వార్తల కెక్కని పీవీ చాణక్యం | Sri Ramana Article On PV Narasimha Rao | Sakshi
Sakshi News home page

వార్తల కెక్కని పీవీ చాణక్యం

Published Sat, Jul 4 2020 1:17 AM | Last Updated on Sat, Jul 4 2020 1:17 AM

Sri Ramana Article On PV Narasimha Rao - Sakshi

అవి 1994 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికలు. రాష్ట్రంలో పదో అసెంబ్లీ కొలువు తీరింది. తిరుగులేని మెజా రిటీతో ఎన్టీఆర్‌ ముఖ్య మంత్రిగా ఆసీనులయ్యారు. దిష్టి తగిలిందో ఏమో ఏడాది తిరక్కుండా సంక్షోభం మొద లైంది. ఆగస్టు సంక్షోభంగా పేపర్లకు ఎక్కింది. కలయో, వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో గానీ గట్టిగా ఉన్న టీడీపీ పీఠం తాలూకు కూసాలు కదిలాయి. ఎన్టీఆర్‌కి పాపం దెబ్బ మీద దెబ్బ! కో పైలట్‌ నాదెళ్ల కొట్టిన దెబ్బ సర్దుకోక ముందే తిప్పు కోలేని, వూహించని పోటు. యన్టీఆర్‌ తల్లడిల్లి పోయారు. కనిపించిన వాళ్లందరి దగ్గరా గోడు వెళ్ల బోసుకున్నారు. చంద్రబాబుని కాళ్లు కడిగిన అల్లుడని కూడా చూడక నానా దుర్భాషలాడారు. నిస్సహాయ స్థితిలో పడ్డారు పాపం. జరిగిన అన్యాయాన్ని నిలదీసిన పెద్ద మను షులు లేరు. న్యాయాన్యాయాలు కాదు. ఇక్కడ బలా బలాల సమస్య. ఇతరేతర కారణాల వల్ల యన్టీఆర్‌ మద్దతుదార్లు బాగా క్షీణించారు. రకరకాల వ్యూహ రచనలతో మీడియా యావత్తు చంద్రబాబుకి పూర్తిగా కొమ్ము కాసింది.

అల్లుడు దశమగ్రహమంటూ, శని గ్రహమంటూ ఎన్టీఆర్‌ మాట్లాడిన అనేకానేక ఆడి యోలు రాష్ట్రంలో హల్‌చల్‌ చే శాయ్‌. ప్రజలు చాలా సందర్భాలలో ఉదాసీనంగా ఉంటారు. అంతకు ముందు దాకా ఎన్టీఆర్‌ బొమ్మల్ని పూజామందిరాల్లో పెట్టుకున్న జనం ‘ఇది పూర్తిగా మీ కుటుంబ సమస్య. కొట్టుకు చావండని’ నిమ్మకు నిరెత్తినట్టు ఉండి పోయారు. ఇంకొంచెం వివరాల్లోకి వెళితే ఆసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి ఘనంగా 216 సీట్లు, జాతీయ కాంగ్రెస్‌కి కేవలం 26 కుర్చీలు, ఉభయ కమ్యూనిస్టులు వెరసి 34 సీట్లు, మిగిలిన పార్టీలన్నీ కలిస్తే కేవలం 6 స్థానాలు వచ్చాయి. ఎన్టీఆర్‌పై వేర్వేరు కారణాల వల్ల వచ్చిన వ్యతిరేకతని మొత్తంగా కలిపి జనానికి భూతద్దంలో చూపించారు. వైస్రాయ్‌ హోటల్‌ భూమికగా చంద్రబాబు తన మైండ్‌ గేమ్‌ని ఆరంభించారు.

170 మంది అసెంబ్లీ సభ్యులు నాగూట్లో ఉన్నారని నమ్మపలికారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు సైతం పూర్తిగా విశ్వసించారు. దీనివల్ల కప్పదాట్లు లేకుండా ఆగాయి. అప్పుడు ఎన్టీఆర్‌తో కేవలం 28 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆయన ఆక్రోశం ఆగ్రహం హద్దులు లేకుండా పోయాయి. అంతా జారిపోయారు. ఎన్టీఆర్‌ నిరాశ నిస్పృహల మధ్య పీవీ నరసింహారావుని కూడా కలిశారు. ఇంటికి పిలిచి బొబ్బట్లతో మంచి తెలుగు భోజనం పెట్టారు. వాళ్ల కుటుంబ వ్యవహా రంలో ఆయనెందుకు తలపడతాడు? పైగా ఏది ఏమైనా ఆయనకు ఒనగూరే లాభమూ లేదు. నష్టమూ లేదు. కోట బీటవారితే కొంత లాభమే. మౌనం వహించారు. అయితే, పి.వి. గొప్ప చాణక్యపు ఎత్తుగడ వేశారు. అదేంటంటే పూర్వ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత కోట్ల విజయభాస్కర రెడ్డికి తన వ్యూహాన్ని వివరించారు. ‘మనవాళ్లని టీడీపీ రామా రావు గ్రూపుతో కలుపు. సీఎం ఆయనే. మనకి మంత్రి పదవులు కూడా వద్దు’ అనగానే కోట్ల అందరం కలి సినా యాభై నాలుగే అని చప్పరించారు.

మంత్రి పదవులు ఎరవేస్తే మరి కొందరొస్తారు. కొందరు కొందర్ని తెచ్చుకుంటారు. అసలు కవ్వం వేసి కదల్చకుండానే వెన్న పడాలంటావేమమయ్యా అన్నారు. పీవీ. ‘అసలేమో లేదనుకున్నవాళ్లం వందకి వచ్చాం కదా. నువ్‌ కూడా మైండ్‌గేమ్‌కి పావులు కదిలించు’ అనగానే మీరుంటారా అన్నారు జంకుతో కోట్ల, ఎప్పుడూ నవ్వని పీవీ చిరునవ్వు నవ్వి, ‘నా ఢిల్లీ సీటు వదిలి ఇక్కడ ఉండటమా? అక్కడ కుర్చీ ఏ గంటకా గంటే లెక్క! అందుకని ఆ విధంగా ముందు కెళ్లు. తక్కువలుంటే సామదాన భేద దండోపాయాల ద్వారా సాధిద్దాం. రాజకీయంలో అసాధ్యమంటూ ఏమీ ఉండదు’ అని పరిపరివిధాల హితబోధ చేశారు. పి.వి. అయితే, కోట్ల అందుకు సాహసించలేదు. ఆ వ్యూహం ఫలించి వుంటే టీడీపీ చెక్కలు ముక్కలై పోయేది. నల్లేరు మీద బడిలా ఆ సందర్భం నడి చింది. పీవీ వ్యూహాలు అప్పటికీ యిప్పటికీ వెలుగు లోకి రాలేదు. ఆయనే ప్రత్యక్షంగా చదరంగంలోకి దిగితే, బాబుకి ఎక్కడికక్కడ చెక్‌లు పడేవి. పదవి పోయి అపకీర్తి మాత్రం మిగిలేది. నిశ్శబ్దంలోనే ఉండి పోయింది. పీవీ మహా మేధావి, రాజకీయ దురంధ రుడు, నిత్సోత్సాహి. ఆయనకు అక్షర నీరాజనం.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement