అంబేడ్కర్ నుంచి అరుణ్‌జైట్లీ దాకా...
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజలు ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో, ఏ అనామకున్ని అందలమెక్కిస్తారో, ఏ దిగ్గజాన్ని తిరస్కరిస్తారో అనూహ్యం. తిరుగులేదనుకున్న మహామహ నేతలు ఓటమిపాలైన ఉదంతాలు మన దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! అలాంటి పది మంది దిగ్గజ నేతల అనూహ్య ఓటమి చరిత్రను ఓసారి చూద్దాం... – సాక్షి, నేషనల్ డెస్క్
బాబా సాహెబ్ అంబేడ్కర్
రాజ్యాంగ నిర్మాతగా యావద్దేశానికీ ప్రాతఃస్మరణీయుడు. అంతటి మహా నాయకుడు కూడా ఎన్నికల్లో ఓడతారని ఊహించగలమా?! కానీ 1951–52లో జరిగిన దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమి చవిచూడాల్సి వచి్చంది! నార్త్ బాంబే లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడిపోవడమే కాదు, ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ బాలకృష్ణ గాంధీ గెలుపొందారు.
ఇందిరాగాంధీ
దేశ రాజకీయాల్లో అజేయ శక్తిగా వెలిగిపోయిన నాయకురాలు. తొలి, ఏకైక మహిళా ప్రధాని. దశాబ్దానికి పైగా తిరుగులేని అధికారం చలాయించిన ఇందిర 1977 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయారు. ఎమర్జెన్సీ నిర్ణయం ఆమె ఏకైక ఎన్నికల ఓటమికి బాటలు వేసింది. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో సోషలిస్టు పార్టీ ప్రముఖుడు, రాం మనోహర్ లోహియా సన్నిహితుడు రాజ్ నారాయణ్ చేతిలో ఇందిర ఓటమి చవిచూశారు. ఆయన 1971 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇందిరపై పోటీ చేసి ఓడిపోయారు.
కానీ ఇందిర అవినీతికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని కోర్టుకెక్కారు. ఇది అంతిమంగా ఎమర్జెన్సీ విధింపుకు దారి తీయడం విశేషం! రాజ్‌నారాయణ్ వాదనతో అలహాబాద్ హైకోర్టు ఏకీభవించింది. రాయ్‌బరేలీ నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని ప్రకటించింది. అంతేగాక ఆరేళ్ల పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. దాంతో చిర్రెత్తుకొచి్చన ఇందిర 1975లో దేశమంతటా ఎమర్జెన్సీ విధించారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లి రాజ్‌నారాయణ్ చేతిలో 50 వేల పైగా ఓట్ల తేడాతో ఓడారు. ఇది భారత ఎన్నికల చరిత్రలోనే సంచలనాత్మక ఫలితంగా నిలిచిపోయింది.
మినూ మసాని
మినోచర్ రుస్తోమ్ మసాని. స్వాతంత్య్ర సమరయోధుడు. స్వతంత్ర పార్టీ అగ్ర నేత. మూడుసార్లు పార్లమెంటు సభ్యుడు, ఇండియన్ లిబరల్ గ్రూప్ థింక్ ట్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరు. సంపాదకుడు, సామాజిక కార్యకర్త. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అసమానతలకు వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపించిన మసాని 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌కోట్ నుంచి ఓటమి చవిచూడాల్సి వచి్చంది. కాంగ్రెస్ నాయకుడు ఘన్‌శ్యామ్ బాయ్ ఓజా చేతిలో 60,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.
అటల్ బిహారీ వాజ్‌పేయ్
రాజకీయ దురంధరుడు. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ఆయనకూ ఎన్నికల ఓటమి తప్పలేదు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కీలక కాంగ్రేసేతర నేతల్లో వాజ్‌పేయి ఒకరు. గ్వాలియర్‌లో కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా రెండు లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆయనపై విజయం సాధించారు.
సీకే జాఫర్ షరీఫ్
భారత రైల్వేల్లో స్వర్ణ యుగానికి నాంది పలికిన దార్శనికుడు. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు. 2004లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల ఎన్నికల బరిలో దిగిన హెచ్‌టీ సాంగ్లియానా చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటిదాకా డీజీపీగా ఉన్న సాంగ్లియానా బీజేపీ ఆహా్వనం మేరకు పదవీ విరమణ చేసి పారీ్టలో చేరారు. పాత బెంగళూరు ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి షరీఫ్‌పై విజయం సాధించారు.
దేవెగౌడ
అత్యంత అనుభవజు్ఞడైన నాయకుడు. ప్రధానిగా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. అనంతరం కర్నాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు. ఆయనకు కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2004లో కర్నాటకలోని కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత తేజస్వినీ గౌడ రమేశ్ చేతిలో లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
బిజోయ్ కృష్ణ హండిక్
గొప్ప విద్యావేత్త. కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన తిరుగులేని అస్సామీ నేత. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేపీ తాసా ఆయనపై లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు.
సోమనాథ్ ఛటర్జీ
సీపీఎం దిగ్గజం. పదిసార్లు లోక్‌సభ సభ్యునిగా గెలిచిన ఎదురులేని నేత. 1971లో తొలిసారి సీపీఎం తరఫున పశి్చమబెంగాల్లోని బుర్ద్వాన్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1984లో మాత్రం జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానంలో యువ సంచలనం మమతా బెనర్జీ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మాత్రం 1989 నుండి 2004 వరకు సోమనాథ్ విజయ పరంపర సాగింది. సీపీఎం కంచుకోటగా భావించే బోల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి 2004లో పదోసారి గెలిచి 14వ లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అరుణ్ జైట్లీ
పారీ్టలకతీతంగా అందరూ మెచ్చిన నేత. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. కేంద్ర ఆర్థిక మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిసారి మోదీ హవా కొనసాగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ మాత్రం ఓటమి చవిచూశారు. అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుంచి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెపె్టన్ అమరిందర్ సింగ్ లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో జైట్లీపై గెలుపొందారు.
పీవీ నరసింహారావు
పాములపర్తి వేంకట నరసింహారావు. ప్రధాని పదవిని అధిష్టించిన తొలి దక్షిణాది వ్యక్తి. ఒకే ఒక్క తెలుగువాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కుదేలైన దేశ ఆరి్ధక వ్యవస్థను విప్లవాత్మక సంస్కరణలతో పట్టాలెక్కించి ఆధునిక బాట పట్టించిన దార్శనికుడు. అంతటి నాయకునికి కూడా ప్రధాని కాకమునుపు ఓటమి తప్పలేదు. 1984 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన రెండు లోక్‌సభ స్థానాల్లో తెలంగాణలోని హన్మకొండ ఒకటి. బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి అక్కడ పీవీపై విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తినా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పీవీ మాత్రం ఓటమి చవిచూడటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment