
ఏది చెత్త? ఏది కొత్త? మహాత్మా!
అక్షర తూణీరం
చెత్త... చెత్త... ఎక్కడ విన్నా ఇదే మాట. ఎక్కడ చూసినా ఇదే మాట. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మోదీ ప్రధాని గా వచ్చాకనే ‘చెత్త స్పృహ’ దేశంలో పెరిగింది. అయితే అన్ని చెత్తలూ వ్యర్థాలు కావు. అన్ని వ్యర్థాలు చెత్తకావు. అసలు చెత్తంటే ఏంటి? దీన్ని అద్వైత సిద్ధాంతానికి అన్వ యించి వింగడిస్తే, చెత్త మూలాలు మనల్ని ఆశ్చర్య పరుస్తాయి. రేడియోని చెత్తగా భావించి అటకల మీద పారేశాం. ‘మనసులో మాట’ అంటూ మోదీ, బ్రదర్ ఒబామా రేడియోలో తెగ మాట్లాడేసుకోవడం విని, అట కల మీంచి దింపి రేడియోల దుమ్ము దులిపాం.
ఇప్పుడు పున్నమికీ, అమావాస్యకీ మోదీ రేడియోలోనే మనసు విప్పుతున్నారు. దాంతో చెత్త కాస్తా కొత్తగా మారింది. ‘చెత్త’ సాపేక్షం. అప్పటిదాకా ఒక పార్టీలో కింగ్‌పిన్‌గా ఉన్నాయన పార్టీ ఫిరాయించగానే ఉత్త చెత్త మూట అవుతాడు. అదే చెత్త మూట మారిన పార్టీలో జాకబ్ వజ్రంలా మెరుస్తుంటాడు. ఒక సాములారు ఎదురైతే చెత్త ప్రస్తావన తెచ్చి, అనుగ్రహ భాషణానికి అర్థిం చాను. స్వామి చిరునవ్వు నవ్వి, ఈ సృష్టిలో సత్యం, అసత్యం తప్ప ఇంకోటేమీ లేదన్నారు. ఇంతకీ మీరు సత్యమా, అసత్యమా అంటూ తెగించి అడిగాను. ‘‘అస త్యం’’ అంటూ కదిలారు స్వామి. రూపం నాకు కనిపిం చలేదు. అసలిదంతా నా భ్రమ కావచ్చు, పరమ చెత్త కావచ్చు.
కొన్ని చెత్త ఉదాహరణల్ని పరిశీలిద్దాం. చదివేసిన పేపర్లు మనకు పరమ చెత్త. పాత పేపర్ల వ్యాపారికి అదే బతుకు. టన్నుల కొద్దీ తలనీలాలు శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించుకుంటారు. కేశాలను స్వీక రించి, క్లేశాలను తొలగిస్తాడని నమ్మకం. అవి శ్రీవారికి కోట్ల ఆదాయాన్నిస్తాయి.
ప్రసిద్ధ సాహితీవేత్త వేటూరి ప్రభాకరశాస్త్రి ఇంటికి ఆయన శిష్యుడు వెళ్లాడు. మాటా మంచీ అయ్యాక శిష్యుడు రాత్రి భోజనం చేశాడు. ఎంగిలి విస్తరి పారెయ్య డానికి ఇంటి వెనక్కి వెళ్లి చీకట్లో చూడక గుంటలో దభేల్ మని పడ్డాడు. గురువు గారు సంగతి గ్రహించి ‘‘మా చెత్తగుంట ఇలా ఒక్కసారి నిండుతుందనుకోలేదోయ్!’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారట. సాహిత్య విష యంలో ‘చెత్త’ని బాగా వాడతారు. జీవితకాలంలో చాలా చెత్త ఉత్పత్తి చేశాడు. ‘అగ్ని దహించలేదు. జల ము హరించలేదు. చెదలారగించలేవు’’ అంటూ హాలా హలం లాంటిదని చెబుతారు. కొన్ని గొప్ప గొప్ప మ్యూజియమ్స్‌లో చాలా ఖరీదైన చెత్త ఉంటుందని ఒక పెద్దాయన అనుభవం మీద చెప్పాడు.
నిజానికి చెత్తలోనే వ్యాపారం నడుస్తుంది. ‘‘పాత చెత్త కుక్కర్, చెత్త గ్యాస్ స్టౌ, చెత్త మిక్సీలను సగౌర వంగా స్వీకరిస్తాం. కొత్త వాటిని సమర్పిస్తాం’’ అనే ప్రకటన కనిపిస్తే చాలు. కేక! ఆఖరికి పాత లోఉడుపులు తీసుకురండి, సరికొత్తవి తీసుకువెళ్లండి అనగానే భూకంపం వచ్చినట్టు ఇంట్లోంచి పరుగులు పరుగులు. చెత్తని ఎవ్వరూ భరించరు. పక్కింటి హద్దులో పడేసి చేతులు దులుపుకుంటాం. తిరిగి వాళ్లూ అంతే చేస్తారు. సృష్టిలో ఏ పదార్థాన్నీ సృష్టించలేం, నాశనం చేయలేం. అది మాత్రం సత్యం.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)