
– శోభవతి, నేరెళ్ల వేణుమాధవ్ సతీమణి
Comments
Please login to add a commentAdd a comment