
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, స్వరబ్రహ్మ నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొన్నిరోజులుగా వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందారు. మిమిక్రీ రంగంలో తనదైన సొంత ఒరవడితో, సొంత శైలితో స్వరబ్రహ్మగా వేణుమాధవ్ పేరుతెచ్చుకున్నారు. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఇటీవల ఆయన పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. 2001లో పద్మశ్రీ పురస్కారం ఆయనను వరించింది. శ్రీరాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డునూ ఆయన అందుకున్నారు. ఆయన మృతిపై సర్వత్రా సంతాపం వ్యక్తమవుతోంది.
వరంగల్‌లో జననం
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నేరెళ్ల వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న వరంగల్‌లోని మట్టెవాడలో జన్మించారు. 16 ఏళ్లకే ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. చిలకమర్తి ప్రహసనాల్లో నటించడం ద్వారా రంగస్థలానికి పరిచయం అయ్యారు. అనంతరం పలువురు ప్రముఖుల గొంతును అనుకరిస్తూ.. అనతికాలంలో విశేషమైన పేరుప్రఖ్యాతలు గడించారు. ఇంగ్లిష్ సినిమాల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్‌తో సహా మిమిక్రీ చేయడంలో ఆయన సిద్ధహస్తులు. 1947లో ఆయన తొలి మిమిక్రీ ప్రదర్శన ఇచ్చారు. 1953లో హన్మకొండలో జీసీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేశారు. అదే సంవత్సరం రాజమండ్రిలో థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్‌లో మలి ప్రదర్శన ఇచ్చారు. 1975లో శోభావతితో వేణుమాధవ్ వివాహం జరిగింది. వేణుమాధవ్‌కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మిమిక్రీ కళలో తిరుగులేని రారాజుగా ఎదిగిన ఆయన దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. 2005లో తెలుగు యూనివర్సిటీ నుంచి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు
వేణుమాధవ్ నిర్వహించిన పదవులు
- 1976-77 మధ్యకాలంలో ఎఫ్‌డీసీ డైరెక్టర్‌గా వేణుమాధవ్ వ్యవహరించారు
- 1974-78లో సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా కొనసాగారు
- సౌత్‌జోన్ కల్చరల్ కమిటీ తంజావూరు సభ్యుడిగా ఉన్నారు
- 1993-94లో దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా
- టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా, రైల్వో జనల్ యూజర్స్ కమిటీ సభ్యుడిగా సేవలు అందించారు
- ఏపీ లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడిగా, రవీంద్రభారతి కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు.
- 1975-76లో ప్రభుత్వ అకడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు
- ‘నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్’ను స్థాపించి వర్ధమాన కళాకారులకు చేయూతనిచ్చారు
వేణుమాధవ్ బిరుదులు ఇవే..
ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, కళా సరస్వతి, స్వర్‌కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, ధ్వన్యనుకరణ చక్రవర్తి, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ
సంతాపం
ప్రముఖ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీకి గుర్తింపు తీసుకువచ్చి.. చరిత్రలో చిరస్థాయిగా నేరెళ్ల నిలిచిపోయారు. ధ్వని అనుకరణ సామ్రాట్ ఆయన. మిమిక్రీని పాఠ్యాంశంగా, అధ్యయన అంశంగా మలిచి.. మిమిక్రీ పితామహుడిగా వేణుమాధవ్ ప్రఖ్యాతి గాంచారు’ అని సీఎం కేసీఆర్ కీర్తించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు జాతికి తీరని లోటు : వైఎస్ జగన్
మహాకళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్.. ఆయన మృతి తెలుగు జాతికి తీరని లోటు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తెలుగువారికి ఎంతో కీర్తిప్రతిష్టలు ఆయన తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా వేణుమాధవ్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, దశాబ్దాలుగా ఆయన వందలమంది మిమిక్రీ కళాకారులకు మార్గదర్శనం చేశారని అన్నారు. అనేక భారతీయ భాషల్లో స్వరానుకరణ, హాలీవుడ్ నటుల స్వరాలను కూడా అలవోకగా పలికించటంతోపాటు హాస్యం పండించడం ద్వారా వేణుమాధవ్ కోట్లమంది హృదయాలకు చేరువయ్యారని పేర్కొన్నారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment